సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించే యత్నాలు మొదలుపెట్టిన ప్రభుత్వం అందులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పైనా ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిండిని సైతం అదే సమయానికి సిద్ధం చేయాలని భావిస్తోంది. అయితే పాలమూరుకు ఉన్నట్లుగా డిండి ప్రాజెక్టుకు ఎలాంటి రుణాలు లేకపోవడంతో రాష్ట్ర నిధుల నుంచే కేటాయింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియకు, ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియకు నిధుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తోంది.
నిధులే ప్రధాన సమస్య..
మొత్తం 3.61 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరులో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ఇటీవలే అలైన్‌మెంట్ ఖరారు చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో కొన్ని రిజర్వాయర్లు కొత్తగా వస్తుండగా, వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ అలైన్‌మెంట్ ఖరారుకు ముందే సింగరాజుపల్లి, ఎర్రవల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు.
మొత్తంగా ప్రాజెక్టు కింద 16,250 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8,900 ఎకరాల మేర భూసేకరణ పూర్తి చేశారు. ఈ భూసేకరణకు సంబంధించి రూ.110 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్ల నిర్మాణంతో మొత్తంగా 8 గ్రామాలు ముంపునకు గురౌతుండగా, ఇందులో గొట్టిముక్కల కింద 2, సింగరాజుపల్లి కింద 2, కిష్టరాంపల్లి కింద మరో 4 ఉన్నాయి. ఈ ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.80 కోట్ల మేర నిధులు అవసరం ఉన్నాయి. వీటితో పాటు పెండింగ్ బిల్లులు మరో రూ.70 కోట్ల వరకు ఉన్నాయి.
ఈ నిధుల విడుదలకై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ రిజర్వాయర్లలో గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. స్థానిక పరీవాహకం నుంచి వచ్చే నీటి ఆధారంగానే నీటిని నిల్వచేసే అవకాశమున్నా, రిజర్వాయర్ పరిధిలో 350 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 112 కుటుంబాలను తరలించాల్సి ఉంది. దీనికై మొత్తంగా రూ.30 కోట్ల మేర నిధులు తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. వీటి విడుదలకు ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా ఇంకా నిధుల విడుదల జరుగలేదు.
ఈ నిధులు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే స్థానిక పరీవాహకం నుంచే దీనికింద 14 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. సింగరాజుపల్లిలోనూ 71 ఎకరాల మేర భూసేకరణతో పాటు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లిస్తే ఇక్కడ 5 నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రిజర్వాయర్‌లకు సంబంధించి రూ.34 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ నిధులకై ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నా, ఫలితం లేదు.
ఇక చింతపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణకు తమకు అవార్డు ప్రకారం కాకుండా మల్లన్నసాగర్‌లో ఇచ్చిన మాదిరి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపనున్న సమీక్షలో వీటికి ఓ పరిష్కారం లభిస్తుందని నీటిపారుదల వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment