సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి కలవరపెడుతున్న తరుణంలో ఎవరి నోట విన్నా సి–విటమిన్, జింక్‌తో కూడిన మల్టీవిటమిన్లు వంటి పేర్లు వినపడుతున్నాయి. కరోనా నివారణ కోర్సులో జింక్ బిళ్లల వాడకం భాగమైంది. రోగనిరోధక శక్తిని పెంచే కారకాల్లో జింక్ ఒకటి కావడమే ఇందుకు కారణం. అయితే.. బిళ్లలు, టానిక్‌ల రూపంలో కంటే మనం తినే ఆహారంలోనే జింక్‌ను భాగంగా చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. జింక్ కోసం కొన్ని రకాల బియ్యాల్ని వారు సిఫార్సు చేస్తున్నారు.
అటువంటి వాటిలో ఒకటి.. ఎన్‌ఎల్‌ఆర్ 3238. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించిన ఈ వంగడంలో జింక్ ఎక్కువగా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో సుమారు 22.5 శాతం జింక్ ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. మిగతా వరి రకాల్లో జింక్ గరిష్టంగా 16 శాతం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై జింక్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అందుకు ఎన్‌ఎల్‌ఆర్ 3238 పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలోనే జింక్ ఉంటే ఇక సప్లిమెంట్లతో పనే ఉండదంటున్నారు. ఈ వంగడం సమర్థంగా పనిచేయడంతోపాటు బ్యాక్టీరియా, వైరస్ వంటివి సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచడంలో ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.
ఇదీ ఎన్‌ఎల్‌ఆర్ చరిత్ర..
ఎంటీయూ 1010, బీపీటీ 5204 సంకరంతో ఈ ఎన్‌ఎల్‌ఆర్ 3238ను సృష్టించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ టి.గోపీకృష్ణ వివరించారు. ఈ వంగడం అభివృద్ధి వెనుక అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఉంది. స్వల్పకాలంలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాల సృష్టిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ వంగడం బయటకు వచ్చింది.
ఎకరానికి 35 – 40 బస్తాల దిగుబడి
తెగుళ్లను తట్టుకోవడం, అధిక దిగుబడి ఎన్‌ఎల్‌ఆర్ 3238 ప్రత్యేకత. ఎకరానికి 35 – 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిలో బీపీటీ రకాలతో ఎన్‌ఎల్‌ఆర్ 3238 పోటీ పడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల సమయంలోనే గుర్తించారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాచుర్యం కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడి ఇస్తుంది. పైగా దీన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు.
బీపీటీ 5204, ఎంటీయూ 1010లతో సమానంగా దిగుబడి ఉంది. ఒక్క నెల్లూరులోనే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వంగడాన్ని పరీక్షించి చూశారు. విస్తృత పరిశోధనలు చేసి పర్యావరణ అనుకూల వంగడంగా పరిగణించాకే మార్కెట్‌కు విడుదల చేశారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో ఒక్క జింకే కాకుండా అన్నం కూడా బాగా ఆటి వస్తుంది.. వదుగ్గా ఉండి తినేందుకు బాగుంటుంది. విత్తనాల కోసం నెల్లూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారిని సంప్రదించవచ్చు.
చదవండి: World Organ Donation Day: మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment