రేపటినుంచి సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
- తొమ్మిది రోజులపాటు పరిశీలించనున్న ప్రపంచబ్యాంకు ప్రతినిధులు
- మధ్యంతర నివేదిక కోసం వస్తున్నారని పీడీ మల్సూర్ వెల్లడి
నాగార్జునసాగర్ : ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించనున్నట్లు సాగర్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్సూర్ తెలిపారు. సోమవారం విజయవిహార్ అతిథిగృహంలో డ్యాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఆధునికీకరణ పనుల వివరాలను ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అందజేసేందుకు వీలుగా అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అవసరమైన అన్ని వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన డ్యాం అధికారులను కోరారు.
అనంతరం మల్సూర్ విలేకరులతో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన, ఆలస్యమైన పనులను వేగవంతం చేసేందుకు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనుల వివరాలకు సం బంధించి మధ్యంతర నివేదిక పొందుపరచడానికి ప్రపంచబ్యాంకు ప్రతిని ధులు వస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ప్రధానకాలువకు సంబంధిం చి మూడు ప్యాకేజీలు నూరు శాతం పూర్తయినట్లు చెప్పారు. నాలుగు ప్యాకేజీలు 90శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలినవి 60శాతం వరకు జరిగినట్లు తెలిపారు.
డిస్ట్రిబ్యూటరీ పనులు 40శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆధునికీకరణ పనులకు ఇప్పటివరకు రూ.3,300 కోట్లు వ్యయం చేసే పనులు ప్రతిపాదించగా 2,300కోట్ల రూపాయల విలువచేసే పనులను ప్రారంభించామని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.1450కోట్లు ఖర్చయినట్లు వివరించారు.సాగర్ కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో డ్యాం ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్, డీఈ చందునాయక్ తదితరులున్నారు.