irrigation cenals
-
నిధులిస్తేనే నీళ్లు నిలిపేది!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించే యత్నాలు మొదలుపెట్టిన ప్రభుత్వం అందులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పైనా ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిండిని సైతం అదే సమయానికి సిద్ధం చేయాలని భావిస్తోంది. అయితే పాలమూరుకు ఉన్నట్లుగా డిండి ప్రాజెక్టుకు ఎలాంటి రుణాలు లేకపోవడంతో రాష్ట్ర నిధుల నుంచే కేటాయింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియకు, ఆర్అండ్ఆర్ ప్రక్రియకు నిధుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తోంది. నిధులే ప్రధాన సమస్య.. మొత్తం 3.61 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరులో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ఇటీవలే అలైన్మెంట్ ఖరారు చేశారు. కొత్త అలైన్మెంట్తో కొన్ని రిజర్వాయర్లు కొత్తగా వస్తుండగా, వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ అలైన్మెంట్ ఖరారుకు ముందే సింగరాజుపల్లి, ఎర్రవల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా ప్రాజెక్టు కింద 16,250 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8,900 ఎకరాల మేర భూసేకరణ పూర్తి చేశారు. ఈ భూసేకరణకు సంబంధించి రూ.110 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్ల నిర్మాణంతో మొత్తంగా 8 గ్రామాలు ముంపునకు గురౌతుండగా, ఇందులో గొట్టిముక్కల కింద 2, సింగరాజుపల్లి కింద 2, కిష్టరాంపల్లి కింద మరో 4 ఉన్నాయి. ఈ ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.80 కోట్ల మేర నిధులు అవసరం ఉన్నాయి. వీటితో పాటు పెండింగ్ బిల్లులు మరో రూ.70 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నిధుల విడుదలకై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ రిజర్వాయర్లలో గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. స్థానిక పరీవాహకం నుంచి వచ్చే నీటి ఆధారంగానే నీటిని నిల్వచేసే అవకాశమున్నా, రిజర్వాయర్ పరిధిలో 350 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 112 కుటుంబాలను తరలించాల్సి ఉంది. దీనికై మొత్తంగా రూ.30 కోట్ల మేర నిధులు తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. వీటి విడుదలకు ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా ఇంకా నిధుల విడుదల జరుగలేదు. ఈ నిధులు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే స్థానిక పరీవాహకం నుంచే దీనికింద 14 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. సింగరాజుపల్లిలోనూ 71 ఎకరాల మేర భూసేకరణతో పాటు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లిస్తే ఇక్కడ 5 నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రిజర్వాయర్లకు సంబంధించి రూ.34 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ నిధులకై ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నా, ఫలితం లేదు. ఇక చింతపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణకు తమకు అవార్డు ప్రకారం కాకుండా మల్లన్నసాగర్లో ఇచ్చిన మాదిరి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపనున్న సమీక్షలో వీటికి ఓ పరిష్కారం లభిస్తుందని నీటిపారుదల వర్గాలు భావిస్తున్నాయి. -
సాగర్ నీరు చేపలకా..?
కురిచేడు(ప్రకాశం): జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం విడుదల చేసిన సాగర్ జలాలు ఇరిగేషన్, ఆర్‌డబ్లు్యఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పక్కదారి పట్టాయి. విడుదల నీటిని ఎలా వినియోగించాలంటూ దిశానిర్దేశం చేసి, పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఈ అవకాశం చేపల చెరువుల కాంట్రాక్టర్లకు అందివచ్చిన అవకాశంగా మారింది. జిల్లాలో ఎన్ని చెరువులను నింపాలి, ఏ ప్రాతిపదికన నింపాలి అనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు జిల్లా కలెక్టరు ద్వారా ఎన్ఎస్పీ అధికారులకు తెలియజేయాల్సివుంది. వారు ఆయా మేజర్ల ద్వారా మాత్రమే నీరు విడుదల చేయాలి. కానీ ఈ తతంగం నీరు విడుదలకు ముందుగా జరగాలి. కానీ, ఇంతవరకు ఈ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. దీంతో నీటి సరఫరా వరకు మాత్రమే తాము.. మిగతా విషయాలు అధికారులు చూసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. విడుదలైన నీరు ఎక్కడికి చేరుతుందనే విషయాన్ని ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు పట్టింకోకపోవడంతో చేపల చెరువులు జలంతో కళకళలాడుతున్నాయి. ఇదేమని అడిగేవారు లేక నాన్ నోటిఫైడ్ చెరువులకు కూడా నీరు నింపుకునే అవకాశం ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు చేపల చెరువులకు నీరు మళ్లించారు. పశువులకు తాగునీరు అవసరమని చెప్పి నీరు తస్కరించినా చివరకు పశువులకు నీరు లేకుండా చేపలు పెంచుకుంటున్నారు. ఇదేమని అడిగితే మేము నీరు తెచ్చుకున్నాం, మీరు పశువులకు తాపేందుకు వీలు లేదని దబాయిస్తున్నట్లు గ్రామాలలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చేపల చెరువులు లేకపోయినా సొసైటీల పేరుతో గుత్తేదారులు దోచుకుంటున్నా మత్య్సశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు వాటాలు తీసుకుని నిద్ర నటిస్తున్నారు. దీని వలన పంచాయతీలకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నాగార్జున సాగర్‌కాలువ ద్వారా జిల్లాలోని 230 నోటిఫైడ్ చెరువులు, 150 నాన్ నోటిఫైడ్ చెరువులను నింపాల్సివుంది. కానీ అవి నింపకుండా చేపల చెరువులను మాత్రమే నిపంటంలో ఆంతర్యమేమిటో ఆ శాఖల అధికారులకే తెలియాలి. -
పంటకాలువల పనులు వేగవంతం చేయండి
– నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – అధికారులకు జిల్లాకలెక్టర్ హెచ్చరిక – పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశం పత్తికొండ టౌన్: పంటకాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్ 15 నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక మండలపరిషత్ సమావేశ భవనంలో మంగళవారం హంద్రీనీవా, ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు 28, 29 ప్యాకేజీలోని కుడి, ఎడమ కాలువల కింద పంటకాలువల తవ్వకంపై చర్చించారు. పనుల పురోగతిపై సమగ్ర సమాచారం లేకుండా కొందరు రావడంతో వారికి క్లాస్ పీకారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పందికోన రిజర్వాయర్ నుంచి పంటకాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలకు భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, కాలువల తవ్వకం పూర్తికాక పంటలకు సాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫొటోలను తన వాట్సాఫ్‌కు అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున, శశిదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఇరిగేషన్ సీఈ జలంధర్, హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్ఈ నారాయణస్వామి, ఈఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీఓ ఓబులేసు, పత్తికొండ, దేవనకొండ తహసీల్దార్లు పుల్లయ్య, తిరుమలవాణి, హంద్రీనీవా ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.