వారంలో చేతికొచ్చే పచ్చిమేత!
- షేడ్‌నెట్ కింద ట్రేలలో మొలక గడ్డి పెంపకం సులువు.. తక్కువ స్థలంలోనే పశుగ్రాసం సాగు
- అతి తక్కువ ఖర్చుతో.. విత్తిన వారంలోనే వాడకానికి సిద్ధం
సాగులో అనాదికాలంగా పాడిపంటలది విడదీయరాని బంధం. పాడిద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సాగు ఖర్చులకు రైతుకు అక్కరకొస్తుంది. అయితే వాణిజ్య పంటల సాగు పెరగటం, బీడు భూముల లభ్యత తగ్గటం వంటి కారణాల వల్ల పశువులకు పచ్చిమేత లభ్యత తగ్గింది. దీనివల్ల పాడి పోషణ రైతుకు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో పాడి రంగాన్ని ఆదుకునే ఆధునిక పద్ధతే హైడ్రోపోనిక్స్ అంటారు. ఈ పరిజ్ఞానాన్ని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు తొలిసారి పరిచయం చేశారు.
హైడ్రోపోనిక్స్‌లో పశుగ్రాసం సాగుకు మొక్కజొన్న విత్తనాలు అనువుగా ఉంటాయి. తొలుత విత్తనాలను నీటిలో 12 గంటలు నానబెట్టి, 24-36 గంటల పాటు మొలకకట్టాలి. ఈ విత్తనాలను ట్రేలో పోసి ఐదు రోజుల పాటు మాదిరి ఎండతగిలే ప్రాంతంలో లేదా షేడ్‌నెట్ కింద ఉంచాలి. ఈ సమయంలో మొలక ఎండిపోకుండా ఉండేందుకు తేమను అందిస్తూ ఉండాలి. దీనికోసం మిస్టర్లు, ఫాగర్లను వాడవచ్చు. మూడడుగుల పొడవు, అడుగున్నర వెడల్పు ఉన్న ట్రేలో 1.54 కిలోల విత్తనాన్ని సాగు చేయవచ్చు. వారం రోజుల్లో 12 కిలోల గడ్డి లభిస్తుంది. ఇది ఒక పశువుకు సరిపోతుంది. గడ్డి 15-30 సెం. మీ. పెరుగుతుంది. దీన్ని వేళ్లతో సహా అందించాలి. ఒక పశువుకు ఒక రోజుకు సరిపడా గడ్డిని అందించేందుకు ఇలాంటి ట్రేలు ఐదు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 7 రోజులకు మూడు లీటర్ల నీరు అవసరం అవుతుంది. నీటిలో ఎలాంటి పోషకాలు కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలో ఉండే పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి.
అతి తక్కువ స్థలం తక్కువ నీటితోనే పశుగ్రాసం సాగుకు సరిపోతాయి. పొలంలో కిలో గడ్డి పెంచేందుకు 60-80 లీటర్ల నీరు అవసరమవుతుండగా హైడ్రోపోనిక్స్‌లో 2-3 లీటర్ల నీరు సరిపోతుంది. 2.5 క్వింటాల్ పశుగ్రాసం ఉత్పత్తికి ఎకరా పొలం అవసరం కాగా అదే హైడ్రోపోనిక్స్‌లో అయితే 50. చ. మీ. స్థలం సరిపోతుంది. సాధారణ పద్ధతిలో పశుగ్రాసం సాగులో దున్నడం, నాటడం, సాగునీరు, కలుపు నిర్మూలన, గడ్డి కోత వంటి పనులకు కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఈ ఖర్చులన్నీ ఉండవు. రోజూ ఒక మనిషి 2-3 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కేవలం 7 రోజుల్లో 25-30 సెం. మీ గడ్డి లభిస్తుంది. సాధారణ పద్ధతిలో 60-80 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితమైన దిగుబడి సంవత్సరం పొడవునా లభిస్తుంది. వివరాలకు బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జి. ధనలక్ష్మి (94406 67424) ఎ. కృష్ణమూర్తి (94936 19020)లను సంప్రదించవచ్చు.
- గుండం సర్వేశ్వరరెడ్డి, సాక్షి, బనగానపల్లె, కర్నూలు జిల్లా
దాణా తగ్గించినా.. పాల దిగుబడి తగ్గలేదు!
పశువులకు ఎండుగడ్డితో పాటు ఒక ట్రే మొలకగడ్డిని మేపుతున్నాను. మొలకగడ్డిని ఇస్తున్నప్పటి నుంచి రోజుకు రెండు కిలోల దాణా తగ్గించి ఇస్తున్నాను. అయినా పాల దిగుబడి తగ్గలేదు. దాణా ఖర్చు రోజుకు రూ. 40 ఆదా అవుతోంది.
- మధుసూదన్ రెడ్డి, పాడి రైతు,యాగంటిపల్లె, బనగానపల్లె మండలం