సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే 3 రకాల వరి వంగడాలను జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రూపొందించింది. వరిని ప్రధానంగా దోమ పట్టిపీడిస్తోంది. దాన్ని తట్టుకొని నిలబడగలిగే రకాన్ని వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే కందిలోనూ కొత్త రకం వంగడాన్ని రూపొందించారు. వీటికి తామింకా పేర్లు ఖరారు చేయలేదని, ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సర్కారు నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు.
వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని: ప్రస్తుత వరి రకాలు 150 రోజుల కాలపరిమితితో కోతకు వస్తున్నాయి. ఇటువంటి వంగడాలను ముందే వేయాల్సి ఉంటుంది. పైగా సమయం ఎక్కువ తీసుకుంటుండటంతో అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతోంది. వీటి వల్ల రైతులు నష్టపోతున్నారు. గతంలో రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు జులై, ఆగస్టుల్లోనే వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో కోతలు ఆలస్యమై నష్టం వాటిల్లుతోంది. తాజాగా కనుగొన్న రకాల వల్ల వరి 120 నుంచి 135 రోజుల్లోనే చేతికి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు అకాల వర్షాలను ఈ వరి తట్టుకోగలుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే తాము అభివృద్ధి చేసిన కొత్త కంది వంగడం ముడత పురుగును తట్టుకోగలుగుతుందని అంటున్నారు.
కొత్త వరితో విలువ ఆధారిత ఉత్పత్తులు: కొత్త వరి వంగడాలు అత్యంత నాణ్యమైన సన్నటి రకాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి లక్షణాలను, పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. ఈ వరితో అటుకులు సహా ఇతరత్రా వరి ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోడానికి వీలుంటుందని వివరించారు. గతంలో ఈ వర్సిటీ తయారుచేసిన తెలంగాణ సోనా వరి రకం మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. దీంతో అవి ఎంతో పేరు పొందాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో వాటికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు విడుదల చేయబోయే రకాల లక్షణాలను వర్సిటీ వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ 3 రకాల వంగడాలు వరిలో విప్లవాత్మకమైనవని చెబుతున్నారు. ప్రభుత్వం వీటికి అనుమతిచ్చిన వెంటనే మూల విత్తనాలను తక్షణమే విడుదల చేస్తామని అంటున్నారు. ఈ ఖరీఫ్‌లో కొంతమేరకు అందుబాటులోకి తీసుకు రావాలని అనుకుంటున్నామని, వచ్చే రబీ, ఖరీఫ్‌ల నాటికి పూర్తిస్థాయిలో రైతులకు చేర్చుతామని అంటున్నారు.
150 కాదు..120 రోజులకే పంట!
Published Tue, Jun 4 2019 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment