లోకేష్‌ అభయం.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! | Nara Lokesh Syndicate Looted Crores Of Money With Binamis In Mining | Sakshi
Sakshi News home page

లోకేష్‌ అభయం.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!

Published Mon, Jul 12 2021 2:33 AM | Last Updated on Mon, Jul 12 2021 8:40 AM

Nara Lokesh Syndicate Looted Crores Of Money With Binamis In Mining‌ - Sakshi

సాక్షి, అమరావతి: లేని బాక్సైట్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ రాజకీయ డ్రామాకు తెరలేపిన టీడీపీ నాయకులు అధికారంలో ఉండగా కొండలు, గుట్టల్ని ఇష్టానుసారం తవ్వి దోచుకున్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్ర గనుల్లో టీడీపీ నేతల అరాచకం అంతాఇంతా కాదు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ అభయంతో ఆయన బినామీలు యధేచ్చగా గనుల్ని కొల్లగొట్టారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే కాకుండా విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు, విజయవాడ, గుంటూరుకు చెందిన మాజీ మంత్రులు కూడా ఈ అక్రమ తవ్వకాల్లో భాగస్వాములే. విజిలెన్స్‌ దాడుల్లో అడ్డంగా దొరికిపోయి రూ.కోట్లలో జరిమానాలు చెల్లించాల్సి రావడం, క్వారీలు మూతపడడంతో తట్టుకోలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. 

మైనింగ్‌ డాన్‌.. లోకేష్‌ బినామీ శ్రీనివాసచౌదరి 
విశాఖ, అనకాపల్లి ప్రాంతంలో లోకేష్‌కు బినామీగా ఉన్న వెంగమాంబ శ్రీనివాసచౌదరి మైనింగ్‌ డాన్‌గా మారి రూ.వేల కోట్లు కొల్లగొట్టాడు. నెల్లూరు నుంచి వచ్చి విశాఖలో తిష్టవేసిన ఆయన మైనింగ్‌ దోపిడీ మాటలకు అందదు. అనకాపల్లి మండలం సీతానగరంలో 4 రోడ్‌ మెటల్‌ లీజులను పర్యావరణ క్లియరెన్స్, డీజీపీఎస్‌ సర్వే లేకుండా లోకేష్‌ అతనికి కట్టబెట్టారు. సర్వే నెంబర్‌ 251లో పి.వెంకటేశ్వరరావు పేరుతో 7.05 ఎకరాలు ఒకచోట, 7.50 ఎకరాలు మరోచోట లీజుకు తీసుకున్నాడు. లీజు పరిధి దాటి పక్కనున్న క్వారీల్లో అక్రమ మైనింగ్‌ చేశాడు. అదే గ్రామంలో వీవీఆర్‌ క్రషర్స్‌ అండ్‌ కాంక్రీట్‌ కంపెనీ పేరుతో సర్వే నెంబరు 193లో 0.0838 ఎకరాలను లీజుకు తీసుకుని అక్రమ మైనింగ్‌ జరిపారు. ఇదే కంపెనీ పేరుతో 303 సర్వే నెంబర్లో 2.08 ఎకరాలు లీజుకు తీసుకుని తవ్వకాలు చేయించారు.

లీజు హద్దుల్ని చెరిపేసి ఇష్టానుసారంగా మెటల్‌ తవ్వేశారు. నిబంధనల్ని ఉల్లంఘించి కొండ పైనుంచి తవ్వకాలు జరిపారు. 16 అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరపడంతో ఆ గనుల స్వరూపమే మారిపోయింది. లోకేష్‌ అండతో శ్రీనివాసచౌదరి ఈ లీజులకు సీనరేజి కూడా కట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా చక్రం తిప్పాడు. మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారుల విచారణలో ఈ అక్రమాలు రుజువు కావడంతో రూ.33 కోట్ల జరిమానా విధించారు.

విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో సర్వే నెంబరు 1లో నాలుగు రోడ్‌ మెటల్‌ లీజులు తీసుకుని సీతానగరంలో మాదిరిగానే ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. విజిలెన్స్‌ తనిఖీలో అవన్నీ బయటపడడంతో ఈ క్వారీలకు ఏకంగా రూ.81 కోట్ల జరిమానా విధించారు. లోకేష్‌ అండతో శ్రీనివాసచౌదరి జరిపిన మైనింగ్‌ దందాలో విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులు కూడా ఉన్నట్లు తేలింది. 

వెలగపూడి అండతో ఎంఎస్‌ రెడ్డి దందా 
ఒంగోలు నుంచి విశాఖ వెళ్లిన మారెడ్డి సింగారెడ్డి అలియాస్‌ ఎంఎస్‌ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అండతో అనకాపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ చేశారు. అనకాపల్లి మండలం మార్టూరులో అంజనీ స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో 6.77 ఎకరాలను లీజుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపాడు. ఈ క్వారీలో 3 లక్షలకుపైగా క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ను తవ్వినట్లు పర్మిట్లు తీసుకున్నాడు. వాస్తవానికి అక్కడ తవ్వింది 1.32 లక్షల క్యూబిక్‌ మీటర్లే. మిగిలిన పర్మిట్లను అమ్ముకుని భారీగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలడంతో రూ.14.50 కోట్ల జరిమానా విధించారు. 

నర్సీపట్నం, పాడేరులో...
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బంధువైన నర్సింగరావు హిమానీ స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో నర్సీపట్నంలో రోడ్‌ మెటల్‌ లీజుకు తీసుకుని అక్రమ మైనింగ్‌ చేశారు. అక్రమాలు బయటపడడంతో రూ.6 కోట్ల జరిమానా విధించారు. పాడేరులో మాదిమాంబ స్టోన్‌ క్రషర్స్‌ పేరు మీద కోన వెంకటేశ్వరరావు టీడీపీ ముఖ్య నాయకుల అండతో యధేచ్చగా తవ్వకాలు జరిపాడు. అనుమతికి మించి తవ్వకాలు జరపడం, మైనింగ్‌ నిబంధనలు ఒక్కటి కూడా పాటించలేదని స్పష్టమవడంతో విజిలెన్స్‌ అధికారులు రూ.14.5 కోట్ల జరిమానా విధించారు.

భారీగా అక్రమాలు జరిగాయి
ఉత్తరాంధ్రలో చాలా పెద్దఎత్తున మైనింగ్‌ అక్రమాలు జరిగాయి. పలు చోట్ల విచారణ చేయగా ఉల్లంఘనలు జరిగినట్లు తేలింది. లేటరైట్, రోడ్‌మెటల్‌ లీజుల్లో ఎక్కువ అక్రమాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్, మాంగనీస్‌ లీజుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేశారు. వీటిని గుర్తించి జరిమానాలు విధించాం. అక్రమాలను ఇంకా వెలికితీస్తున్నాం. 
  – ప్రతాప్‌రెడ్డి, మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ, విశాఖ

గ్రానైట్‌ తవ్వకాలకు అచ్చెన్న అండ 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఆమదాలవలస, రాజాం ప్రాంతాల్లో గ్రానైట్‌ లీజుదారులతో అచ్చెన్నాయుడు లాలూచీపడి అక్రమ తవ్వకాలు చేపట్టారు.ఈ క్వారీల విలువ రూ.వందల కోట్లు ఉంటుంది. టెక్కలిలో ఎంఎస్‌ఈ గ్రానైట్స్, కుష్యా గ్రానైట్స్‌ అక్రమ తవ్వకాలు అచ్చెన్న ప్రోత్సాహంతోనే జరిగాయి. విజిలెన్స్‌ విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లేటరైట్, రోడ్‌ మెటల్, గ్రానైట్, మాంగనీస్‌ గనులకు సంబంధించి వందల లీజులను పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు ఇతరుల పేర్లతో పొంది తవ్వకాలు జరిపించినట్లు తేలింది. ఐదేళ్లలో ఈ గనుల ద్వారా వేల కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్లాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటీ బయటపడడంతో వారి అక్రమార్జన నిలిచిపోయింది. దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, లోకేష్, అయ్యన్న, ఇతర నేతలు బాక్సైట్‌ పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే యత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement