నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: వరుస ఆటుపోట్లతో కుదేలైన అన్నదాతలు రబీసాగుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2011 నుంచి గత ఖరీఫ్ వరకు కరువు, ప్రకృతి ఆగ్రహానికి గురై అన్నదాతలు అప్పులు మిగుల్చుకున్నారు.
గత ఖరీఫ్‌లో మిగిలిన కొద్దిపాటి వరి పంటలకు కోతలు దాదాపుగా పూర్తి కావడంతో రబీసాగులో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరినాట్లు కూడా మొదలయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కుంటలు, రిజర్వాయర్లు పూర్తిగానిండడంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. అదే విధంగా రబీలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఎడమకాల్వకు నీటిని విడుదల చేయడం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు కూడా నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తుం డడంతో సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పరిధిలో కూడా సాగునీటిని విడుదల చేయడంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు పొలాలను దున్నుకోవడంతో పాటు వరినార్లును పెద్దఎత్తున పోసుకున్నారు. ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాలలో వరినార్లు పోశా రు. వరి, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుములు తదితర పంటలను సాగు చేయడానికి అన్నదాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రబీలోనైనా కాలం కలిసి వచ్చి చేసిన అప్పులు తీరిపోనున్నాయని కోటి ఆశలతో ఉన్నారు.
వరిపైనే గురి..
సమృద్ధిగా భూగర్భ జలాలు పెరగడం, ఆయకట్టుకు నీటి విడుదల చేస్తుండడంతో వరిసాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 84 వేల 448 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2లక్షల 85 వేల హెక్టార్లలో సాగు కానున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందులో కేవలం వరి సాధారణ సాగు లక్షా 48 వేల 936 హెక్టార్లు కాగా మరో లక్ష హెకార్లు సాగు పెరిగి మొత్తం 2లక్షల 48 వేల 936 హెక్టార్లలో సాగు కానుండడంతో వ్యవసాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం..
జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో సబ్సిడీపై వరి విత్తనాలను అందించడానికి వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్‌లలో విత్తనాలను సబ్సిడీపై రైతులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వరి ఎంటీయూ 1010 రకం విత్తనాలు 49 వేల క్వింటాళ్లు, వేరుశనగ కె-6రకం 10 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 382, జొన్న 95, మినుములు 1500, చిన్న శనగలు 600, పెసర 150, నువ్వులు 30, పొద్దుతిరుగుడు 30 క్వింటాళ్ల చొప్పున సబ్సిడీపై రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేశారు. అదే విధంగా రబీలో ఎరువుల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. సాధారణ సాగు కంటే మరో లక్ష హెక్టార్లలో సాగు పెరిగే అవకాశం ఉన్నందున దానికి అవసరమైన ఎరువులు దిగుమతి చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి : బి.నర్సింహారావు, జేడీఏ
రబీలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టిసారించి సాగు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితులలో వరి సాగు చేసుకోవాల్సి వస్తే శ్రీవరి పద్ధతిలో సాగు చేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలి. రబీలో సాగు విస్తీర్ణంగా పెరిగే అవకాశం ఉన్నందున దానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశాం. ఇప్పటికే సబ్సిడీపై వరి, వేరుశనగ విత్తనాలను అందిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్య లు తీసుకున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సల హాలు పాటించి దిగుబడులను సాధించాలి.
రబీపైనే కోటి ఆశలు
Published Sun, Dec 29 2013 5:28 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM
Advertisement
Advertisement