dindi reservoir
-
సెల్ఫీ తీసుకుంటూ.. ప్రాణాలు పోగొట్టుకున్నారు
సాక్షి, నల్లగొండ: డిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. సెల్ఫీ తీసుకుంటూ డిండి ప్రాజెక్టులో యువకులు జారి పడ్డారు. మృతులు జహీరాబాద్‌కు చెందిన సాగర్, ప్రవీణ్‌గా గుర్తించారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్ట్ వద్ద ఫోటోల కోసం నీటిలోకి దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. చదవండి: రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు -
నిధులిస్తేనే నీళ్లు నిలిపేది!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించే యత్నాలు మొదలుపెట్టిన ప్రభుత్వం అందులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పైనా ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిండిని సైతం అదే సమయానికి సిద్ధం చేయాలని భావిస్తోంది. అయితే పాలమూరుకు ఉన్నట్లుగా డిండి ప్రాజెక్టుకు ఎలాంటి రుణాలు లేకపోవడంతో రాష్ట్ర నిధుల నుంచే కేటాయింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియకు, ఆర్అండ్ఆర్ ప్రక్రియకు నిధుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టుకు అవరోధాలు సృష్టిస్తోంది. నిధులే ప్రధాన సమస్య.. మొత్తం 3.61 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరులో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ఇటీవలే అలైన్మెంట్ ఖరారు చేశారు. కొత్త అలైన్మెంట్తో కొన్ని రిజర్వాయర్లు కొత్తగా వస్తుండగా, వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ అలైన్మెంట్ ఖరారుకు ముందే సింగరాజుపల్లి, ఎర్రవల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా ప్రాజెక్టు కింద 16,250 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8,900 ఎకరాల మేర భూసేకరణ పూర్తి చేశారు. ఈ భూసేకరణకు సంబంధించి రూ.110 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్ల నిర్మాణంతో మొత్తంగా 8 గ్రామాలు ముంపునకు గురౌతుండగా, ఇందులో గొట్టిముక్కల కింద 2, సింగరాజుపల్లి కింద 2, కిష్టరాంపల్లి కింద మరో 4 ఉన్నాయి. ఈ ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.80 కోట్ల మేర నిధులు అవసరం ఉన్నాయి. వీటితో పాటు పెండింగ్ బిల్లులు మరో రూ.70 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నిధుల విడుదలకై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ రిజర్వాయర్లలో గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. స్థానిక పరీవాహకం నుంచి వచ్చే నీటి ఆధారంగానే నీటిని నిల్వచేసే అవకాశమున్నా, రిజర్వాయర్ పరిధిలో 350 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 112 కుటుంబాలను తరలించాల్సి ఉంది. దీనికై మొత్తంగా రూ.30 కోట్ల మేర నిధులు తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. వీటి విడుదలకు ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా ఇంకా నిధుల విడుదల జరుగలేదు. ఈ నిధులు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే స్థానిక పరీవాహకం నుంచే దీనికింద 14 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. సింగరాజుపల్లిలోనూ 71 ఎకరాల మేర భూసేకరణతో పాటు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లిస్తే ఇక్కడ 5 నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రిజర్వాయర్లకు సంబంధించి రూ.34 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ నిధులకై ఆర్థిక శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నా, ఫలితం లేదు. ఇక చింతపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణకు తమకు అవార్డు ప్రకారం కాకుండా మల్లన్నసాగర్లో ఇచ్చిన మాదిరి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపనున్న సమీక్షలో వీటికి ఓ పరిష్కారం లభిస్తుందని నీటిపారుదల వర్గాలు భావిస్తున్నాయి. -
'వారంలో డిండి రిజర్వాయర్లకు టెండర్లు'
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం పనులను వారంరోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తికాని పనులను మినహాయించి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నిర్ణయించి రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఐదు రిజర్వాయర్ల తుది అంచనాలు 4 రోజుల్లో పూర్తి చేసి 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో డిండి ప్రాజెక్టు పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించే అంశమై వ్యాప్కోస్ చేస్తున్న సర్వేపై ఆరా తీశారు. ఆ సర్వే పనులకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున అప్పట్లోగా నల్లగొండ జిల్లా రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని సూచించారు. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి(0.8టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8టీఎంసీ)కి రూ.125 కోట్లు, చింతపల్లి(1.1టీఎంసీ)కి రూ.150 కోట్లు, కిష్టరాంపల్లి(10టీఎంసీ)కి రూ.1500 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. మరో రిజర్వాయర్ శివన్నగూడెం(12 టీఎంసీ) అంచనాలు ఖరారు కావాలని, దీనికి రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
నీట మునిగి ఐదుగురు మృతి
* తాత కర్మకాండలకు వచ్చి కానరాని లోకాలకు * నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో ఘటన * మృతుల్లో అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు డిండి : తాత దశదినకర్మలకు వచ్చిన మనవళ్లు, మనుమరాళ్లు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో జరిగింది. అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, మరో బంధువు కలసి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాలలోకి వెళితే... డిండి మండలకేంద్రానికి చెందిన దోవతి మల్లారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు దత్తారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గ్రామీణ వికాస్‌బ్యాంకులో క్యాషియర్ కాగా, రెండో కుమారుడు కరుణాకర్‌రెడ్డి డిండిలోనే టైలర్‌గా పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫైనాన్స్ కన్సల్టెంట్. పదిరోజుల క్రితం మల్లారెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందాడు. డిండిలో ఆదివారం జరిగిన ఆయన దశదినకర్మలకు కుమారులు, కూతుళ్లతో పాటు వారి పిల్లలు, బంధువులు హాజరయ్యారు. వారంతా రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30), ప్రణీత్‌రెడ్డి(20), కరుణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న(20), దేవమణి(17), సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మల్లారెడ్డి బావమరిది నర్సిరెడ్డి (వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తి) కుమారుడు అవినాష్‌రెడ్డి(20), బంధువుల అమ్మాయి మొత్తం ఏడుగురు కలసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలోకి వెళ్లగా అరవింద్‌రెడ్డిని కెమెరాతో ఫొటో తీయమన్నారు. కొంచెం లోపలికి వెళ్లేసరికి నలుగురూ నీటిలో మునిగారు. వారిని రక్షించేందుకు వెళ్లిన అవినాష్‌రెడ్డి కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న అరవింద్‌రెడ్డి, బంధువుల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కూడా పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. డిండి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొం డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మృతదేహాలను సందర్శించారు. మూడు కుటుంబాల్లో గర్భశోకం.. దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రన్స రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి పెద్దకూతురు జ్యోత్స్న హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బీటెక్ పూర్తిచేసిన అవినాష్‌రెడ్డి నర్సిరెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. నీటమునిగి ఈ మూడు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు మృత్యువాత పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఘటనపై తక్షణం స్పందించిన కేసీఆర్ హైదరాబాద్: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెంటనే స్పందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపుచర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అయితే, నాయిని డిండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే మృతదేహాలను వెలికితీశారనే సమాచారం అందడంతో కేసీఆర్ ఆయన్ను వెనక్కి రప్పించారు.