sagar project
-
సరళాసాగర్ ఖాళీ..!
వనపర్తి: రెండు రోజుల క్రితం వరకు నిండుకుండలా.. జలకళతో తొణికిసలాడిన సరళాసాగర్ ప్రాజెక్టు బుధవారం ఖాళీగా మారి మట్టి మేటలతో దర్శనమిచ్చింది. కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ఊర్లూ, వాగులు వంకలు దాటుతూ వందలాది కిలోమీటర్లు పరుగులెడుతూ.. వచ్చిన కృష్ణమ్మ కొమ్మిరెడ్డిపల్లి చెరువులో నుంచి నేటికీ కొద్దిపాటి నీటిధార సరళాసాగర్ ప్రాజెక్టులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులోకి వచ్చిన ప్రతీ నీటిచుక్క గండిపడిన ప్రదేశం నుంచి దిగువన ఉన్న రామన్‌పాడు జలాశయంలోకి వెళ్తున్నాయి. ఖాళీ అయిన సరళాసాగర్ ప్రాజెక్టులోని గుంతల్లో బురదలో ఉన్న చెపలు పట్టేందుకు మత్స్యకారులు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నీరుపోయి.. మట్టిమేటలు దర్శనం 771ఎకరాల వైశాల్యం గల సరళాసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నల్లని మట్టి మేటలు, చేపలు పట్టే మనుషులతో దర్శనమిస్తోంది. ప్రాజెక్టులో నీటిని చూసి నారుమడులు వేసుకున్న రైతులు రెండవ రోజు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా మా కొంప ముంచారంటూ వారు శపనార్థాలు పెట్టడం కనిపించింది. ఇదిలాఉండగా, మంగళవారం సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడి సుమారు 0.5 టీఎంసీల నీరు వృథాగా దిగువునకు వెళ్లటంతో పాటు రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద సైతం నీటితో పాటు దిగువకు వెళ్లిపోయింది. టన్నుల కొద్ది చేపలు నీటి ప్రవాహంలో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి కాల్వ పొడవునా.. మట్టిలో మృతి చెంది పడ్డాయి. చనిపోయిన చేపల వలన దుర్వాసన వెదజల్లుతోంది. రెండోరోజు కొనసాగిన సర్వే సరళాసాగర్ కట్ట పునఃనిర్మాణం, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు ఏర్పాటు చేయాల్సిన రింగ్ బండ్, సమాంతరల కాల్వను తవ్వేందుకు ఇరిగేషన్ బోర్డు అధికారులు రెండవ రోజైన బుధవారం సర్వే చేశారు. కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి వచ్చే కేఎల్ఐ నీటిని సరళాసాగర్ ప్రాజెక్టులోని కుడి,ఎ డమ కాల్వలకు ఆయకట్టును బట్టి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐబీ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశం రింగ్‌బండ్, ప్రాజెక్టులో తాత్కాలిక సమాంతర కాల్వను తవ్వేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ ఎన్ని రోజులు వస్తాయో తెలియని పరిస్థితి కాబట్టి రైతులు అధికారుల మాటలను నమ్ముకుని యాసంగి పంట సాగు చేసేందుకు ముందుకు వస్తారా అన్నది ప్రశ్నార్థమే. -
రైతుల ఆశలకు గండి
వనపర్తి: ఆసియాలోనే సైఫన్ సిస్టంతో పనిచేసే రెండో ప్రాజెక్టు సరళాసాగర్‌కు దశాబ్దకాలం తర్వాత పూర్తిస్థాయిలో నీరు చేరిందన్న అన్నదాతల ఆశలకు గండి పడింది. రెండు నెలలుగా భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సరళాసాగర్‌కు రెండు వైపుల నుంచి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వనపర్తి జిల్లాలోని 16 గ్రామాల్లో వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా పేరొందిన సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం గండిపడటంతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాజెక్టు చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు రెండుసార్లు పుష్కలంగా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఖాళీ అవడంతో ప్రస్తుత యాసంగికి నారుమడులు సిద్ధం చేసిన రైతులు నిరాశకు గురయ్యారు. నిర్దేశిత ఆయకట్టు.. సరళాసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద 4,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీరు పుష్కలంగా ఉండటంతో నిర్దేశిత ఆయకట్టు కంటే ఎక్కువనే సాగు చేస్తారు. సుమారు 5 వేల ఎకరాల్లో యాసంగి వరి నాటేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రాజెక్టుకు గండిపడటంతో సరళాసాగర్ ప్రాజెక్టు కింది రైతులు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రాజెక్టుకు గండిపడినప్పుడు ఉధృతంగా దిగువకు పారిన నీరు కొద్ది కొద్దిగా గండి వెడల్పును పెంచుతూ వచ్చింది. ఉదయం 9.30 గంటల సమయానికి గండి 30 మీటర్ల వెడల్పునకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న 0.5 టీఎంసీల నీరు పూర్తిగా దిగువకు వెళ్లటంతోపాటు ఇంకా సరళా ప్రాజెక్టులోకి కొమిరెడ్డిపల్లి వాగు నుంచి వస్తున్న కేఎల్ఐ నీరు సైతం గండిపడిన ప్రదేశం నుంచి రామన్‌పాడ్ ప్రాజెక్టుకు వెళ్తోంది. మంత్రి అప్రమత్తతతో.. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉదయం 8 గంటలకు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. నీరు ఉధృతంగా దిగువకు వెళ్తుండటంతో రామన్‌పాడ్ జలాశయం అధికారులను అప్రమత్తం చేసి గేట్లను ఎత్తింపజేశారు. అధికారులు పది గేట్ల నుంచి రామన్‌పాడ్ నుంచి నీటిని కృష్ణానదిలోకి ఊకచెట్టువాగు నుంచి వదిలేశారు. దీంతో ముప్పు తప్పింది. లేదంటే భీమా ప్రాజెక్టు లిఫ్టులు, సరళాసాగర్ లిఫ్టు, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరందించే.. ఇంటెక్‌వెల్స్ సైతం మునిగిపోయేవి. నాలుగు గంటలపాటు దిగువకు.. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సుమారు నాలుగు గంటలపాటు సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు పారింది. సరళాసాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 0.5 టీఎంసీలు పూర్తిగా ఖాళీ అయ్యింది. 22 అడుగులకు చేరినా.. సరళాసాగర్ జలాశాయం సామర్థ్యం 22 అడుగుల వరకు నీరు చేరినా.. సైఫాన్లు తెరుచుకోలేదు. ప్రాజెక్టులోని సైఫాన్ల పక్కన ఉన్న మట్టికట్టపై చెట్లు పెరిగి కట్టబలహీనంగా మారింది. ఏదైనా మరమ్మతు చేయాలని గడిచిన నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు సమీప గ్రామాల రైతులు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా వారు అధికారులు స్పందించలేదు. రైతులు చెప్పిన వెంటనే అప్రమత్తమై ఉంటే.. ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు. సాగుపై తీవ్ర ప్రభావం.. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి చుట్టుపక్కల 16 గ్రామాల రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ప్రాజెక్టు పైభాగంలో వర్నె, ముత్యాలపల్లి, కనిమెట్ట, పాతజంగమాయపల్లి, చిలకోటినిపల్లి, బలీదుపల్లి, కన్మనూరు ఉండగా.. నిర్దేశిత ఆయకట్టు గల దిగువ ప్రాంతంలో అజ్జకొల్లు, శంకరంపేట, రామన్‌పాడ్, తిరుమలాయపల్లి, కొన్నూరు, నెల్విడి, నర్సింగాపుర్ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం గండి పడటంతో సాగునీటిపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. రెండోసారి గండి.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏడు దశాబ్దాల క్రితం రూ.35 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ఆటోమెటిక్ సైఫాన్ సిస్టంతో ఈ ప్రాజెక్టును నిర్మించి 1959లో ప్రారంభించారు. ఆ తర్వాత 1964లో ఒకసారి భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండి సైఫాన్స్ పక్కనే కుడివైపు కట్టకు గండిపడింది. నీటి ప్రవాహానికి కొన్నూరు, మదనాపురం గ్రామాల మధ్యలోని రైల్వేలైన్ సైతం పెకిలిపోయి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మళ్లీ 55 ఏళ్ల తర్వాత ఈసారి ఎడమవైపు సైఫాన్స్‌కు పక్కనే కట్టకు గండిపడంది. పరిశీలించిన మంత్రి, కలెక్టర్ వనపర్తి జిల్లాకే తలమానికంగా చెప్పుకొనే సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపండిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సరళాసాగర్ ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ఎలాంటి సాంకేతిక లోపాల కారణంగా గండిపడిందో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి గండి పడిన ప్రాంతాన్ని చూశారు. కొందరు స్థానికులు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపారు. అధికారులకు విన్నవించా.. ఇరిగేషన్ అధికారులకు సరళాసాగర్ ప్రాజెక్టు కట్ట బలహీనంగా మారింది. రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతోంది. ఒక్కసారి పర్యవేక్షణ చేయాలని గత పదిరోజుల క్రితం చెప్పాను. అధికారులు స్పందించి రెండు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేసి కట్టకు మరమ్మతు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.– కురుమూర్తి, రైతు, శంకరంపేట, మదనాపురం మండలం -
సరళాసాగర్ ప్రాజెక్ట్ కరకట్టకు గండి
-
సాగర్ కాంట్రాక్టర్ పరార్...!
‘వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పనులను ఇక పరుగెత్తిస్తా..! నిధులు మంజూరయ్యాయి. ఇక కొద్ది రోజుల్లో సాగునీరు అందిస్తాం...’ ఇవీ మంత్రి పదవి వచ్చిన వెంటనే సుజయకృష్ణ రంగారావు రైతులకు ఇచ్చిన హామీ. అయితే ఈ పనులు ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులకు సంబంధించి ఇటు మంత్రిగాని, అటు ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. దీంతో సాగునీటి కోసం అదనపు ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి : వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ పనులను 20 శాతం కూడా చేయకుండానే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. పనులు ప్రారంభించి కొన్ని చోట్ల చేపట్టిన పనులను ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేయడమే తప్ప వాటిని పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం వారు చేసిన ఫోన్లనూ లిఫ్ట్ చేయడం లేదు. వెంగళరాయ సాగర్ పనులు ఈ ఖరీఫ్‌కే కాదు వచ్చే ఖరీఫ్‌కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2013లో శంకుస్థాపన చేసినపుడు ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా రైతులకు కేవలం 18 నెలల్లో సాగునీరు అందిస్తామని మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యే హోదాలో హామీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై ఆ తరువాత పార్టీ మార్చి మంత్రి అయిన తరువాత జూట్ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా అదనపు జలాల ప్రాజెక్టునూ పరుగులెత్తిస్తామన్నారు. కానీ ఏ పనీ సాగడం లేదు. మంత్రి పదవి వచ్చాక ఇచ్చిన హామీ కనుక ఇక మాకు భయం లేదు...సాగునీరు అందుతుందనుకుంటున్న రైతులు ఇప్పుడు మా నోట్లో మట్టికొట్టారని వాపోతున్నారు. వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులను చేపడుతున్న ఆర్ఆర్ కనస్ట్రక్షన్స్ పనులను నిలిపివేసి ఏడాదవుతున్నా అధికారులుగానీ, ఇటు పనులు ప్రారంభించి సాగునీరందిస్తామన్న మంత్రి సుజయకృష్ణ రంగారావుగానీ పట్టించుకోకపోవడంతో అదనపు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 శాతం లెస్సుకు వేసినపుడే అనుమానం రావాలిగా! వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ టెండర్‌ను 17 శాతం లెస్సుకు వేశారు. అప్పుడైనా ప్రజాప్రతినిధులు, అధికారులకు అనుమానం రావాలి. కానీ ఎంచక్కా పనులు ప్రారంభించారు. ఇప్పుడు నష్టాలొస్తున్నాయంటూ పనులు నిలిపివేశారు. నిధులేమో మూలుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. ప్రారంభంలో కాంట్రాక్టర్‌కు ప్రతీ 15 రోజులకూ నోటీసులు జారీ చేస్తున్నప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయన్న కాంట్రాక్టర్ ఇప్పుడు ఏకంగా ఫోన్లు కూడా ఎత్తడం లేదని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణే పూర్తి కాని వైనం 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని రైతాంగం ఎదురు చూస్తున్నది. సీతానగరం మండలంలోని 5 గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబందించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు పలుమార్లు దాటిపోయింది. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడం కానీ మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం కానీ చేయాలి. ఆ తరువాత కొత్తగా టెండర్ వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నేటికీ కాంట్రాక్టర్‌ను మార్చే ప్రతిపాదనలు కానీ ప్రభుత్వానికి నివేదించడం కానీ చేయకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రైతులు ఆరోపిస్తున్నారు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం 23.78 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రూ.3కోట్లతో వయాడెక్ట్ నిర్మించేందుకు భూసార పరీక్షలు చేసేందుకు సుమారు పది నెలలవుతోంది. ఎస్ హయాంలోనే శంకుస్థాపన జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుగా పేరొందిన వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా 24వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరందుతున్నా జలాశయ సామరŠాధ్యన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కిందట అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వరుసగా అంచనాలను పెంచుకుంటూ పోయి నేటికి రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంతకన్నా తక్కువే అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి రాస్తాం.. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఎన్నోమార్లు నోటీసులు ఇచ్చాం. స్పందన లేదు. ఇప్పుడు ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. కొత్తగా మరే కాంట్రాక్టర్ కూడా లెస్సుకు ఉండటం వల్ల రావడం లేదు. ఈ విషయమే ప్రభుత్వానికి రాస్తున్నాం. – కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్ -
రేపటినుంచి సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
- తొమ్మిది రోజులపాటు పరిశీలించనున్న ప్రపంచబ్యాంకు ప్రతినిధులు - మధ్యంతర నివేదిక కోసం వస్తున్నారని పీడీ మల్సూర్ వెల్లడి నాగార్జునసాగర్ : ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించనున్నట్లు సాగర్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్సూర్ తెలిపారు. సోమవారం విజయవిహార్ అతిథిగృహంలో డ్యాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఆధునికీకరణ పనుల వివరాలను ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అందజేసేందుకు వీలుగా అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అవసరమైన అన్ని వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన డ్యాం అధికారులను కోరారు. అనంతరం మల్సూర్ విలేకరులతో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన, ఆలస్యమైన పనులను వేగవంతం చేసేందుకు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనుల వివరాలకు సం బంధించి మధ్యంతర నివేదిక పొందుపరచడానికి ప్రపంచబ్యాంకు ప్రతిని ధులు వస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ప్రధానకాలువకు సంబంధిం చి మూడు ప్యాకేజీలు నూరు శాతం పూర్తయినట్లు చెప్పారు. నాలుగు ప్యాకేజీలు 90శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలినవి 60శాతం వరకు జరిగినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ పనులు 40శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆధునికీకరణ పనులకు ఇప్పటివరకు రూ.3,300 కోట్లు వ్యయం చేసే పనులు ప్రతిపాదించగా 2,300కోట్ల రూపాయల విలువచేసే పనులను ప్రారంభించామని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.1450కోట్లు ఖర్చయినట్లు వివరించారు.సాగర్ కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో డ్యాం ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్, డీఈ చందునాయక్ తదితరులున్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం
కోదాడటౌన్ : సాగర్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరుతున్నందున స్థిరీకరించిన ఆయకట్టు మొత్తానికి నీటిని అందించేందుకు తగిన ప్రణాళికను తయారు చేశామన్నారు. ఇకనుంచి ఆంధ్రప్రాంత జలదోపిడీ ఉండదన్నారు. కాలువ ల డిజైన్ మేరకు నీటిని విడుదల చేస్తామని, నీటిని తక్కువ విడుదల చేసి పంటలు ఎండిపోవడానికి అధికారులు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ రంగానికి తగినంత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, వల్లూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగాలా... సాగాలా!
సాగునీటి విడుదలపై వీడని సందిగ్ధత శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు విడుదల ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరేందుకు 15 రోజుల సమయం పట్టే అవకాశం వర్షాలపైనే రైతుల ఆశలు కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో డెల్టా రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురి స్తున్నాయి. అయితే సాగునీరు విడుదల చేసే తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో డెల్టాతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నం : జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా జూలై నెలాఖరుకు కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 5.89 లక్షల ఎకరాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ తరుణంలోనూ ప్రభుత్వం డెల్టాకు నీటి విడుదల అంశంపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు కాలువలకు విడుదల చేసిన నీటిని తాగు అవసరాలకే వాడాలని నీటిపారుదల శాఖాధికారులు స్పష్టంచేశారు. జూలైలో వర్షంపైనే నమ్మకం పెట్టుకుని రైతులు నారుమడులు పోసుకున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 25 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, మరో 15 వేల ఎకరాల్లో బోరునీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. నారుమడులతో పాటు వరినాట్లు పూర్తయిన పొలాలకు నీరు అందక పైరు చనిపోయే స్థితికి చేరుకుంది. ఈ దశలో జూలై ఆఖరి వారంలో కురిసిన వర్షాలకు నారుమడులు, నాట్లు పూర్తయిన పొలాల్లో పైరు జీవంపోసుకుంది. అయితే వరిసాగు సజావుగా సాగాలంటే కాలువలకు సాగునీరు విడుదల చేయాల్సిందేనని రైతులు కోరుతున్నారు. మరో 15 రోజులు ఆగాల్సిందేనా..! ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండాయని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. జూరాల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోందని పేర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీరు చేరాలి. అనంతరం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సాగునీరు విడుదల జరగాలి. ఎగువ రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతుందని జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖాధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రాష్ట్ర విభజన నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి ఎప్పటికీ సాగునీటి విడుదల చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాడెల్టాలో ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీరు సరిపోతుంది. అయితే పాలకులు మాత్రం సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పకుండా డెల్టా రైతులకు మంచే జరుగుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. గత ఏడాదీ ఆలస్యం గానే సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 350 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ ఏడాది ఇంత వరకు సాగునీటి విడుదలపై అధికారిక ప్రకటన చేయలేదు. అవసరమైన సమయంలో సాగునీటిని విడుదల చేయకుండా ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటిని సముద్రంలోకి వదిలే పరిస్థితి ఈ ఏడాదీ ఉంటుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండో పంటపైనా ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో సముద్రతీరంలోని మండలాల్లో ఇప్పటికీ నారుమడులు పోస్తూనే ఉన్నారు. ఈ నెల 15వ తేదీనాటికి వరినాట్లు పూర్తి చేయకుంటే ఆ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసినా కాలువలకు నీరు విడుదల చేయకుంటే ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో వరినాట్లు పూర్తిచేస్తే నవంబర్ నాటికి పొట్టదశకు చేరుతుంది. ఈ నెలలో సంభవించే తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పైర్ల దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వరినాట్లు ఆలస్యమై డిసెంబర్లో కోతలు పూర్తిచేస్తే రెండో పంట మినుముకు సాగు చేసేందుకు సమయం చాలదు. డిసెంబర్ వరకు వరికోతలు పూర్తి చేయకుంటే చలిగాలుల ప్రభావంతో వరికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని, పక్వానికి వచ్చిన కంకులకు మెడ విరుపు తెగులు వ్యాపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి డెల్టాకు సాగునీటికి విడుదలకు కృషిచేయాలని కోరుతున్నారు. -
సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నిర్బంధం
నాగార్జునసాగర్ :నాగార్జునప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ ఎల్లారెడ్డిని ఎన్నెస్పీ ఉద్యోగులు ఆయన కార్యాలయంలో మంగళవారం నిర్బంధించారు. గతనెల వేతనాలందక ఉద్యోగులు వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే అన్ని కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేస్తూ సీఈ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులను,అధికారులను బయటకు పంపి సీఈ చాంబర్‌కు వెళ్లారు అక్కడ సీఈ ఉండటంతో మాకువేతనాలు ఇప్పించేంత వరకు కార్యాలయంలోనే ఉండాలని సాయంత్రం వరకు కూర్చున్నారు. పీఏఓతో చెప్పి వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు పీఏఓ రమణారావు వద్దకు వెళ్లి వేతనాల విషయంపై వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆయనపై చేయిచేసుకునే వరకు వెళ్లారు. మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో.. పేఅండ్‌అకౌంట్ జేడీతో చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తే వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందు లేమీ లేవన్నారు. ఫైళ్లు ప్రభుత్వం వద్దనే ఉన్నట్లుగా సీఈ తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శికి ఫోన్‌చేయగా సంబంధిత ఫైల్ చూడాల్సిన అధికారి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. చివరకు అడ్వాన్సు రూపేణా చెల్లిం చేందుకు గాను అధికారులతో మాట్లాడారు. మూడు రో జుల్లో వేతనాలు ఇప్పించడానికి కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమం లో ఉద్యోగ సం ఘాల నాయకులు పాల్గొన్నారు. -
అయ్యో.. కృష్ణమ్మ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: పాలకుల నిర్లక్ష్యంతో కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా లక్షలాది క్యూసెక్కుల నీరు... సముద్రం వైపు పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకునే ముందుచూపు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సాగర్ ప్రాజెక్టు ఎగువన ఏళ్ల కిందటే మొదలుపెట్టిన ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తికాకపోవడం వల్ల వరద నీటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. 2005 సంవత్సరం నుంచి వరుసగా ఏడేళ్లు సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. 2012 సంవత్సరంలో మినహాయిస్తే సాగర్ నిత్యం జలకళతోనే ఉంది. ఈ సీజన్లో ఆగస్టు మొదటివారంలోనే సాగర జలాశయం పూర్తిగా నిండింది. దీంతో గడిచిన రెండు రోజులుగా వరద నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేశారు. అయితే, దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతున్న వరద నీటి తో ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం వరకు అట్టిపెట్టుకుని మిగిలిన నీటిని దిగువ కష్ణానదిలోకి వదిలేస్తున్నారు. బుధవారం దశల వారీగా గేట్లు ఎత్తిన అధికారులు మొత్తంగా 24 క్రస్ట్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కులు నీటిని కిందికి వదిలారు. గురువారం మధ్యాహ్నం 12గంటల దాకా ఇదే పరిస్థితి. రాత్రి ఏడుగంటల వరకు మొత్తం గేట్లు మూసేశారు. ఈలోగానే లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు చేరింది. ఇంజినీరింగ్ అధికారుల సమాచారం మేరకు 11,574 క్యూసెక్కుల నీరంటే 1 టీఎంసీకి సమానం. ఒక్క టీఎంసీతో 574 ఎకరాలకు సాగునీటిని అందివచ్చు. ఈలెక్కన ఎంత నీరు వృథా అయ్యిందో ఓ అంచనాకు రావొచ్చు. అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు 2005లో నెల రోజుల పాటు గేట్ల ద్వారా విడుదల చేసిన నీరు 558 టీఎంసీలు. అదే మాదిరిగా 2006 - 571 టీఎంసీలు, 2007- 576 టీఎంసీలు, 2008-588 టీఎంసీలు, 2009-541 టీఎంసీలు, 2010లో 587 టీఎంసీలపై చిలుకు నీటిని కిందకు విడుదల చేశారు. 2011, ఈ ఏడాది విడుదల చేసిన నీటి మొత్తాల వివరాలు అందాల్సి ఉంది. ఈ గణాంకాలను పరిశీలించినా చాలు ఎంతటి విలువైన నీరు వృథా అయ్యిందో అర్థం చేసుకోవడానికి. 2012లో తీవ్ర వర్షాభావంతో నాగార్జునసాగర్ ఆయకట్టు పూర్తిగా ఎండిపోయింది. కానీ, అంతకు ముందు ఏడాది పూర్తిగా నిండినా, వరద నీటిని నిల్వ చేసుకోలేక, మరుసటి ఏడాది రైతులు కరువు కోరలకు చిక్కాల్సి వచ్చింది. ఏడిపిస్తున్న ... ఏఎంఆర్పీ సాగర్ జలాశయంపై ఆధారపడిన ఏఎంఆర్పీ(ఎస్ఎల్బీసీ) పూర్తిస్థాయిలో రైతాంగాన్ని ఆదుకోలేకపోతోంది. ఏఎంఆర్పీ పరిధిలోని ఏకేబీఆర్(అక్కంపల్లి రిజర్వాయర్)ను నింపడం ద్వారా వరికి పూర్తిస్థాయిలో నీటిని ఇచ్చే అవకాశం ఉన్నా విఫలమవుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఏఎంఆర్పీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టుకు అనుంబంధంగా ఉన్న ఉదయసముద్రం రిజర్వాయరును పూర్తిస్థాయిలో నింపితే నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు నీరు అందేది. కృష్ణా వరద జలాలను సద్వినియోగం చేసేందుకు మహానేత దివంగత సీఎం డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఉదయసముద్రం ఎత్తిపోతల (బ్రాహ్మణవెల్లెంల) పథకం పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం నాడు వైఎస్ రూ.562కోట్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వంలో బడ్జెట్ అంతంత మాత్రంగానే విడుదలవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు 25శాతం పనులే పూర్తి చేశారు. నత్తకు నడకలు నేర్పుతున్న వరద కాల్వ కృష్ణా వరద నీటిని సద్వినియోగం చేసి నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో శంకుస్థాపన రాయి పడిన సాగర్ వరద కాల్వ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. సాగర్ జలాశయంలో నీటిమట్టం 570 అడుగులకు చేరగానే వరద కాల్వకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయొచ్చు. నీటిమట్టం 570 అడుగులకు తగ్గితే పంపింగ్ ద్వారా నీటిని విడుదల చే యొచ్చు. కానీ, 2009లో పనులు పూర్తి కావాల్సిన వరదకాల్వ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ కాల్వ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 80వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఏఎంఆర్పీ, సాగర్ వరద కాల్వల ద్వారా సుమారు వందకు పైగా చెరువులను నీటితో నింపే వీలుంది. ఒకసారి చెరువులను నింపితే కలిగే లాభం అంతాఇంతా కాదు. కానీ, ఈ విషయాలేవీ ఎవరికీ పట్టడం లేదు. -
సాగర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
దర్శి, న్యూస్‌లైన్: సాగర్ కాలువలు జలకళను సంతరించుకోనున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.40 అడుగులకు చేరింది. మరో నాలుగడుగుల మేర నీరు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండినట్లే. బుధవారం సాయంత్రానికి సాగర్ ప్రాజెక్టు 26 క్రెస్టుగేట్లు ఐదడుగుల మేర ఎత్తి లక్షా 90 వేల 116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 8 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. సాగర్ కుడి కాలువ 53/2 మైలు వద్ద చేజెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని జోన్-2 కింద ఉన్న ప్రకాశం జిల్లాకు విడుదల చేశారు. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 వద్దకు నీరు చేరేసరికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఆ తరువాత మూడేళ్లపాటు సరిగా వర్షాలు కురవలేదు. దీంతో జలాశయంలో నీటి నిల్వ డెడ్‌స్టోరేజ్‌కు చేరింది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వారం రోజులుగా సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీరందించగలమని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ యల్లారెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులంతా ఖరీఫ్‌లో వరిసాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం: ఈ ఏడాది ముందస్తుగా సాగర్ కాలువలకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. మాగాణి సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాది సాగుచేయక రైతులు రాబడి కోల్పోయారు. ఆయకట్టులో సాగు పనులుంటే కూలీలకు కూడా దండిగా ఉపాధి లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలసలు తప్పుతాయి. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మాగాణి సాగవుతుంది. ఎకరాకు 35 నుండి 40 మంది కూలీలకు పని లభిస్తుంది. ఆధునికీకరణ పనుల నిలిపివేత త్రిపురాంతకం, న్యూస్‌లైన్: సాగర్ జలాశయానికి సమృద్ధిగా నీరు చేరి కుడి కాలువకు విడుదల చేయడంతో మరో రెండు రోజుల్లో జిల్లాకు సాగర్ జలాలు అందనున్నాయి. సాగర్ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజర్లకు నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ ప్రధాన కాలువ, మేజర్లపై చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. కాలువలకు నీళ్లు వదులుతుండటంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించారు. సాగర్ జలాలు వస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకోగా, మరికొన్ని చోట్ల నారుమళ్లు పోశారు. తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగా నీరు విడుదల చేస్తామని సాగర్ అధికారులు తెలిపారు. వీటితో తాగునీటి చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపనున్నట్లు తెలుస్తోంది.