మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల! | Udayagiri In PSR Nellore Turns Agricultural Education Center | Sakshi
Sakshi News home page

మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల!

Published Thu, Dec 15 2022 5:27 PM | Last Updated on Thu, Dec 15 2022 5:38 PM

Udayagiri In PSR Nellore Turns Agricultural Education Center - Sakshi

ఉదయగిరి కేంద్రంగా వ్యవసాయ విద్యకు బీజం పడింది. మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల మారనుంది. మారుతున్న ప్రపంచీకరణలో తిరిగి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. కంప్యూటర్‌ కోర్సులు చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా మారిన ఎందరో తిరిగి ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రస్తుతం విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, మెడిసిన్‌ తర్వాత వ్యవసాయ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు.  

ఉదయగిరి (పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా):  రాచరిక పాలనకు కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో కాలక్రమేణా కరవు రాజ్యమేలింది. అలనాటి రాజుల స్వర్ణయుగం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. ఉదయగిరి కేంద్రంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన రూ.250 కోట్ల ఆస్తులను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించి వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేసి అందుకు అవసరమైన నిధులు కేటాయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి.  

త్వరలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్‌ యూనివర్సిటీ 
మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అగ్రికల్చర్, çహార్టికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టనుంది. వ్యవసాయ రంగానికి ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరికి వ్యవసాయ కళాశాల మంజూరు కావడంతో అగ్రికల్చర్‌ కోర్సులు ఇక్కడే అభ్యసించే అవకాశం ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గుంటూరులో ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ ఉంది. దాని పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల కూడా దీని పరిధిలోకి రానుంది. త్వరలోనే అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా  మార్పు చెందితే ఈ కళాశాలలన్నీ కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది.  

రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత 
మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆలోచన. ఆయన అందుకు అనుగుణంగానే ఆది నుంచి విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించారు. 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఉదయగిరిలో డిగ్రీ కళాశాలకు సొంత నిధులు ఇచ్చారు. అనంతరం వందెకరాల విశాల ప్రాంగణంలో మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.250 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు.  

మెరిట్స్‌లో ప్రస్తుతమున్న సదుపాయాలు 
150 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాల ఉంది. 5 లక్షల చ.అ. అకాడమీ బ్లాక్స్‌ ఉన్నాయి. సుమారు 1,350 మంది విద్యార్థులు నివాసముండేందుకు హాస్టల్‌ భవనాలున్నాయి. 89 మంది స్టాఫ్‌ ఉండేందుకు క్వార్టర్స్, ఓపెన్‌ ఆడిటోరియం, ఇంజినీరింగ్‌ ల్యాబ్, విశాలమైన లైబ్రరీలో 27 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 3 బస్సులు, జనరేటర్లు, క్యాంటిన్, గెస్ట్‌హౌస్, ఎన్‌ఎస్‌ఎస్‌ భవన సముదాయాలు, ప్లేగ్రౌండ్, తదితర వసతులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. మరో యాభై ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేసేందుకు అవసరమైన భూములు కూడా అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

కేబినెట్‌ ఆమోదం 
రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెరిట్స్‌ కళాశాలలో పని చేసే 108 మంది బోధన, బోధనేతర సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ కింద వ్యవసాయ కళాశాలకు తీసుకుంటూ కేబినెట్‌ ఆమోదించింది. దీంతో మెరిట్స్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మేలుచేకూర్చినట్టయింది. కేబినెట్‌ ఆమోదంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 18 నుంచి 
తరగతుల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 250 మంది విద్యార్థులకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 18వ తేదీ నుంచి వ్యవసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయగిరి వ్యవసాయ కళాశాల అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరికి వ్యవసాయ కళాశాల రాకతో వ్యాపార ఆర్థిక కలాపాలు మరింత ఊపందుకోనున్నాయి.   

తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి 
ఈ వ్యవసాయ కళాశాలలో 250 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది స్టాఫ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతులు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కళాశాల ప్రముఖపాత్ర పోషించే అవకాశముంది.  
– డాక్టర్‌ కరుణసాగర్, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల, ఉదయగిరి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement