దర్శి, న్యూస్‌లైన్: సాగర్ కాలువలు జలకళను సంతరించుకోనున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.40 అడుగులకు చేరింది. మరో నాలుగడుగుల మేర నీరు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండినట్లే. బుధవారం సాయంత్రానికి సాగర్ ప్రాజెక్టు 26 క్రెస్టుగేట్లు ఐదడుగుల మేర ఎత్తి లక్షా 90 వేల 116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 8 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. సాగర్ కుడి కాలువ 53/2 మైలు వద్ద చేజెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని జోన్-2 కింద ఉన్న ప్రకాశం జిల్లాకు విడుదల చేశారు. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్లు ఎన్‌ఎస్పీ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 వద్దకు నీరు చేరేసరికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఆ తరువాత మూడేళ్లపాటు సరిగా వర్షాలు కురవలేదు. దీంతో జలాశయంలో నీటి నిల్వ డెడ్‌స్టోరేజ్‌కు చేరింది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వారం రోజులుగా సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీరందించగలమని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ యల్లారెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులంతా ఖరీఫ్‌లో వరిసాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం:
ఈ ఏడాది ముందస్తుగా సాగర్ కాలువలకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. మాగాణి సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాది సాగుచేయక రైతులు రాబడి కోల్పోయారు. ఆయకట్టులో సాగు పనులుంటే కూలీలకు కూడా దండిగా ఉపాధి లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలసలు తప్పుతాయి. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మాగాణి సాగవుతుంది. ఎకరాకు 35 నుండి 40 మంది కూలీలకు పని లభిస్తుంది.
ఆధునికీకరణ పనుల నిలిపివేత
త్రిపురాంతకం, న్యూస్‌లైన్: సాగర్ జలాశయానికి సమృద్ధిగా నీరు చేరి కుడి కాలువకు విడుదల చేయడంతో మరో రెండు రోజుల్లో జిల్లాకు సాగర్ జలాలు అందనున్నాయి. సాగర్ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజర్లకు నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ ప్రధాన కాలువ, మేజర్లపై చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. కాలువలకు నీళ్లు వదులుతుండటంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించారు. సాగర్ జలాలు వస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకోగా, మరికొన్ని చోట్ల నారుమళ్లు పోశారు. తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగా నీరు విడుదల చేస్తామని సాగర్ అధికారులు తెలిపారు. వీటితో తాగునీటి చెరువులు, ఎస్‌ఎస్ ట్యాంకులు నింపనున్నట్లు తెలుస్తోంది.
సాగర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
Published Thu, Aug 8 2013 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement