కల్లూరు మేజరు ద్వారా చేపల చెరువుకు చేరుతున్న సాగర్‌జలాలు
కురిచేడు(ప్రకాశం): జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగర్ జలాలు ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పక్కదారి పట్టాయి. విడుదల నీటిని ఎలా వినియోగించాలంటూ దిశానిర్దేశం చేసి, పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఈ అవకాశం చేపల చెరువుల కాంట్రాక్టర్లకు అందివచ్చిన అవకాశంగా మారింది. జిల్లాలో ఎన్ని చెరువులను నింపాలి, ఏ ప్రాతిపదికన నింపాలి అనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు జిల్లా కలెక్టరు ద్వారా ఎన్‌ఎస్‌పీ అధికారులకు తెలియజేయాల్సివుంది. వారు ఆయా మేజర్ల ద్వారా మాత్రమే నీరు విడుదల చేయాలి. కానీ ఈ తతంగం నీరు విడుదలకు ముందుగా జరగాలి.
కానీ, ఇంతవరకు ఈ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. దీంతో నీటి సరఫరా వరకు మాత్రమే తాము.. మిగతా విషయాలు అధికారులు చూసుకోవాలని ఎన్‌ఎస్‌పీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. విడుదలైన నీరు ఎక్కడికి చేరుతుందనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు పట్టింకోకపోవడంతో చేపల చెరువులు జలంతో కళకళలాడుతున్నాయి. ఇదేమని అడిగేవారు లేక నాన్ నోటిఫైడ్ చెరువులకు కూడా నీరు నింపుకునే అవకాశం ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు చేపల చెరువులకు నీరు మళ్లించారు. పశువులకు తాగునీరు అవసరమని చెప్పి నీరు తస్కరించినా చివరకు పశువులకు నీరు లేకుండా చేపలు పెంచుకుంటున్నారు. ఇదేమని అడిగితే మేము నీరు తెచ్చుకున్నాం, మీరు పశువులకు తాపేందుకు వీలు లేదని దబాయిస్తున్నట్లు గ్రామాలలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో చేపల చెరువులు లేకపోయినా సొసైటీల పేరుతో గుత్తేదారులు దోచుకుంటున్నా మత్య్సశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు వాటాలు తీసుకుని నిద్ర నటిస్తున్నారు. దీని వలన పంచాయతీలకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నాగార్జున సాగర్‌కాలువ ద్వారా జిల్లాలోని 230 నోటిఫైడ్ చెరువులు, 150 నాన్ నోటిఫైడ్ చెరువులను నింపాల్సివుంది. కానీ అవి నింపకుండా చేపల చెరువులను మాత్రమే నిపంటంలో ఆంతర్యమేమిటో ఆ శాఖల అధికారులకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment