పైలాన్‌కాలనీ(నాగార్జున సాగర్), న్యూస్‌లైన్: అన్నదాతల ఆశల సౌధమైన నాగార్జునసాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు పొంచి ఉంది. కాల్షియం నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన ఎన్‌ఎస్‌పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డ్యామ్ గోడల రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతోంది. భవిష్యత్‌లో ఇది డ్యామ్ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.
కాల్షియం తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు..
సాగర్ డ్యామ్ గోడల్లోకి వచ్చే ఊటనీటిని తొలగించడానికి అంతర్భాగంలో 250కి పైగా రంధ్రాలను ఏర్పాటు చేశారు. ఊట నీరును ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల డ్యామ్ గోడల్లో కాల్షియం పేరుకుపోకుండా నివారించడానికి వీలుంటుంది. ఈ రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతే ఊట నీరు రంధ్రాల్లోకి కాకుండా డ్యాం గోడల్లోకి వెళ్తుంది. నీటితోపాటు కాల్షియం కూడా గోడల్లోకి వెళ్తే పగుళ్లుపడే ప్రమాదం ఉంది. చివరికి డ్యామ్ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాల్సి ఉంది. 15సంవత్సరాల క్రితం ఒకసారి మాత్రమే కాల్షియాన్ని తొలగించారు. మళ్లీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
గతంలో అవకతవకలే....
డ్యామ్ రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియం తొలగించేందుకు 15 సంవత్సరాల క్రితం ఎన్‌ఎస్‌పీ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆయన నాసిరకం పరికరాలతో డ్రిల్లింగ్ చేయగా కాల్షియంతో పాటు డ్యాం లోపలి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. స్పందించిన ముఖ్యమంత్రి కాల్షియం తొలగింపులో జరిగిన అవకతవకలపై విచారణకు సుబ్బరాంరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. కోర్ శాంపిల్ తీయకుండానే అధికారులు డ్రిల్లింగ్ చేయడం వల్ల రంధ్రాల్లో ఎంత కాల్షియం పేరుకుపోయిందో కూడా అధికారులకు అర్ధం కాలేదు. కాల్షియం తొలగింపులో అవకతవకలు జరిగినట్టు సుబ్బరాంరెడ్డి విచారణలో వెల్లడికావడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులకు మెమోలు కూడా జారీ అయ్యాయి.
త్వరలోనే పనులు
- సుదర్శన్‌రావు, డీఈ, నాగార్జునసాగర్ డ్యామ్
నాగార్జునసాగర్ డ్యామ్ గోడల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది పదిహేను రోజుల్లో కాల్షియం తొలగించే పనులు చేపడుతాం.
సాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు
Published Mon, Oct 21 2013 2:51 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement