సాక్షిప్రతినిధి, నల్లగొండ: పాలకుల నిర్లక్ష్యంతో కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా లక్షలాది క్యూసెక్కుల నీరు... సముద్రం వైపు పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసుకునే ముందుచూపు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. సాగర్ ప్రాజెక్టు ఎగువన ఏళ్ల కిందటే మొదలుపెట్టిన ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తికాకపోవడం వల్ల వరద నీటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. 2005 సంవత్సరం నుంచి వరుసగా ఏడేళ్లు సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. 2012 సంవత్సరంలో మినహాయిస్తే సాగర్ నిత్యం జలకళతోనే ఉంది. ఈ సీజన్‌లో ఆగస్టు మొదటివారంలోనే సాగర జలాశయం పూర్తిగా నిండింది. దీంతో గడిచిన రెండు రోజులుగా వరద నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేశారు.
అయితే, దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతున్న వరద నీటి తో ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం వరకు అట్టిపెట్టుకుని మిగిలిన నీటిని దిగువ కష్ణానదిలోకి వదిలేస్తున్నారు. బుధవారం దశల వారీగా గేట్లు ఎత్తిన అధికారులు మొత్తంగా 24 క్రస్ట్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కులు నీటిని కిందికి వదిలారు. గురువారం మధ్యాహ్నం 12గంటల దాకా ఇదే పరిస్థితి. రాత్రి ఏడుగంటల వరకు మొత్తం గేట్లు మూసేశారు. ఈలోగానే లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు చేరింది. ఇంజినీరింగ్ అధికారుల సమాచారం మేరకు 11,574 క్యూసెక్కుల నీరంటే 1 టీఎంసీకి సమానం. ఒక్క టీఎంసీతో 574 ఎకరాలకు సాగునీటిని అందివచ్చు.
ఈలెక్కన ఎంత నీరు వృథా అయ్యిందో ఓ అంచనాకు రావొచ్చు. అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు 2005లో నెల రోజుల పాటు గేట్ల ద్వారా విడుదల చేసిన నీరు 558 టీఎంసీలు. అదే మాదిరిగా 2006 - 571 టీఎంసీలు, 2007- 576 టీఎంసీలు, 2008-588 టీఎంసీలు, 2009-541 టీఎంసీలు, 2010లో 587 టీఎంసీలపై చిలుకు నీటిని కిందకు విడుదల చేశారు. 2011, ఈ ఏడాది విడుదల చేసిన నీటి మొత్తాల వివరాలు అందాల్సి ఉంది. ఈ గణాంకాలను పరిశీలించినా చాలు ఎంతటి విలువైన నీరు వృథా అయ్యిందో అర్థం చేసుకోవడానికి. 2012లో తీవ్ర వర్షాభావంతో నాగార్జునసాగర్ ఆయకట్టు పూర్తిగా ఎండిపోయింది. కానీ, అంతకు ముందు ఏడాది పూర్తిగా నిండినా, వరద నీటిని నిల్వ చేసుకోలేక, మరుసటి ఏడాది రైతులు కరువు కోరలకు చిక్కాల్సి వచ్చింది.
ఏడిపిస్తున్న ... ఏఎంఆర్‌పీ
సాగర్ జలాశయంపై ఆధారపడిన ఏఎంఆర్‌పీ(ఎస్‌ఎల్‌బీసీ) పూర్తిస్థాయిలో రైతాంగాన్ని ఆదుకోలేకపోతోంది. ఏఎంఆర్‌పీ పరిధిలోని ఏకేబీఆర్(అక్కంపల్లి రిజర్వాయర్)ను నింపడం ద్వారా వరికి పూర్తిస్థాయిలో నీటిని ఇచ్చే అవకాశం ఉన్నా విఫలమవుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఏఎంఆర్‌పీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టుకు అనుంబంధంగా ఉన్న ఉదయసముద్రం రిజర్వాయరును పూర్తిస్థాయిలో నింపితే నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు నీరు అందేది.
కృష్ణా వరద జలాలను సద్వినియోగం చేసేందుకు మహానేత దివంగత సీఎం డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఉదయసముద్రం ఎత్తిపోతల (బ్రాహ్మణవెల్లెంల) పథకం పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం నాడు వైఎస్ రూ.562కోట్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వంలో బడ్జెట్ అంతంత మాత్రంగానే విడుదలవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు 25శాతం పనులే పూర్తి చేశారు.
నత్తకు నడకలు నేర్పుతున్న వరద కాల్వ
కృష్ణా వరద నీటిని సద్వినియోగం చేసి నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో శంకుస్థాపన రాయి పడిన సాగర్ వరద కాల్వ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. సాగర్ జలాశయంలో నీటిమట్టం 570 అడుగులకు చేరగానే వరద కాల్వకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయొచ్చు. నీటిమట్టం 570 అడుగులకు తగ్గితే పంపింగ్ ద్వారా నీటిని విడుదల చే యొచ్చు.
కానీ, 2009లో పనులు పూర్తి కావాల్సిన వరదకాల్వ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ కాల్వ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 80వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఏఎంఆర్‌పీ, సాగర్ వరద కాల్వల ద్వారా సుమారు వందకు పైగా చెరువులను నీటితో నింపే వీలుంది. ఒకసారి చెరువులను నింపితే కలిగే లాభం అంతాఇంతా కాదు. కానీ, ఈ విషయాలేవీ ఎవరికీ పట్టడం లేదు.
అయ్యో.. కృష్ణమ్మ!
Published Fri, Aug 9 2013 2:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement