రైతు నెత్తిన పిడుగు
- రుణాల రీషెడ్యూల్ కుదరదని తేల్చి చెప్పిన ఆర్‌బీఐ
- జిల్లాలో 2,10,881 రైతుల పరిస్థితి దయనీయం
- కొత్త రుణాలపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా!
రిజర్వు బ్యాంకు ప్రకటన రైతు నెత్తిన పిడుగులా ఉంది. రుణాల రీషెడ్యూల్ కుదరదని కుండబద్దలుకొట్టింది. కేవలం కరువు మృడలాల్లోనే ఇందుకు అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని ప్రకారం జిల్లా రైతులకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పరిస్థితి దయనీయంగా మారింది.
విశాఖ రూరల్: రుణమాఫీ కాకపోయినా.. కనీసం రీషెడ్యూల్ జరిగితే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందవచ్చని జిల్లా రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కరువు, వరదలు కారణంగా ఆహార ఉత్పత్తులు 50 శాతం కన్నా తక్కువగా వచ్చినప్పుడే వ్యవసాయ రుణాలు రీషెడ్యూల్‌కు నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి గతేడాది కరువు, వరదలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్‌కు ముందు 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నివేదికలు రూపొందించేలోగా వరుస తుపాన్లతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
నష్టం 50 శాతం కంటే ఎక్కువే!
వాస్తవానికి గతే డాది కరువు, వరదలు కారణంగా జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగానే పంటల దెబ్బతిన్నాయి. గత సీజన్‌లో హెలెన్, పైలిన్ తుపాన్లతో పాటు, అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. పంటలన్నీ నీట మునిగాయి. 2013లో వచ్చిన వరదలు కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. అంతకంటే అధికంగా నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా కేవలం 52,426 మంది రైతులకు రూ.12.25 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఈ లెక్కన కూడా 50 శాతం కూడా నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు ఇవ్వలేదు. అటు కరువు మండలాలు ప్రకటించే అవకాశం లేకపోవడం, ఇటు వరదలకు పంట నష్టం 50 శాతం చూపించపోవడం కారణంగా.. ఇప్పుడు రుణాల రీషెడ్యూల్‌కు అవకాశం లేకుండా పోయింది.
కొత్త రుణాలు లేనట్లేనా?
రుణాల రీషెడ్యూల్‌పై ఆర్‌బీఐ కచ్చితంగా చెప్పడంతో జిల్లా రైతులకు కొత్త రుణాలు అందే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.ఈ సీజన్‌లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్తవి కంటే రెన్యువల్స్ అధికంగా ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు రుణాలు ఇవ్వాలని భావిస్తుండగా, రెన్యువల్స్‌కు 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటించడంతో జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. ఇప్పటి వరకు రుణ మాఫీ జరగకపోగా, రీషెడ్యూల్‌కు కూడా దారులు మూసుకుపోయాయి. జిల్లాలో గత నెల వరకు 1668 మంది రైతులకు రూ.3.03 కోట్లు మాత్రమే పంట రుణాలుగా అందించారు. కొత్త వారికి రుణ లక్ష్యం తక్కువగా నిర్దేశించడం.. రెన్యువల్స్‌కు కొత్త రుణాలు అందించే అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్‌లో రుణ లక్ష్యం చేరుకొనే అవకాశం కనిపించడం లేదు.