'వారంలో డిండి రిజర్వాయర్లకు టెండర్లు'
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం పనులను వారంరోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తికాని పనులను మినహాయించి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నిర్ణయించి రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఐదు రిజర్వాయర్ల తుది అంచనాలు 4 రోజుల్లో పూర్తి చేసి 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో డిండి ప్రాజెక్టు పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించే అంశమై వ్యాప్కోస్ చేస్తున్న సర్వేపై ఆరా తీశారు.
ఆ సర్వే పనులకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున అప్పట్లోగా నల్లగొండ జిల్లా రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని సూచించారు. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి(0.8టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8టీఎంసీ)కి రూ.125 కోట్లు, చింతపల్లి(1.1టీఎంసీ)కి రూ.150 కోట్లు, కిష్టరాంపల్లి(10టీఎంసీ)కి రూ.1500 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. మరో రిజర్వాయర్ శివన్నగూడెం(12 టీఎంసీ) అంచనాలు ఖరారు కావాలని, దీనికి రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.