పంటకాలువల పనులు వేగవంతం చేయండి
పంటకాలువల పనులు వేగవంతం చేయండి
Published Wed, Oct 5 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
– నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– అధికారులకు జిల్లాకలెక్టర్ హెచ్చరిక
– పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశం
పత్తికొండ టౌన్: పంటకాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్ 15 నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక మండలపరిషత్ సమావేశ భవనంలో మంగళవారం హంద్రీనీవా, ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు 28, 29 ప్యాకేజీలోని కుడి, ఎడమ కాలువల కింద పంటకాలువల తవ్వకంపై చర్చించారు. పనుల పురోగతిపై సమగ్ర సమాచారం లేకుండా కొందరు రావడంతో వారికి క్లాస్ పీకారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పందికోన రిజర్వాయర్ నుంచి పంటకాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలకు భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, కాలువల తవ్వకం పూర్తికాక పంటలకు సాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫొటోలను తన వాట్సాఫ్‌కు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున, శశిదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఇరిగేషన్ సీఈ జలంధర్, హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్‌ఈ నారాయణస్వామి, ఈఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌డీఓ ఓబులేసు, పత్తికొండ, దేవనకొండ తహసీల్దార్లు పుల్లయ్య, తిరుమలవాణి, హంద్రీనీవా ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement