Sagar Dam
-
సాగర్ డ్యామ్ నుంచి లీకేజీలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోంది. డ్యామ్ నాన్ ఓవర్‌ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి పూర్తిగా రెండో వైపునకు నీటి ఊట వస్తోంది. దీనిని అరికట్టడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సమస్య చిన్నదే అయినా ప్రారంభదశలో ఉన్నప్పుడే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో డ్యామ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాయింట్ లేయర్స్ నుంచి వస్తున్న నీరు 1955 నుంచి 1967 మధ్య కాలంలో సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. ప్రధాన డ్యామ్‌లో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్‌ఫ్లో పోర్షన్ ఉండగా, 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు అమర్చి ఉన్న ఓవర్‌ఫ్లో పోర్షన్లు ఉన్నాయి. స్పిల్‌వేకు కుడివైపున 51వ బ్లాకు నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. స్పిల్‌వేకు ఎడమవైపున లిఫ్టుకు కుడివైపున స్లూయీస్గేట్కు పక్కవెంట 22, 23 బ్లాకు వద్ద 510 అడుగులకు దిగువనుంచి నీటి లీకేజీలు వస్తున్నాయి. స్లూయీస్ గేటుకు ఎడమవైపున 51, 52 పోర్షన్లలో నీటిలీకేజీలు ఆగడంలేదు. కుడికాల్వ వైపునగల 73వ బ్లాకులో అదే పరిస్థితి ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న సమయంలో ఈ లీకేజీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా 2013లో డ్యామ్ లోపలివైపు ఇనుప జాలి ఏర్పాటు చేసి సిమెంటుతో ప్లాస్టింగ్ (షాట్ క్రీటింగ్) చేశారు. దీంతో కొన్ని చోట్ల నీటి లీకేజీలు ఆగాయి. మరికొన్ని చోట్ల ఆగడం లేదు. రాతికట్టడం జాయింటింగ్ లేయర్స్ నుంచి నీరు వస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, రాతికట్టడం డ్యామ్‌లకు సీపేజీ సహజమేనని అధికారులు కొట్టి పారేస్తున్నారు. -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటన ఆందోళన రేపింది. పంజాబ్, జమ్మూ సరిహద్దుకు సమీపంలో కథువాలోని రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు సంఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆర్మీ బృందం రెస్క్యూ టీమ్ ప్రమాద స్థలానికి చేరుకుని నిసహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. అయితే అయిదుగురితో ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఆర్మీ హెలికాప్టర్ డ్యామ్‌లో కూలిపోయిన సమాచారం అందిందని రక్షణ బృందాలను ఘటనా స్థలానికి తరలించామని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సురేంద్ర లంబా తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఆనకట్ట పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి 30 కి.మీ దూరంలో ఉంది. -
సాగర్‌డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ అప్రమత్తం
నాగార్జునసాగర్ : పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతవాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలపై ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. గతంలో పాకిస్తాన్ టెర్రరిస్టుల వద్ద సాగర్‌డ్యామ్ ఫొటోలు లభ్యంకావడం, అలాగే హైదరాబాద్‌లో పట్టుబడిన సిమీ ఉగ్రవాది సాగర్‌వాసి కావడంతో సాగర్‌డ్యామ్ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్రమత్తమైంది. ప్రాజెక్టు, విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులను సైతం తనిఖీ చేసిన తర్వాతనే విధుల్లోకి పంపుతున్నారు. డ్యామ్ మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆ పరిసరాల్లో ప్రతీ వాహనాన్ని పరిశీలించాకే పంపుతున్నారు. -
సాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు
పైలాన్‌కాలనీ(నాగార్జున సాగర్), న్యూస్‌లైన్: అన్నదాతల ఆశల సౌధమైన నాగార్జునసాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు పొంచి ఉంది. కాల్షియం నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డ్యామ్ గోడల రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతోంది. భవిష్యత్‌లో ఇది డ్యామ్ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు.. సాగర్ డ్యామ్ గోడల్లోకి వచ్చే ఊటనీటిని తొలగించడానికి అంతర్భాగంలో 250కి పైగా రంధ్రాలను ఏర్పాటు చేశారు. ఊట నీరును ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల డ్యామ్ గోడల్లో కాల్షియం పేరుకుపోకుండా నివారించడానికి వీలుంటుంది. ఈ రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతే ఊట నీరు రంధ్రాల్లోకి కాకుండా డ్యాం గోడల్లోకి వెళ్తుంది. నీటితోపాటు కాల్షియం కూడా గోడల్లోకి వెళ్తే పగుళ్లుపడే ప్రమాదం ఉంది. చివరికి డ్యామ్ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాల్సి ఉంది. 15సంవత్సరాల క్రితం ఒకసారి మాత్రమే కాల్షియాన్ని తొలగించారు. మళ్లీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అవకతవకలే.... డ్యామ్ రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియం తొలగించేందుకు 15 సంవత్సరాల క్రితం ఎన్ఎస్పీ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆయన నాసిరకం పరికరాలతో డ్రిల్లింగ్ చేయగా కాల్షియంతో పాటు డ్యాం లోపలి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. స్పందించిన ముఖ్యమంత్రి కాల్షియం తొలగింపులో జరిగిన అవకతవకలపై విచారణకు సుబ్బరాంరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. కోర్ శాంపిల్ తీయకుండానే అధికారులు డ్రిల్లింగ్ చేయడం వల్ల రంధ్రాల్లో ఎంత కాల్షియం పేరుకుపోయిందో కూడా అధికారులకు అర్ధం కాలేదు. కాల్షియం తొలగింపులో అవకతవకలు జరిగినట్టు సుబ్బరాంరెడ్డి విచారణలో వెల్లడికావడంతో ఎన్ఎస్పీ అధికారులకు మెమోలు కూడా జారీ అయ్యాయి. త్వరలోనే పనులు - సుదర్శన్‌రావు, డీఈ, నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ గోడల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది పదిహేను రోజుల్లో కాల్షియం తొలగించే పనులు చేపడుతాం. -
సాగర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
దర్శి, న్యూస్‌లైన్: సాగర్ కాలువలు జలకళను సంతరించుకోనున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.40 అడుగులకు చేరింది. మరో నాలుగడుగుల మేర నీరు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండినట్లే. బుధవారం సాయంత్రానికి సాగర్ ప్రాజెక్టు 26 క్రెస్టుగేట్లు ఐదడుగుల మేర ఎత్తి లక్షా 90 వేల 116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 8 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. సాగర్ కుడి కాలువ 53/2 మైలు వద్ద చేజెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని జోన్-2 కింద ఉన్న ప్రకాశం జిల్లాకు విడుదల చేశారు. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 వద్దకు నీరు చేరేసరికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఆ తరువాత మూడేళ్లపాటు సరిగా వర్షాలు కురవలేదు. దీంతో జలాశయంలో నీటి నిల్వ డెడ్‌స్టోరేజ్‌కు చేరింది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వారం రోజులుగా సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీరందించగలమని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ యల్లారెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులంతా ఖరీఫ్‌లో వరిసాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం: ఈ ఏడాది ముందస్తుగా సాగర్ కాలువలకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. మాగాణి సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాది సాగుచేయక రైతులు రాబడి కోల్పోయారు. ఆయకట్టులో సాగు పనులుంటే కూలీలకు కూడా దండిగా ఉపాధి లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలసలు తప్పుతాయి. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మాగాణి సాగవుతుంది. ఎకరాకు 35 నుండి 40 మంది కూలీలకు పని లభిస్తుంది. ఆధునికీకరణ పనుల నిలిపివేత త్రిపురాంతకం, న్యూస్‌లైన్: సాగర్ జలాశయానికి సమృద్ధిగా నీరు చేరి కుడి కాలువకు విడుదల చేయడంతో మరో రెండు రోజుల్లో జిల్లాకు సాగర్ జలాలు అందనున్నాయి. సాగర్ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజర్లకు నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ ప్రధాన కాలువ, మేజర్లపై చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. కాలువలకు నీళ్లు వదులుతుండటంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించారు. సాగర్ జలాలు వస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకోగా, మరికొన్ని చోట్ల నారుమళ్లు పోశారు. తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగా నీరు విడుదల చేస్తామని సాగర్ అధికారులు తెలిపారు. వీటితో తాగునీటి చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపనున్నట్లు తెలుస్తోంది.