మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిచండానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. క్వార్టర్స్ ఖాళీ చేయాలని వాటిలో నివాసం ఉంటున్న వారికి గత నెలలో ఎన్‌ఎస్‌పీ అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఖాళీ చేయించడానికి అధికారులకు మాత్రం ముహూర్తం కుదరడం లేదు.
కొందరు ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్నారని, అద్దె కూడా చెల్లించనందున వారిని ఖాళీ చేయించాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, బీజేపీ నాయకులు వనం మదన్‌మోహన్‌లు హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ నాయకులు రతన్‌సింగ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 జూలై 9 ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 30 లోగా క్వార్టర్స్ ఆక్రమించుకున్నవారు ఖాళీ చేయాలని హైకోర్టు పేర్కొంది.
అదేవిధంగా 2013 జూన్ 10వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ప్రకారం క్వార్టర్స్ ఆక్రమించుకున్న వారు అద్దె బకాయిలు అక్టోబర్ 30వ తేదీలోగా చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్‌ఎస్‌పీ అధికారులు మొదటి విడతగా 31 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకోని వారి ఇళ్లకు సైతం అంటించారు. ఖాళీ చేయకుంటే రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహకారంతో క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు నోటీసులలో కూడా పేర్కొన్నారు. అయినా కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేసే గడువు ముగిసింది.
పోలీసుల సహకారం కోరిన అధికారులు
ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్ అక్రమించుకొని నివాసం ఉంటున్న వారిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయించడానికి గాను ఎన్‌ఎస్‌పీ అధికారులు పోలీసుల సహకారం కోరారు. గురువారం ఆరు ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌ను ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులు ఖాళీ చేయించకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్‌పీ సుభాష్‌చంద్రబోస్‌కు వద్ద వెళ్లి సహకారం కోరినట్లు తెలిసింది. కాగా డివిజన్‌లో ఉన్న పోలీసులు వివిధ పనుల నిమిత్తం డ్యూటీలలో ఉన్నందున అదనపు పోలీసులు వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్వార్టర్స్ ఖాళీ చేయించడానికి ఎన్‌ఎస్‌పీ అధికారులు వేచి చూస్తున్నారు.
కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్ ఆక్రమణ వివాదం మరోవైపు విజిలెన్స్ విచారణలో కూడా ఉంది. ఉపలోకాయుక్త కృష్ణాజీరావు క్వార్టర్స్ అక్రమణ విషయాన్ని విజిలెన్స్‌ను అప్పగించారు. దీంతో విజిలెన్స్ అధికారులు మొత్తం క్వార్టర్స్‌లో అధికారులు ఎంతమంది ఉంటున్నారు. ఇతరులు ఎంతమంది ఉంటున్నారు. ఎన్ని క్వార్టర్స్ ఆక్రమణకు గురయ్యాయనే విషయం విచారణ చేయనున్నారు. కాగా పూర్తి సమాచారాన్ని నవంబర్ 5వ తేదీ లోగా విజిలెన్స్ అధికారులు లోకాయుక్తకు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తాం
అక్రమంగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న వారికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు సైతం ఇచ్చాము. గడువు ముగిసినందున మరో రెండు రోజుల్లో పోలీసుల సహకారంతో ఖాళీ చేస్తాము. ఖాళీ చేయించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నందున వారి సహకారం కావాలని కోరాం.
-గోపాల్, ఎన్‌ఎస్‌పీ ఈఈ, మిర్యాలగూడ
క్వార్టర్ల ఖాళీకి ముహూర్తం ఎప్పుడో?
Published Sat, Oct 5 2013 4:35 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement