బాక్సైట్ వద్దే వద్దు
నామమాత్రంగా ఐటీడీఏ సమావేశం
గిరిజన సమస్యలపై సాగని చర్చ
మన్యంలో అభివృద్ధి పనుల తీరుపై పాడేరు, అరకు ఎమ్మెల్యేల అసంతృప్తి
మన్యం ప్రజా ప్రతినిధులందరిదీ ఒకే మాట జీవో 97 రద్దు తీర్మానానికి పట్టు దద్దరిల్లిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ హామీ
పాడేరు : బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించాలని, శాశ్వతంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యేలతో పాటు ఏజెన్సీ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పట్టుబట్టారు. ఇక్కడి యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ముందుగా బాక్సైట్ జీవో 97 రద్దు కోసం తీర్మానం చేశాకే సమావేశం కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీన్ని పాలకవర్గ చర్చనీయాంశాల్లో చేర్చాలన్నారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధాలకు పూనుకోవడం ప్రజాస్వామ్యం విరుద్ధమని చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చీడికాడ, పాడేరు జెడ్పీటీసీ సభ్యులు పి.సత్యవతి, నూకరత్నం మాట్లాడుతూ బాక్సైట్ వల్ల మన్యానికే కాకుండా మైదాన ప్రాంతాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, బాక్సైట్ తవ్వే యోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెదబయలు, అరకు, జి.మాడుగుల ఎంపీపీలు ఉమా మహేశ్వరరావు, కె.అరుణకుమారి, ఎం.వి.గంగరాజు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. 97 జీవోను రద్దు చేయాలని కోరుతూ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని జిల్లా కలెక్టర్ ఎన్ .యువరాజ్ చెప్పారు.
గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వండి.. ఎమ్మెల్యే ఈశ్వరి
అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వాలని, బాక్సైట్‌ను తవ్వి మనుగడకు ముప్పు కలిగించ వద్దని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెలికాప్టర్‌లో తిరుగుతూ విత్తనాలు చల్లుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడవులు పెంచాలని సందేశమిచ్చారని, మరి సహజమైన అడవులను నాశనం చేసే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఎం తవరకు సమంజసమని ఆమె ప్రశ్నిం చారు. బాక్సైట్‌పై తప్పుల తడకలతో ఇచ్చిన శ్వేతపత్రం ఒక బూటకమని, ప్రజాభిప్రాయ సేకరణ, వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ వంటివి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను బాక్సైట్ వద్దని మొరపెట్టుకుంటున్న గిరిజనుల గోడును చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గిరిజనులకు ద్రోహం తల పెట్టవద్దని భవిష్యత్తులో బాక్సైట్ ప్రస్తావనే లేకుండా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల ప్రాణాలకంటే బాక్సైట్ ఎక్కువా?.. ఎమ్మెల్యే కిడారి
విశాఖ మన్యంలో జీవిస్తున్న వేలాది మం ది గిరిజనుల ప్రాణాలకంటే వేల కోట్ల వి లువ చేసే బాక్సైట్ ఎక్కువా? అని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాక్సైట్ ఉద్యమం లో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వమే వెనక్కి తగ్గాలని ఆయన హెచ్చరించారు. గిరిజనులు కాఫీ, వ్యవసాయంతో ఇతర వాణిజ్య పంటలను, అటవీ ఉత్పత్తులతో స్వయం జీవనం సాగిస్తున్నారని, వారపు సంతల్లో ఏటా వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందన్నారు. మన్యంలో గిరిజనులు బాక్సైట్‌ను కోరుకోవడం లేదని, గిరిజనుల శ్రేయస్సు దృష్ట్యా బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు.