Hopes of farmers
-
చిగురిస్తున్న ఆశలు..
ధర్పల్లి : రామడుగు ప్రాజెక్ట్ ఎత్తిపోతల ద్వారా దుబ్బాక గ్రామానికి సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు నిజామాబాద్ ఎంపీ కవిత శనివారం జలసౌధ సమావేశంలో విన్నవించటంతో రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి. దుబ్బాక గ్రామానికి ప్రాజెక్ట్ ఎత్తిపోతల ద్వారా రూ.5 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎత్తిపోతల పనులు పూర్తి అయితే గ్రామంలోని సుమారు 314 ఎకరాలను సాగునీరు అందనుంది. దీంతోపాటు తాగునీటి కష్టాలు తీరే రోజులు రానున్నాయి. వైఎస్ హయాంలోనే పునాది.. రామడుగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకు 2006లోనే రూ.20 కోట్లు కేటాయించారు. గతంలోని ప్రాజెక్ట్ కింద 11 గ్రామాలకు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆధునీకరణ పనులతో ప్రాజెక్ట్ ఆయకట్టు సామర్థ్యం పెంచుతూ మరో రెండు వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు చేపట్టారు. దీంతో కొత్తగా నాలుగు గ్రామాలను పూర్తి స్థాయిలో 7 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లోని రామడుగు గ్రామానికి వచ్చి ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేశారు. అప్పట్లోనే ప్రాజెక్ట్ ద్వారా 7 వేల ఎకరాల సాగునీటి వాటాలోని దుబ్బాక గ్రామానికి సుమారు 314 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించేలా ఇరిగేషన్ శాఖలోని రికార్డులు ఉన్నాయి. ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామం మాత్రమే ఆర్మూర్ నియోజకవర్గంలో ఉండేది. గ్రామానికి సాగునీటి కష్టాలు తీరేలా గ్రామస్తులంతా కలిసి అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను పలుమార్లు కలిసి విన్నవించారు. దుబ్బాక రైతుల నీటి కష్టాలు తీర్చేందుకు 2004లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలు వివరించారు. వైఎస్ దుబ్బాక రైతుల మొరను తీర్చేందుకు రామడుగు ప్రాజెక్ట్ ఆధునీరణ పనుల నిధుల్లోనే ఎత్తిపోతలతో సాగునీటిని అందించాలని వాటా కల్పించారు. నెరవేరనున్న ఏళ్లనాటి కల.. దుబ్బాక ప్రాంతంలోని భూగర్భ జలాలు అంతంతే మాత్రంగా ఉండేవి. ఏటా గ్రామస్తులు సాగునీరు, తాగునీటి కష్టాలు పడుతూనే వస్తున్నారు. తమకు రామడుగు ప్రాజెక్ట్‌లోని గ్రామానికి సాగునీటి వాటాను దక్కించుకునేందకు గ్రామస్తులంతా ఉద్యమంలా శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల కమిటీని వేశారు. సాగునీటిని దక్కించుకునేందుకు నేతలపై ఒత్తిడిలు తెచ్చారు. 20 ఏళ్ల నుంచి చేపట్టిన సాగునీటి పోరాటానికి మంచి రోజులు రానున్నాయి. ప్రాజెక్ట్ జలాల వాటాను దక్కించుకునేలా నిధుల మంజూరుకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుమనరెడ్డితో పాటు గ్రామ అడ్వికెట్ ఆలా మోహన్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గం, గ్రామకమిటీ, ఎత్తిపోతల సాధన కమిటీ ప్రతినిధుల కృషి ఫలితంతోనే మళ్లీ నిధులు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. సంతోషంగా ఉంది దుబ్బాక గ్రామానికి ఎత్తిపోతల ద్వారా సాగునీటి కష్టాలు తీ ర్చేందుకు అడుగులు పడుతుండటంతో చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల తరబడి సాగు, తాగునీటికి కష్టాలు పడుతు న్నాం. ఎం పీ కవిత కృషి చేయటం హర్షణీయం. గోసికొండ నర్సయ్య, గ్రామస్తుడు, దుబ్బాక కష్టాలు తీరనున్నాయి దుబ్బాకకు సాగునీరు వచ్చేలా అడుగులు పడుతుండటంతో రైతుల కష్టాలు తీరనున్నాయి. ఎత్తిపోతల పనులు పూర్తయితే రైతులు, ప్రజల కష్టాలు దూరం అవుతాయి. ఎమ్మెల్యే ఎత్తిపోత లకు నిధుల మంజూరుకు ఎంతో కృషి చేశారు. టీచర్ నర్సయ్య, ఎంపీటీసీ, దుబ్బాక గ్రామస్తుల కృషి ఎంతో ఉంది దుబ్బాకకు సాగునీరు వచ్చేలా గ్రామస్తులంత చేసిన కృషి ఎంతో ఉంది. ప్రాజెక్ట్ ద్వారా వాటాను దక్కించుకునేందుకు గ్రామకమిటీ, ఎత్తిపోతల సాగునీటి కమిటీ వేశాం. ఎంపీ కవిత చొరవతో గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి. నూకల నర్సయ్య, వార్డు సభ్యుడు, దుబ్బాక -
రైతు నెత్తిన పిడుగు
రుణాల రీషెడ్యూల్ కుదరదని తేల్చి చెప్పిన ఆర్బీఐ జిల్లాలో 2,10,881 రైతుల పరిస్థితి దయనీయం కొత్త రుణాలపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా! రిజర్వు బ్యాంకు ప్రకటన రైతు నెత్తిన పిడుగులా ఉంది. రుణాల రీషెడ్యూల్ కుదరదని కుండబద్దలుకొట్టింది. కేవలం కరువు మృడలాల్లోనే ఇందుకు అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని ప్రకారం జిల్లా రైతులకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖ రూరల్: రుణమాఫీ కాకపోయినా.. కనీసం రీషెడ్యూల్ జరిగితే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందవచ్చని జిల్లా రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కరువు, వరదలు కారణంగా ఆహార ఉత్పత్తులు 50 శాతం కన్నా తక్కువగా వచ్చినప్పుడే వ్యవసాయ రుణాలు రీషెడ్యూల్కు నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి గతేడాది కరువు, వరదలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్‌కు ముందు 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నివేదికలు రూపొందించేలోగా వరుస తుపాన్లతో పరిస్థితులు తలకిందులయ్యాయి. నష్టం 50 శాతం కంటే ఎక్కువే! వాస్తవానికి గతే డాది కరువు, వరదలు కారణంగా జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగానే పంటల దెబ్బతిన్నాయి. గత సీజన్లో హెలెన్, పైలిన్ తుపాన్లతో పాటు, అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. పంటలన్నీ నీట మునిగాయి. 2013లో వచ్చిన వరదలు కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. అంతకంటే అధికంగా నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా కేవలం 52,426 మంది రైతులకు రూ.12.25 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ లెక్కన కూడా 50 శాతం కూడా నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు ఇవ్వలేదు. అటు కరువు మండలాలు ప్రకటించే అవకాశం లేకపోవడం, ఇటు వరదలకు పంట నష్టం 50 శాతం చూపించపోవడం కారణంగా.. ఇప్పుడు రుణాల రీషెడ్యూల్కు అవకాశం లేకుండా పోయింది. కొత్త రుణాలు లేనట్లేనా? రుణాల రీషెడ్యూల్‌పై ఆర్బీఐ కచ్చితంగా చెప్పడంతో జిల్లా రైతులకు కొత్త రుణాలు అందే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్తవి కంటే రెన్యువల్స్ అధికంగా ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు రుణాలు ఇవ్వాలని భావిస్తుండగా, రెన్యువల్స్‌కు 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటించడంతో జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. ఇప్పటి వరకు రుణ మాఫీ జరగకపోగా, రీషెడ్యూల్కు కూడా దారులు మూసుకుపోయాయి. జిల్లాలో గత నెల వరకు 1668 మంది రైతులకు రూ.3.03 కోట్లు మాత్రమే పంట రుణాలుగా అందించారు. కొత్త వారికి రుణ లక్ష్యం తక్కువగా నిర్దేశించడం.. రెన్యువల్స్‌కు కొత్త రుణాలు అందించే అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్లో రుణ లక్ష్యం చేరుకొనే అవకాశం కనిపించడం లేదు. -
ఆగాలా... సాగాలా!
సాగునీటి విడుదలపై వీడని సందిగ్ధత శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు విడుదల ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరేందుకు 15 రోజుల సమయం పట్టే అవకాశం వర్షాలపైనే రైతుల ఆశలు కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో డెల్టా రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురి స్తున్నాయి. అయితే సాగునీరు విడుదల చేసే తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో డెల్టాతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నం : జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా జూలై నెలాఖరుకు కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 5.89 లక్షల ఎకరాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ తరుణంలోనూ ప్రభుత్వం డెల్టాకు నీటి విడుదల అంశంపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు కాలువలకు విడుదల చేసిన నీటిని తాగు అవసరాలకే వాడాలని నీటిపారుదల శాఖాధికారులు స్పష్టంచేశారు. జూలైలో వర్షంపైనే నమ్మకం పెట్టుకుని రైతులు నారుమడులు పోసుకున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 25 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, మరో 15 వేల ఎకరాల్లో బోరునీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. నారుమడులతో పాటు వరినాట్లు పూర్తయిన పొలాలకు నీరు అందక పైరు చనిపోయే స్థితికి చేరుకుంది. ఈ దశలో జూలై ఆఖరి వారంలో కురిసిన వర్షాలకు నారుమడులు, నాట్లు పూర్తయిన పొలాల్లో పైరు జీవంపోసుకుంది. అయితే వరిసాగు సజావుగా సాగాలంటే కాలువలకు సాగునీరు విడుదల చేయాల్సిందేనని రైతులు కోరుతున్నారు. మరో 15 రోజులు ఆగాల్సిందేనా..! ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండాయని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. జూరాల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోందని పేర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీరు చేరాలి. అనంతరం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సాగునీరు విడుదల జరగాలి. ఎగువ రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతుందని జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖాధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రాష్ట్ర విభజన నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి ఎప్పటికీ సాగునీటి విడుదల చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాడెల్టాలో ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీరు సరిపోతుంది. అయితే పాలకులు మాత్రం సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పకుండా డెల్టా రైతులకు మంచే జరుగుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. గత ఏడాదీ ఆలస్యం గానే సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 350 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ ఏడాది ఇంత వరకు సాగునీటి విడుదలపై అధికారిక ప్రకటన చేయలేదు. అవసరమైన సమయంలో సాగునీటిని విడుదల చేయకుండా ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటిని సముద్రంలోకి వదిలే పరిస్థితి ఈ ఏడాదీ ఉంటుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండో పంటపైనా ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో సముద్రతీరంలోని మండలాల్లో ఇప్పటికీ నారుమడులు పోస్తూనే ఉన్నారు. ఈ నెల 15వ తేదీనాటికి వరినాట్లు పూర్తి చేయకుంటే ఆ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసినా కాలువలకు నీరు విడుదల చేయకుంటే ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో వరినాట్లు పూర్తిచేస్తే నవంబర్ నాటికి పొట్టదశకు చేరుతుంది. ఈ నెలలో సంభవించే తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పైర్ల దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వరినాట్లు ఆలస్యమై డిసెంబర్లో కోతలు పూర్తిచేస్తే రెండో పంట మినుముకు సాగు చేసేందుకు సమయం చాలదు. డిసెంబర్ వరకు వరికోతలు పూర్తి చేయకుంటే చలిగాలుల ప్రభావంతో వరికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని, పక్వానికి వచ్చిన కంకులకు మెడ విరుపు తెగులు వ్యాపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి డెల్టాకు సాగునీటికి విడుదలకు కృషిచేయాలని కోరుతున్నారు. -
విత్తు పద్ధతులపై అవగాహన అవసరం
జూలై మాసం వర్షాలపైనే రైతుల ఆశలు నేరుగా వరి విత్తే పద్ధతిలో కలుపు బెంగ టీఎన్వీ సమావేశంలో శాస్త్రవేత్తలు అనకాపల్లి: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ వరి విత్తు పద్ధతులపై రైతులకు అవగాహన కలిగేలా వ్యవసాయ అధికారులు ప్రచారం చేయాలని ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధాన స్థానం ఏడీఆర్ కె. వీరభద్రరావు కోరారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని జూబ్లిహాల్లో శనివారం జరిగిన శిక్షణ, సందర్శన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి విత్తే పద్ధతులను వివరిస్తూనే ఆయా పద్ధతుల వల్ల ఎదురయ్యే కలుపు సమస్యలు, నివారణ మార్గాల పట్ల రైతులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గడిచిన రెండు నెలల్లో సాధారణ వర్షపాతం కంటే 40-50 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. అయితే జూలైలో కురిసిన చిరుజల్లులతో రైతుల్లో ఆశలు చిగురించాయన్నారు. 60శాతం వరకూ నారుమడులు పూర్తయ్యాయని, రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సకాలంలో వరినాట్లు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వరి నేరుగా విత్తే పద్ధతిలో నాట్లు వేస్తే కలుపు తాకిడి ఎక్కువ ఉంటుందని, అందువల్ల రైతులకు కలుపు నివారణ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి సూచించారు. జిల్లాలో గంటి, వేరుశనగ వంటి ఖరీఫ్ పంటలు విస్తీర్ణం తక్కువగా ఉన్నట్టు టీఎన్వీ గుర్తించింది. వరి వంగడాల పరంగా ఎక్కువ శాతం రైతులు ఆర్‌జిఎల్-2537, ఎన్‌ఎల్‌ఆర్-34449 రకాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు విస్తరణ విభాగం సమావేశం దృష్టికి తీసుకువచ్చింది. ప్రస్తుత వాతావరణ స్థితిగతుల బట్టి స్వల్ప/మధ్య కాలిక వరి వంగడాలను రైతులు వినియోగించాలని సమావేశం సూచించింది. చెరకులో పిండినల్లి బాగా ఆశించిందని వ్యవసాయ అధికారులు చెప్పడంతో నివారణ మార్గాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. భవాని వివరించారు. చెరకు అడుగు భాగాన ఉన్న ఆకులను రెల్లి, కణుపులు బాగా తడిచేటట్టుగా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీమీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీ. జమున సమన్వయకర్తగా వ్యవహరించగా, చింతపల్లి పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ ఎన్. వేణుగోపాలరావు, శాస్త్రవేత్త హెచ్. శ్రీనివాస్ పాల్గొన్నారు.