ఉల్లి ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఈ చర్య రైతులకు నష్టం కలిగించేదే. ఇది మార్కెట్ యంత్రాంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కాదా? అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కానీ బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని కేంద్రం నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి (తాజాగా బాస్మతి ఎగుమతులనూ నిషేధించింది). బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోసమేనని తెలుస్తోంది. ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోంది.
ఈ సంవత్సరం మరో రెండు లక్షల టన్నుల ఉల్లిని అదనంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఉల్లి నిల్వల లక్ష్యాన్ని (బఫర్ స్టాక్) మూడు లక్షల టన్నుల నుండి ఐదు లక్షల టన్నులకు తీసుకెళు తుంది. ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధించిన ఒక రోజు తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చిందని గుర్తించాలి. అంటే, ఎగుమతులను సమర్థంగా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం స్థానిక సరఫరాను పెంచింది. ఇది ఉల్లి ధరల పతనానికి కారణమవు తుంది. ఇది మార్కెట్ యంత్రాంగంలో జోక్యం చేసుకోవడం కాదా? ఉల్లి రైతులు ప్రభుత్వానికి తక్కువ ధరకు తమ పంటను అమ్మేలా చేసేందుకు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకున్నట్లు కనిపించడం లేదా? ఇది మార్కెట్‌పై ప్రభుత్వ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఈ చర్య కచ్చితంగా రైతులకు నష్టం కలిగిస్తున్నందున, కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి కూడా ఉల్లిపై ఎగుమతి పన్ను పెంపును విమర్శించారు. ఆ మాజీ మంత్రి దేశంలోని ఉల్లిపాయల్లో మూడింట ఒక వంతు సరఫరా చేసే రాష్ట్రానికి చెందినవారు. ఎగు మతి పన్నుకు వ్యతిరేకంగా రైతులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నప్ప టికీ ఫలితం లేకుండా పోయింది
వ్యవసాయోత్పత్తుల కోసం మార్కెట్ యంత్రాంగంలో ఇటువంటి ఏకపక్ష జోక్యాలకు రైతులు అలవాటు పడ్డారు. ఈ వారం ఉల్లి ద్రవ్యోల్బణం 19 శాతానికి చేరుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఆందో ళన కలిగిస్తోంది. ఇంటి బడ్జెట్‌లో ఉల్లిపాయల వాటా కొంత భాగం మాత్రమే అనుకోవద్దు. ఉల్లి ధరలు రాజకీయ నాయకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. మితిమీరిన ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వాలే పడిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను గుర్తుంచుకోండి. ఈ మూడు చట్టాలలో ఒకటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేయాలనీ, నిల్వ పరిమితులను తొలగించాలనీ ప్రతిపాదించింది. ఎగుమతులు లేదా దిగుమతులపై ఏకపక్ష నిషేధాలను సడలించాలని కూడా అది ప్రతిపాదించింది. కానీ నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆ వారంలోనే, బంగ్లాదేశ్‌కు వెళ్లే అనేక ట్రక్కులను సరిహద్దు వద్ద నిలిపివేశారు. ఎందుకంటే, అవి ఉల్లిపాయల ఎగుమతి సరుకులను తీసుకుపోతు న్నాయి. ఒకవైపు ఎగుమతులను నిలిపివేయడం, మరోవైపు వ్యవ సాయ మార్కెట్లపై నియంత్రణ ఎత్తివేయడం వంటి ఈ చర్యలు మిశ్రమమైన, నిజాయితీ లేని సంకేతాలను ఇస్తున్నాయి.
బహుశా, ఉల్లిపాయలపై ప్రస్తుతం విధించిన ఎగుమతి పన్నును నివారణ చర్యగా చెప్పవచ్చు. టమోటా ధరల అనూహ్య పెరుగుదల కారణంగా ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం. భారత జాతీయ సహకార సంస్థల వినియోగదారు సమాఖ్య, భారత జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఇప్పటికే తమ బఫర్ స్టాక్ కోసం 15 లక్షల టన్నులకంటే ఎక్కువ టమోటాలను సేకరించాయి. కిలో టమోటా ధర రూ.200 వరకు పెరగడంతో సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ రాయితీలను ఎక్కడినుంచి చెల్లిస్తున్నారు? ద్రవ్యోల్బణం మంటలను ఆర్పడా నికి నేపాల్, తదితర దేశాల నుండి కూడా బహిరంగంగా ప్రకటించని మొత్తంలో టమోటాలను భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద నడుస్తోంది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 6 శాతం పరిమితి కంటే ఎక్కువ. కాబట్టి, ద్రవ్యోల్బణానికి కారణమయ్యే ప్రధాన విల¯Œ లలో టమోటాలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వాల అపఖ్యాతికి కారణ మవుతోంది. పైగా అది మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది కూడా.
మరొక వ్యవసాయ సరుకును తీసుకోండి. జూలై నెలలో భారత దేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతిని నిషేధించింది. మొత్తం బియ్యం ఎగుమతుల్లో ఈ రెండూ 45 శాతం వరకు ఉంటున్నాయి. ఈ నిషేధం మన వ్యాపార భాగస్వాములలో చాలామందిని కలవరపెట్టింది. పైగా భారతదేశాన్ని నమ్మదగని సర ఫరాదారుగా కనిపించేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, ఆసియా లోని కొన్ని దేశాలు భారత్ నుండి బియ్యం దిగుమతిపై ఆధారపడటం వారి ఆహార భద్రతకు హాని కలిగించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతపై భారత ప్రభుత్వం నిజంగా శ్రద్ధ చూపడం లేదని అర్థమవుతోంది. అయితే ప్రాథమికంగా బియ్యం ఎగుమతులను నిషేధించడానికి కారణం ఇథనాల్ తయారీదారుల ప్రయోజనాలను కాపాడటం కోస మేనని తెలుస్తోంది. 50 నుండి 60 లక్షల టన్నుల నూకల బియ్యంలో 30 లక్షల టన్నుల దాకా ఇథనాల్ తయారు చేయడానికి వెళ్తాయి. బియ్యం ఎగుమతిపై నిషేధం కార్ ఇంజిన్‌ల లభ్యతను పెంచుతుంది. కానీ ఇది వరి రైతు లాభాలను పణంగా పెడుతోందని గమనించాలి. అంతర్జాతీయంగా బియ్యం ధరలు దశాబ్ద కాలపు గరిష్ఠ స్థాయికి చేరు కున్నాయి. మంచి లాభాలు ఆర్జించేందుకు ఇదొక అవకాశం. వ్యవసా యోత్పత్తులపై ఎగుమతి నిషేధం వంటి చర్యల ఫలితంగా అంతిమంగా రైతులు నష్టపోతున్నారు.
టమోటాలు, ఉల్లిపాయలు లేదా బియ్యంపై విధానపరమైన చర్యలకు సంబంధించిన ఇటీవలి కథనాలు... వ్యవసాయంలో సంస్క రణలు ఎందుకు ఇంత కఠినంగా, అసంపూర్తిగా ఉన్నాయనే విష యాన్ని వివరిస్తున్నాయి. దీని వెనుక స్వాభావికమైన పట్టణ పక్షపాతం ఉంది. ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనం కంటే పట్టణ వినియో గదారుల సంక్షేమానికి (తక్కువ ఆహార ద్రవ్యోల్బణం) అధిక ప్రాధా న్యత ఇస్తాయి. కాబట్టి, మార్కెట్లను సంస్కరించే, రైతుకు అనుకూలంగా క్రమబద్ధీకరించే వ్యవసాయ విధానాలను ఎల్లప్పుడూ ఏకపక్షంగా తిప్పికొడుతున్నారు. ధరల నియంత్రణల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి, ఉచిత నీరు, విద్యుత్, చౌకగా ఎరువులు వంటి ఇన్‌పుట్ సబ్సిడీలు కొనసాగుతాయి. ఇది ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంటుంది. ప్రభుత్వంపై పడుతున్న భారానికి ప్రత్యా మ్నాయంగా ‘ఫార్వర్డ్ మార్కెట్ల’ అన్వేషణ జరగటం లేదు. అందువల్లే్ల ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుంటోంది. దానికోసం పోటీ లేని గుత్తాధిపత్య ప్రవర్తనకు కూడా వెనుకాడటం లేదు. ఈ ఆధిపత్య దుర్వినియోగానికి గానూ ప్రభుత్వాన్ని ఎవరు కోర్టుకు లాగుతారు?
ధరల నియంత్రణ, నిల్వ పరిమితులు, ఏకపక్ష దిగుమతి, ఎగుమతి నిషేధాలతోపాటు తరచూ మారుతున్న ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం ఇప్పటికీ సంకెళ్లతో బంధించబడి ఉంది. సాంకేతికంగా చూస్తే వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించిన అంశం అయినప్పటికీ కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసా యంపై తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో రైతు భారీస్థాయి, విధ్వంసకరమైన రాయితీలతో అల్లాడిపోతాడు. భారీ సబ్సిడీలతో కూడిన రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల పంజాబ్‌లో సంభవించిన నేల క్షీణత, లవణీయత దీనికి సాక్షీభూ తంగా ఉంది. వీటన్నింటికీ మించి, దేశంలో సగం మంది రైతులకు రాయితీలు లభించవు. ఎందుకంటే వారు భూమి లేనివారు లేదా కౌలుదారులు కాబట్టి తాము సాగుచేసే భూమితో వారికి సంబంధం ఉండదు. వ్యవసాయ విధాన పరంగా మనం నేస్తున్న వలలు మనల్ని చిక్కుల్లో పడేశాయి. అందుకనే వాటి సంకెళ్లు తొలగించడం చాలా కష్టంగా మారింది. మార్కెట్లు మెరుగ్గా పనిచేయాలన్నా, ప్రభుత్వ జోక్యాన్ని పరిమితంగా ఉంచాలన్నా, మార్కెట్ ప్రక్రియలో పాల్గొని, దాని నుండి లాభం పొందేందుకు రైతుకు మరింత స్వేచ్ఛను అందించాల్సి ఉంది. దీనికోసమే మనకు భారీ సంస్కరణలు అవసరం.
డాక్టర్ అజీత్ రానాడే, ఆర్థికవేత్త
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment