Russia Offers Discounted Oil To India: Russia Offers Steep Discounts On Oil To India Amid Sanctions - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో హింస ఆపండి

Published Fri, Apr 1 2022 2:29 PM | Last Updated on Sat, Apr 2 2022 11:26 AM

Russia Offers Steep Discounts On Oil To India Amid Sanctions - Sakshi

రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌తో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ఉక్రెయిన్‌లో హింసాకాండకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు సూచించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడాలని కోరుకుంటున్నామని, శాంతి యత్నాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన లావ్రోవ్‌ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలను మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

భారత స్వతంత్ర వైఖరి ప్రశంసనీయం  
ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత ప్రభుత్వ ‘స్వతంత్ర’ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ప్రశంసించారు. ఆయన శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో సమావేశమయ్యారు. భారత్‌ చాలా ముఖ్యమైన దేశమని, అమెరికా ఒత్తిడికి లొంగబోదని తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌తో పరస్పర సహకారానికి రష్యా కట్టుబ డి ఉందని లావ్రోవ్‌  చెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్‌ కోరుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

దోపిడీ వ్యవస్థ మనకొద్దు
పశ్చిమ దేశాలే రష్యాను యుద్ధంలోకి నెట్టాయని సెర్గీ లావ్రోవ్‌ ఆరోపించారు. భారత విదేశాంగ విధానం, రష్యా విదేశాంగ విధానం ఒకే విధంగా ఉన్నాయన్నారు. జాతీయ కరెన్సీలతో భారత్, ఇతర భాగస్వామ్య దేశాలతో వాణిజ్య వ్యాపార లావాదేవీలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. భారత్‌–రష్యా మధ్య రూపాయి, రూబుల్‌తో లావాదేవీలు జరగాలన్నారు. డాలర్‌ ఆధారిత చెల్లింపులకు స్వస్తి పలకాలన్నారు. రాత్రికి రాత్రే మన సొమ్మును దోచేసే దొంగల వ్యవస్థ మనకు అక్కర్లేదన్నారు. సొంత కరెన్సీల్లో చెల్లింపుల వ్యవస్థను ఇప్పటికే అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. గతంలో చాలాసార్లు సంక్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాల నడుమ సంబంధాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

సంబంధాలు స్థిరంగా ఉండాలి: జైశంకర్‌
భేదాభిప్రాయాలను, వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్‌ విధానమని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తమ ఎజెండాను విస్తృతం చేయడం ద్వారా సహకారాన్ని విస్తరింపజేస్తామని అన్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య లావ్రోవ్‌తో తన భేటీ జరిగిందని తెలిపారు. ఆర్థిక, సాంకేతిక రంగాలతోపాటు భారత్‌–రష్యా ప్రజల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండడం చాలా  అవసరమని ప్రధాని అన్నారు. జైశంకర్, లావ్రోవ్‌ ద్వైపాక్షిక అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇండో–పసిఫిక్, అసియాన్‌పైనా లావ్రోవ్‌తో చర్చించినట్లు జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. రష్యా నుంచి చౌక ధరతో ముడిచమురు కొనుగోలు చేయాలని భారత్‌ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై తీవ్ర పరిణా మాలు ఉంటా యని అమెరికా హెచ్చరిస్తున్న సంగతి తెలి సిందే. చైనా గనుక యుద్ధం ప్రారంభిస్తే భారత్‌ను రష్యా రక్షించబోదని అమెరికా చెబుతోంది. 

ఇది చదవండి: పుతిన్‌కు పెరిగిన పాపులారిటీ.. రష్యాలోనూ ‘హీరో’గా ఫుల్‌ సపోర్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement