ఆగాలా... సాగాలా! | There irrigated sin release | Sakshi
Sakshi News home page

ఆగాలా... సాగాలా!

Published Fri, Aug 1 2014 2:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ఆగాలా... సాగాలా! - Sakshi

ఆగాలా... సాగాలా!

  •   సాగునీటి విడుదలపై వీడని సందిగ్ధత
  •   శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు విడుదల
  •   ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరేందుకు  15 రోజుల సమయం పట్టే అవకాశం
  •   వర్షాలపైనే రైతుల ఆశలు
  • కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో డెల్టా రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురి స్తున్నాయి. అయితే సాగునీరు విడుదల చేసే తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో డెల్టాతో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
     
    మచిలీపట్నం : జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా జూలై నెలాఖరుకు కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 5.89 లక్షల ఎకరాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ తరుణంలోనూ ప్రభుత్వం డెల్టాకు నీటి విడుదల అంశంపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు కాలువలకు విడుదల చేసిన నీటిని తాగు అవసరాలకే వాడాలని నీటిపారుదల శాఖాధికారులు స్పష్టంచేశారు. జూలైలో వర్షంపైనే నమ్మకం పెట్టుకుని రైతులు నారుమడులు పోసుకున్నారు.

    వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 25 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, మరో 15 వేల ఎకరాల్లో బోరునీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. నారుమడులతో పాటు వరినాట్లు పూర్తయిన పొలాలకు నీరు అందక పైరు చనిపోయే స్థితికి చేరుకుంది. ఈ దశలో జూలై  ఆఖరి వారంలో కురిసిన వర్షాలకు నారుమడులు, నాట్లు పూర్తయిన పొలాల్లో పైరు జీవంపోసుకుంది. అయితే వరిసాగు సజావుగా సాగాలంటే కాలువలకు సాగునీరు విడుదల చేయాల్సిందేనని రైతులు కోరుతున్నారు.  
     
    మరో 15 రోజులు ఆగాల్సిందేనా..!

    ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండాయని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. జూరాల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోందని పేర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీరు చేరాలి.
     
    అనంతరం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సాగునీరు విడుదల జరగాలి. ఎగువ రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతుందని జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖాధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రాష్ట్ర విభజన నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి ఎప్పటికీ సాగునీటి విడుదల చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.

    కృష్ణాడెల్టాలో ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీరు సరిపోతుంది. అయితే పాలకులు మాత్రం సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పకుండా డెల్టా రైతులకు మంచే జరుగుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. గత ఏడాదీ ఆలస్యం గానే సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 350 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ ఏడాది ఇంత వరకు సాగునీటి విడుదలపై అధికారిక ప్రకటన చేయలేదు. అవసరమైన సమయంలో సాగునీటిని విడుదల చేయకుండా ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటిని సముద్రంలోకి వదిలే పరిస్థితి ఈ ఏడాదీ ఉంటుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది.
     
    రెండో పంటపైనా ప్రభావం

    ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో సముద్రతీరంలోని మండలాల్లో ఇప్పటికీ నారుమడులు పోస్తూనే ఉన్నారు. ఈ నెల 15వ తేదీనాటికి వరినాట్లు పూర్తి చేయకుంటే ఆ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసినా కాలువలకు నీరు విడుదల చేయకుంటే ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో వరినాట్లు పూర్తిచేస్తే నవంబర్ నాటికి పొట్టదశకు చేరుతుంది.

    ఈ నెలలో సంభవించే తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పైర్ల దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వరినాట్లు ఆలస్యమై డిసెంబర్‌లో కోతలు పూర్తిచేస్తే రెండో పంట మినుముకు సాగు చేసేందుకు సమయం చాలదు. డిసెంబర్ వరకు వరికోతలు పూర్తి చేయకుంటే చలిగాలుల ప్రభావంతో వరికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని, పక్వానికి వచ్చిన కంకులకు మెడ విరుపు తెగులు వ్యాపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి డెల్టాకు సాగునీటికి విడుదలకు కృషిచేయాలని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement