జిల్లాలో నవశకానికి నాంది పడనుంది. రానున్న ఎన్నికల్లో యువకులే ప్రభావం చూపనున్నారు. వీరి ఓట్లు సంపాదించిన వారికి విజయం తథ్యం.
సాక్షి, నల్లగొండ : జిల్లాలో నవశకానికి నాంది పడనుంది. రానున్న ఎన్నికల్లో యువకులే ప్రభావం చూపనున్నారు. వీరి ఓట్లు సంపాదించిన వారికి విజయం తథ్యం. జిల్లాలో ఉన్న ఓటర్లలో అధిక శాతం యువతీ యువకులే. శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల తుది జాబితాను చూస్తే ఇది స్పష్టమవుతోంది. 18 నుంచి 29 ఏళ్లలోపు వారి ఓట్లు 32.67 శాతం ఉండడం విశేషం. ఓటరు బాబితాను అధికారులు గ్రామపంచాయతీల్లో, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
అత్యధికం...
జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,21,309 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తుంగతుర్తి నియోజకవర్గంలో నిలిచింది. ఇక్కడ 2,19,609 మంది ఓటర్లు నమోదయ్యారు. అతి తక్కువగా భువనగిరి నియోజకవర్గంలో 1,82,149 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం.