nsp officers
-
సాగర్ నీరు చేపలకా..?
కురిచేడు(ప్రకాశం): జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగర్ జలాలు ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పక్కదారి పట్టాయి. విడుదల నీటిని ఎలా వినియోగించాలంటూ దిశానిర్దేశం చేసి, పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఈ అవకాశం చేపల చెరువుల కాంట్రాక్టర్లకు అందివచ్చిన అవకాశంగా మారింది. జిల్లాలో ఎన్ని చెరువులను నింపాలి, ఏ ప్రాతిపదికన నింపాలి అనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు జిల్లా కలెక్టరు ద్వారా ఎన్ఎస్పీ అధికారులకు తెలియజేయాల్సివుంది. వారు ఆయా మేజర్ల ద్వారా మాత్రమే నీరు విడుదల చేయాలి. కానీ ఈ తతంగం నీరు విడుదలకు ముందుగా జరగాలి. కానీ, ఇంతవరకు ఈ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. దీంతో నీటి సరఫరా వరకు మాత్రమే తాము.. మిగతా విషయాలు అధికారులు చూసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. విడుదలైన నీరు ఎక్కడికి చేరుతుందనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు పట్టింకోకపోవడంతో చేపల చెరువులు జలంతో కళకళలాడుతున్నాయి. ఇదేమని అడిగేవారు లేక నాన్ నోటిఫైడ్ చెరువులకు కూడా నీరు నింపుకునే అవకాశం ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు చేపల చెరువులకు నీరు మళ్లించారు. పశువులకు తాగునీరు అవసరమని చెప్పి నీరు తస్కరించినా చివరకు పశువులకు నీరు లేకుండా చేపలు పెంచుకుంటున్నారు. ఇదేమని అడిగితే మేము నీరు తెచ్చుకున్నాం, మీరు పశువులకు తాపేందుకు వీలు లేదని దబాయిస్తున్నట్లు గ్రామాలలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చేపల చెరువులు లేకపోయినా సొసైటీల పేరుతో గుత్తేదారులు దోచుకుంటున్నా మత్య్సశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు వాటాలు తీసుకుని నిద్ర నటిస్తున్నారు. దీని వలన పంచాయతీలకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నాగార్జున సాగర్‌కాలువ ద్వారా జిల్లాలోని 230 నోటిఫైడ్ చెరువులు, 150 నాన్ నోటిఫైడ్ చెరువులను నింపాల్సివుంది. కానీ అవి నింపకుండా చేపల చెరువులను మాత్రమే నిపంటంలో ఆంతర్యమేమిటో ఆ శాఖల అధికారులకే తెలియాలి. -
నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులున్నందున ఎన్నెస్పీ ఉన్నతాధికారులు వెంటనే నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో నూజివీడు, బాపులపాడు, మాచవరం మేజర్లు ఉన్నాయని, వీటి పరిధిలోని చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయన్నారు. ఈ చెరువుల కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో కూడా కేవలం మూడురోజులు మాత్రమే సాగర్‌జలాలను సరఫరా చేసి నిలిపివేశారన్నారు. చెరువులు నింపకపోతే వ్యవసాయ బోర్లులో కూడా నీటిమట్టం పడిపోయి ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు అధికారులు ప్రభుత్వానికి తెలిపి సాగర్‌జలాలు సరఫరా చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆగిరిపల్లిలోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును సాగర్‌జలాలతో నింపాలన్నారు. అతిపెద్దచెరువైన కొమ్మూరు చెరువును నింపాలన్నారు. నూజివీడు మేజర్‌పై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా సుంకొల్లు, యనమదల చెరువులతో పాటు నూజివీడు పెద్ద చెరువును సాగర్‌జలాలతో నింపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూజివీడుప్రాంతానికి సాగర్‌జలాలను మళ్లించి చెరువులను నింపాలని సూచించారు. -
ఆయకట్టు తడారుతోంది
హాలియా, న్యూస్‌లైన్: ఈ ఏడాది నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలకు ఖరీఫ్ నిండా ముంచితే రబీలోనైనా గట్టెక్కుదామని రైతులు ఆయకట్టులో వరిసాగు చేశారు. తీరా చూస్తే ఎన్ఎస్పీ అధికారులు ఆరుతడి పంటలకే నీరిస్తామని తేల్చారు. వారబంది ప్రకారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు తడారిపోతోంది. ఎండుతున్న పొలాలు వారబందితో సాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న ఆయకట్టు ఎండిపోతోంది. ఈ ఏడాది సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరున్నా ప్రభుత్వం ఆరుతడి పంటలకే నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది. అయినా ఆయకట్టు రైతులు రబీలో వరిసాగు చేశారు. ప్రభుత్వం వారబంది ప్రకారం నీటిని విడుదల చేయడంతో కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. ఎడమ కాల్వ కింద జిల్లాలో 4.31లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. దీనిలో ఇప్పటి వరకు 3.75ఎకరాల్లో వరినాట్లు వేశారు. వారబంది ప్రకారం ఈ కాల్వకు ఈ నెల 5నుంచి 8వరకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో అప్పుడే నాటు వేసిన పొలాలకు పుల్క దిగకపోవడంతో పాటు ముందుగా నాటు వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పొలాలకు సరిగా నీరందక ఎండుతుంటే ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో పెరిగే ఎండలకు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటికోసం ఆందోళనలు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలు వారబంది విధానం వల్ల ఎండుతుండడంతో అన్నదాతలు ఆవేదనకు గురై ఆందోళనకు దిగుతున్నారు. ఎడమ కాల్వ పరిధిలో మొదటి మేజర్ రాజవరం మేజర్ కాల్వ, ఇది 10,820 కిలోమీటర్ల పొడవుంది. దీనికింద 9356.56 ఎకరాలను మొదటగా స్థిరీకరించి 156.25క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సూరేపల్లి మేజర్ కాల్వ కింద కూడా 5133.17 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 80.27 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం ఈ మేజర్ల కింద ఆయకట్టు స్థిరీకరణలో మార్పు రావడంతో ఈ నీరు చివరి పొలాలకు సరిపోక పంట ఎండిపోతోంది. దీంతో ఇటీవల హాలియా మండంలోని రాజవరం, బోయగూడెం, కొంపల్లి, వీర్లగడ్డ తండా, పుల్లారెడ్డిగూడెం గ్రామాల రైతులు వారబంది విధానం ఎత్తివేసి ఏప్రిల్ వరకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. -
సాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు
పైలాన్‌కాలనీ(నాగార్జున సాగర్), న్యూస్‌లైన్: అన్నదాతల ఆశల సౌధమైన నాగార్జునసాగర్ డ్యామ్‌కు కాల్షియం ముప్పు పొంచి ఉంది. కాల్షియం నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో డ్యామ్ గోడల రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతోంది. భవిష్యత్‌లో ఇది డ్యామ్ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు.. సాగర్ డ్యామ్ గోడల్లోకి వచ్చే ఊటనీటిని తొలగించడానికి అంతర్భాగంలో 250కి పైగా రంధ్రాలను ఏర్పాటు చేశారు. ఊట నీరును ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల డ్యామ్ గోడల్లో కాల్షియం పేరుకుపోకుండా నివారించడానికి వీలుంటుంది. ఈ రంధ్రాల్లో కాల్షియం పేరుకుపోతే ఊట నీరు రంధ్రాల్లోకి కాకుండా డ్యాం గోడల్లోకి వెళ్తుంది. నీటితోపాటు కాల్షియం కూడా గోడల్లోకి వెళ్తే పగుళ్లుపడే ప్రమాదం ఉంది. చివరికి డ్యామ్ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాల్సి ఉంది. 15సంవత్సరాల క్రితం ఒకసారి మాత్రమే కాల్షియాన్ని తొలగించారు. మళ్లీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అవకతవకలే.... డ్యామ్ రంధ్రాల్లో పేరుకుపోయిన కాల్షియం తొలగించేందుకు 15 సంవత్సరాల క్రితం ఎన్ఎస్పీ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆయన నాసిరకం పరికరాలతో డ్రిల్లింగ్ చేయగా కాల్షియంతో పాటు డ్యాం లోపలి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. స్పందించిన ముఖ్యమంత్రి కాల్షియం తొలగింపులో జరిగిన అవకతవకలపై విచారణకు సుబ్బరాంరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. కోర్ శాంపిల్ తీయకుండానే అధికారులు డ్రిల్లింగ్ చేయడం వల్ల రంధ్రాల్లో ఎంత కాల్షియం పేరుకుపోయిందో కూడా అధికారులకు అర్ధం కాలేదు. కాల్షియం తొలగింపులో అవకతవకలు జరిగినట్టు సుబ్బరాంరెడ్డి విచారణలో వెల్లడికావడంతో ఎన్ఎస్పీ అధికారులకు మెమోలు కూడా జారీ అయ్యాయి. త్వరలోనే పనులు - సుదర్శన్‌రావు, డీఈ, నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ గోడల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది పదిహేను రోజుల్లో కాల్షియం తొలగించే పనులు చేపడుతాం. -
క్వార్టర్ల ఖాళీకి ముహూర్తం ఎప్పుడో?
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిచండానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. క్వార్టర్స్ ఖాళీ చేయాలని వాటిలో నివాసం ఉంటున్న వారికి గత నెలలో ఎన్ఎస్పీ అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఖాళీ చేయించడానికి అధికారులకు మాత్రం ముహూర్తం కుదరడం లేదు. కొందరు ఎన్ఎస్పీ క్వార్టర్స్‌లో అక్రమంగా నివాసం ఉంటున్నారని, అద్దె కూడా చెల్లించనందున వారిని ఖాళీ చేయించాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, బీజేపీ నాయకులు వనం మదన్మోహన్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ నాయకులు రతన్‌సింగ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 జూలై 9 ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 30 లోగా క్వార్టర్స్ ఆక్రమించుకున్నవారు ఖాళీ చేయాలని హైకోర్టు పేర్కొంది. అదేవిధంగా 2013 జూన్ 10వ తేదీన వెలువడిన ఉత్తర్వుల ప్రకారం క్వార్టర్స్ ఆక్రమించుకున్న వారు అద్దె బకాయిలు అక్టోబర్ 30వ తేదీలోగా చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్ఎస్పీ అధికారులు మొదటి విడతగా 31 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకోని వారి ఇళ్లకు సైతం అంటించారు. ఖాళీ చేయకుంటే రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహకారంతో క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు నోటీసులలో కూడా పేర్కొన్నారు. అయినా కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేసే గడువు ముగిసింది. పోలీసుల సహకారం కోరిన అధికారులు ఎన్ఎస్పీ క్వార్టర్స్ అక్రమించుకొని నివాసం ఉంటున్న వారిని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయించడానికి గాను ఎన్ఎస్పీ అధికారులు పోలీసుల సహకారం కోరారు. గురువారం ఆరు ఎన్ఎస్పీ క్వార్టర్స్‌ను ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులు ఖాళీ చేయించకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్‌కు వద్ద వెళ్లి సహకారం కోరినట్లు తెలిసింది. కాగా డివిజన్లో ఉన్న పోలీసులు వివిధ పనుల నిమిత్తం డ్యూటీలలో ఉన్నందున అదనపు పోలీసులు వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్వార్టర్స్ ఖాళీ చేయించడానికి ఎన్ఎస్పీ అధికారులు వేచి చూస్తున్నారు. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఆక్రమణ వివాదం మరోవైపు విజిలెన్స్ విచారణలో కూడా ఉంది. ఉపలోకాయుక్త కృష్ణాజీరావు క్వార్టర్స్ అక్రమణ విషయాన్ని విజిలెన్స్‌ను అప్పగించారు. దీంతో విజిలెన్స్ అధికారులు మొత్తం క్వార్టర్స్‌లో అధికారులు ఎంతమంది ఉంటున్నారు. ఇతరులు ఎంతమంది ఉంటున్నారు. ఎన్ని క్వార్టర్స్ ఆక్రమణకు గురయ్యాయనే విషయం విచారణ చేయనున్నారు. కాగా పూర్తి సమాచారాన్ని నవంబర్ 5వ తేదీ లోగా విజిలెన్స్ అధికారులు లోకాయుక్తకు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తాం అక్రమంగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న వారికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసులు సైతం ఇచ్చాము. గడువు ముగిసినందున మరో రెండు రోజుల్లో పోలీసుల సహకారంతో ఖాళీ చేస్తాము. ఖాళీ చేయించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నందున వారి సహకారం కావాలని కోరాం. -గోపాల్, ఎన్ఎస్పీ ఈఈ, మిర్యాలగూడ