పత్తి ఆహారపంట కూడా! | Cotton is food crop too | Sakshi
Sakshi News home page

పత్తి ఆహారపంట కూడా!

Published Mon, Oct 9 2023 4:22 AM | Last Updated on Mon, Oct 9 2023 4:23 AM

Cotton is food crop too - Sakshi

‘పత్తి’ కేవలం నూలువస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్యపంటగానే సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీనిని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురుపంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్‌ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయసంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం.

పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంటనూనెగా వాడుతున్నాం. పత్తిగింజల చక్కను పశుదాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తిగింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. 

  ప్రపంచంలో అత్యధికంగా పత్తిసాగు చేస్తున్న దేశం భారత్‌. 23శాతం పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షలమంది పత్తిసాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. 
   ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళారైతులే. వీరిలో ఎక్కువమంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే. మన దేశంలో 65శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ.   
  5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 
   ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మికసంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. 
♦ అంతర్జాతీయ పత్తి సలహామండలి (ఐసీఎసీ) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి  ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోంది.
 కిలో పత్తి పండించడానికి 20,000 లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఎసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్‌ సహారన్‌ ఆఫ్రికాదేశాల్లో సాగు చేయదగిన అతికొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఎసీ వాదన. 
♦ పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఎసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తిసాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతు న్నాయని అంచనా. అయితే, దూదిలో 97శాతం సెల్యులోజ్‌ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఎసీ లెక్క చెబుతోంది. 
సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసీఎసీ అంటోంది.  
సింథటిక్‌ ఫైబర్‌ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించొచ్చని, మైక్రోఫైబర్‌ కణాల కాలుష్యం నుంచి జలవనరులు, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఎసీ సూచిస్తోంది. 
పంటకాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3శాతం తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్‌ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఎసీ అంటోంది.
 పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబపోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులు తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్‌ కనెక్ట్‌ నివేదిక తెలిపింది. 
మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95శాతం జన్యుమార్పిడి చేసిన వంగడాలే. 

– సాక్షి సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement