- జూలై మాసం వర్షాలపైనే రైతుల ఆశలు
- నేరుగా వరి విత్తే పద్ధతిలో కలుపు బెంగ
- టీఎన్‌వీ సమావేశంలో శాస్త్రవేత్తలు
అనకాపల్లి: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ వరి విత్తు పద్ధతులపై రైతులకు అవగాహన కలిగేలా వ్యవసాయ అధికారులు ప్రచారం చేయాలని ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధాన స్థానం ఏడీఆర్ కె. వీరభద్రరావు కోరారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని జూబ్లిహాల్‌లో శనివారం జరిగిన శిక్షణ, సందర్శన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరి విత్తే పద్ధతులను వివరిస్తూనే ఆయా పద్ధతుల వల్ల ఎదురయ్యే కలుపు సమస్యలు, నివారణ మార్గాల పట్ల రైతులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గడిచిన రెండు నెలల్లో సాధారణ వర్షపాతం కంటే 40-50 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు. అయితే జూలైలో కురిసిన చిరుజల్లులతో రైతుల్లో ఆశలు చిగురించాయన్నారు.
60శాతం వరకూ నారుమడులు పూర్తయ్యాయని, రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సకాలంలో వరినాట్లు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వరి నేరుగా విత్తే పద్ధతిలో నాట్లు వేస్తే కలుపు తాకిడి ఎక్కువ ఉంటుందని, అందువల్ల రైతులకు కలుపు నివారణ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి సూచించారు.
జిల్లాలో గంటి, వేరుశనగ వంటి ఖరీఫ్ పంటలు విస్తీర్ణం తక్కువగా ఉన్నట్టు టీఎన్‌వీ గుర్తించింది. వరి వంగడాల పరంగా ఎక్కువ శాతం రైతులు ఆర్‌జిఎల్-2537, ఎన్‌ఎల్‌ఆర్-34449 రకాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు విస్తరణ విభాగం సమావేశం దృష్టికి తీసుకువచ్చింది. ప్రస్తుత వాతావరణ స్థితిగతుల బట్టి స్వల్ప/మధ్య కాలిక వరి వంగడాలను రైతులు వినియోగించాలని సమావేశం సూచించింది.
చెరకులో పిండినల్లి బాగా ఆశించిందని వ్యవసాయ అధికారులు చెప్పడంతో నివారణ మార్గాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. భవాని వివరించారు. చెరకు అడుగు భాగాన ఉన్న ఆకులను రెల్లి, కణుపులు బాగా తడిచేటట్టుగా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీమీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీ. జమున సమన్వయకర్తగా వ్యవహరించగా, చింతపల్లి పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ ఎన్. వేణుగోపాలరావు, శాస్త్రవేత్త హెచ్. శ్రీనివాస్ పాల్గొన్నారు.