Cash crop
-
పత్తి ఆహారపంట కూడా!
‘పత్తి’ కేవలం నూలువస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్యపంటగానే సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీనిని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురుపంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయసంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంటనూనెగా వాడుతున్నాం. పత్తిగింజల చక్కను పశుదాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తిగింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ♦ ప్రపంచంలో అత్యధికంగా పత్తిసాగు చేస్తున్న దేశం భారత్. 23శాతం పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షలమంది పత్తిసాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళారైతులే. వీరిలో ఎక్కువమంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే. మన దేశంలో 65శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. ♦ 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ♦ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మికసంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. ♦ అంతర్జాతీయ పత్తి సలహామండలి (ఐసీఎసీ) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోంది. ♦ కిలో పత్తి పండించడానికి 20,000 లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఎసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికాదేశాల్లో సాగు చేయదగిన అతికొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఎసీ వాదన. ♦ పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఎసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తిసాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతు న్నాయని అంచనా. అయితే, దూదిలో 97శాతం సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఎసీ లెక్క చెబుతోంది. ♦సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసీఎసీ అంటోంది. ♦సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించొచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులు, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఎసీ సూచిస్తోంది. ♦పంటకాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3శాతం తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఎసీ అంటోంది. ♦ పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబపోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులు తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. ♦మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95శాతం జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – సాక్షి సాగుబడి డెస్క్ -
వారంలో చేతికొచ్చే పచ్చిమేత!
- షేడ్‌నెట్ కింద ట్రేలలో మొలక గడ్డి పెంపకం సులువు.. తక్కువ స్థలంలోనే పశుగ్రాసం సాగు - అతి తక్కువ ఖర్చుతో.. విత్తిన వారంలోనే వాడకానికి సిద్ధం సాగులో అనాదికాలంగా పాడిపంటలది విడదీయరాని బంధం. పాడిద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సాగు ఖర్చులకు రైతుకు అక్కరకొస్తుంది. అయితే వాణిజ్య పంటల సాగు పెరగటం, బీడు భూముల లభ్యత తగ్గటం వంటి కారణాల వల్ల పశువులకు పచ్చిమేత లభ్యత తగ్గింది. దీనివల్ల పాడి పోషణ రైతుకు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో పాడి రంగాన్ని ఆదుకునే ఆధునిక పద్ధతే హైడ్రోపోనిక్స్ అంటారు. ఈ పరిజ్ఞానాన్ని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు తొలిసారి పరిచయం చేశారు. హైడ్రోపోనిక్స్‌లో పశుగ్రాసం సాగుకు మొక్కజొన్న విత్తనాలు అనువుగా ఉంటాయి. తొలుత విత్తనాలను నీటిలో 12 గంటలు నానబెట్టి, 24-36 గంటల పాటు మొలకకట్టాలి. ఈ విత్తనాలను ట్రేలో పోసి ఐదు రోజుల పాటు మాదిరి ఎండతగిలే ప్రాంతంలో లేదా షేడ్‌నెట్ కింద ఉంచాలి. ఈ సమయంలో మొలక ఎండిపోకుండా ఉండేందుకు తేమను అందిస్తూ ఉండాలి. దీనికోసం మిస్టర్లు, ఫాగర్లను వాడవచ్చు. మూడడుగుల పొడవు, అడుగున్నర వెడల్పు ఉన్న ట్రేలో 1.54 కిలోల విత్తనాన్ని సాగు చేయవచ్చు. వారం రోజుల్లో 12 కిలోల గడ్డి లభిస్తుంది. ఇది ఒక పశువుకు సరిపోతుంది. గడ్డి 15-30 సెం. మీ. పెరుగుతుంది. దీన్ని వేళ్లతో సహా అందించాలి. ఒక పశువుకు ఒక రోజుకు సరిపడా గడ్డిని అందించేందుకు ఇలాంటి ట్రేలు ఐదు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 7 రోజులకు మూడు లీటర్ల నీరు అవసరం అవుతుంది. నీటిలో ఎలాంటి పోషకాలు కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలో ఉండే పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. అతి తక్కువ స్థలం తక్కువ నీటితోనే పశుగ్రాసం సాగుకు సరిపోతాయి. పొలంలో కిలో గడ్డి పెంచేందుకు 60-80 లీటర్ల నీరు అవసరమవుతుండగా హైడ్రోపోనిక్స్‌లో 2-3 లీటర్ల నీరు సరిపోతుంది. 2.5 క్వింటాల్ పశుగ్రాసం ఉత్పత్తికి ఎకరా పొలం అవసరం కాగా అదే హైడ్రోపోనిక్స్‌లో అయితే 50. చ. మీ. స్థలం సరిపోతుంది. సాధారణ పద్ధతిలో పశుగ్రాసం సాగులో దున్నడం, నాటడం, సాగునీరు, కలుపు నిర్మూలన, గడ్డి కోత వంటి పనులకు కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఈ ఖర్చులన్నీ ఉండవు. రోజూ ఒక మనిషి 2-3 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కేవలం 7 రోజుల్లో 25-30 సెం. మీ గడ్డి లభిస్తుంది. సాధారణ పద్ధతిలో 60-80 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితమైన దిగుబడి సంవత్సరం పొడవునా లభిస్తుంది. వివరాలకు బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జి. ధనలక్ష్మి (94406 67424) ఎ. కృష్ణమూర్తి (94936 19020)లను సంప్రదించవచ్చు. - గుండం సర్వేశ్వరరెడ్డి, సాక్షి, బనగానపల్లె, కర్నూలు జిల్లా దాణా తగ్గించినా.. పాల దిగుబడి తగ్గలేదు! పశువులకు ఎండుగడ్డితో పాటు ఒక ట్రే మొలకగడ్డిని మేపుతున్నాను. మొలకగడ్డిని ఇస్తున్నప్పటి నుంచి రోజుకు రెండు కిలోల దాణా తగ్గించి ఇస్తున్నాను. అయినా పాల దిగుబడి తగ్గలేదు. దాణా ఖర్చు రోజుకు రూ. 40 ఆదా అవుతోంది. - మధుసూదన్ రెడ్డి, పాడి రైతు,యాగంటిపల్లె, బనగానపల్లె మండలం -
బాక్సైట్ వద్దే వద్దు
నామమాత్రంగా ఐటీడీఏ సమావేశం గిరిజన సమస్యలపై సాగని చర్చ మన్యంలో అభివృద్ధి పనుల తీరుపై పాడేరు, అరకు ఎమ్మెల్యేల అసంతృప్తి మన్యం ప్రజా ప్రతినిధులందరిదీ ఒకే మాట జీవో 97 రద్దు తీర్మానానికి పట్టు దద్దరిల్లిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ హామీ పాడేరు : బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించాలని, శాశ్వతంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యేలతో పాటు ఏజెన్సీ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పట్టుబట్టారు. ఇక్కడి యూత్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ముందుగా బాక్సైట్ జీవో 97 రద్దు కోసం తీర్మానం చేశాకే సమావేశం కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీన్ని పాలకవర్గ చర్చనీయాంశాల్లో చేర్చాలన్నారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధాలకు పూనుకోవడం ప్రజాస్వామ్యం విరుద్ధమని చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చీడికాడ, పాడేరు జెడ్పీటీసీ సభ్యులు పి.సత్యవతి, నూకరత్నం మాట్లాడుతూ బాక్సైట్ వల్ల మన్యానికే కాకుండా మైదాన ప్రాంతాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, బాక్సైట్ తవ్వే యోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెదబయలు, అరకు, జి.మాడుగుల ఎంపీపీలు ఉమా మహేశ్వరరావు, కె.అరుణకుమారి, ఎం.వి.గంగరాజు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. 97 జీవోను రద్దు చేయాలని కోరుతూ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని జిల్లా కలెక్టర్ ఎన్ .యువరాజ్ చెప్పారు. గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వండి.. ఎమ్మెల్యే ఈశ్వరి అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వాలని, బాక్సైట్‌ను తవ్వి మనుగడకు ముప్పు కలిగించ వద్దని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెలికాప్టర్లో తిరుగుతూ విత్తనాలు చల్లుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడవులు పెంచాలని సందేశమిచ్చారని, మరి సహజమైన అడవులను నాశనం చేసే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఎం తవరకు సమంజసమని ఆమె ప్రశ్నిం చారు. బాక్సైట్‌పై తప్పుల తడకలతో ఇచ్చిన శ్వేతపత్రం ఒక బూటకమని, ప్రజాభిప్రాయ సేకరణ, వెబ్సైట్, టోల్‌ఫ్రీ వంటివి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను బాక్సైట్ వద్దని మొరపెట్టుకుంటున్న గిరిజనుల గోడును చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గిరిజనులకు ద్రోహం తల పెట్టవద్దని భవిష్యత్తులో బాక్సైట్ ప్రస్తావనే లేకుండా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ప్రాణాలకంటే బాక్సైట్ ఎక్కువా?.. ఎమ్మెల్యే కిడారి విశాఖ మన్యంలో జీవిస్తున్న వేలాది మం ది గిరిజనుల ప్రాణాలకంటే వేల కోట్ల వి లువ చేసే బాక్సైట్ ఎక్కువా? అని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాక్సైట్ ఉద్యమం లో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వమే వెనక్కి తగ్గాలని ఆయన హెచ్చరించారు. గిరిజనులు కాఫీ, వ్యవసాయంతో ఇతర వాణిజ్య పంటలను, అటవీ ఉత్పత్తులతో స్వయం జీవనం సాగిస్తున్నారని, వారపు సంతల్లో ఏటా వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందన్నారు. మన్యంలో గిరిజనులు బాక్సైట్‌ను కోరుకోవడం లేదని, గిరిజనుల శ్రేయస్సు దృష్ట్యా బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. -
ఆశయం ఘనం.. అభివృద్ధి శూన్యం
అలంకారప్రాయంగా అపరెల్‌పార్క్ నిరుపయోగంగా మారిన నిర్మాణాలు పట్టించుకోని పాలకులు మేడ్చల్:నగర శివార్లలో ఉన్న మేడ్చల్ ఒకప్పుడు వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. క్రమంగా వ్యవసాయానికి దూరమై రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగానికి చిరునామాగా మారింది. 1978లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌లో పారిశ్రామిక వాడకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేసింది. పేద ప్రజలకు ఉపాధి కల్పించాలన్న సదాశయంతో 1995 జూలై 19నపార్క్కు శంకుస్థాపన చేశారు. 1999 జూన్ 30న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ప్రధానంగా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించారు. వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కర్ణాటకలో ఉండడంతో అక్కడి వ్యాపారులు అపరెల్ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పార్క్‌ను రూపొందించారు. గ్రామానికి చెందిన పేద రైతుల నుంచి 157 ఎకరాల భూమిని సేకరించి మొత్తం 226.36 ఎకరాల్లో పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 129.87 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా 121 ప్లాట్లను రూపొం దించారు. 60 ఎకరాలను మరిన్ని పరిశ్రమల కోసం ఖాళీగా వదిలారు. 38 ఎకరాల్లో పార్క్‌లో రోడ్లు, మురికి కాలువలు, ఇతర వసతులతో పాటు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికంగా 30 వేలమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రారంభోత్సవంలో పాలకులు ఉపన్యాసాలు దంచారు. 30 వేలు కాదుకదా 3వేల మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయారు. పార్క్ అభివృద్ధికి వైఎస్సార్ కృషి.. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పార్క్ లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో 2008 ఏప్రిల్ 7న ఇక్కడ రెండు పరిశ్రమలు ప్రారంభించారు. బహుళరంగ కంపెనీలు రావాలని మరో 23 ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం అపరెల్ పార్క్ గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. అడవిని తలపిస్తూ.. పరిశ్రమలు, కార్మికులతో కళకళలాడాల్సిన అపరెల్ పార్క్ ప్రస్తుతం కళావిహీనమైంది. దాదాపు 100 ఎకరాలు ఖాళీగా ఉండటంతో చెట్లు, ముళ్లపొదలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది. హుడా ఆధ్వర్యంలో పది ఎకరాల్లో మొక్కలను నాటారు. పార్క్‌కు రావడానికి విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు, కార్యాలయ భవనం నిర్మించారు. అవన్నీ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. పట్టించుకోని ప్రభుత్వం.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అపరెల్ పార్క్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏప్రిల్ 29న అపరెల్ పార్క్‌లో పర్యటించారు. పార్క్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడు నెలలు గడిచినా ఒక్క అడుగుకూడా ముందుకు పడిన దాఖలాలు లేవు.