బత్తాయి.. చిత్తయి.. | orange Price decrease.. Formers disappointed | Sakshi
Sakshi News home page

బత్తాయి.. చిత్తయి..

Published Thu, Mar 30 2017 3:17 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

బత్తాయి.. చిత్తయి.. - Sakshi

బత్తాయి.. చిత్తయి..

► ఓ వైపు నీటి ఎద్దడి.. మరోవైపు తెగుళ్ల బెడద
► బోర్లు లీజుకు తీసుకునేందుకు సమాయత్తం
► ఉమ్మడి జిల్లాలో 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు
 
ఆరుగాలం కష్టించి బత్తాయి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగులుతోంది. రోజురోజుకూ పతనమవుతున్న ధర వారిని బెంబేలెత్తిస్తోంది. అంతేకాకుండా.. నీటి ఎద్దడితో చెట్లు వేరుకుళ్లు తెగులు బారిన పడుతుండడం కలవరపెడుతోంది. మార్చిలోనే ఇలాంటి పరిస్థితి ఉండడంతో.. ఏప్రిల్, మే నెలల్లో బత్తాయి చెట్లను ఎలా కాపాడు కోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాయలను తెంచాలా.. వద్దా.. అనే మీమాంసలో కర్షకులు కొట్టుమిట్టాడు తున్నారు.  
 
ఉంచాలా.. తెంపాలా ?
 
గతేడాది కత్తెరలో రికార్డు స్థాయిలో పలికిన బత్తాయి ధర ఈ ఏడాది పత్తాలేకుండా పోయింది. ఎంతో ఆశగా ధర కోసం ఎదురు చూస్తున్న రైతుకు నిరాశే ఎదురవుతోంది. ఓవైపు ఎండల భగభగ .. మరోవైపు వేరుకుళ్లు తెగులు బెదడ.. వెరసి నీటికొరతతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎంతోకొంత ధరకు అమ్ముకుందామనుకుంటే ఏప్రిల్‌ నెలలో ధర పెరిగితే పరిస్థితి ఎంటని ఊగిసలాడుతున్నారు.. 
 
► ఊగిసలాటలో బత్తాయి రైతులు ► ∙రోజురోజుకూ పతనమవుతున్న ధర
► ∙ఆందోళనలో రైతులు ► ∙ఏప్రిల్‌ నెలపైనే ఆశలు  
 
నాగార్జునసాగర్‌/గుర్రంపోడు:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలోని బత్తాయి తోటలు సాగువుతున్నాయి.  ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాపునకు వచ్చిన బత్తాయి తోటలు 35 వేల హెక్టార్లలో ఉన్నాయి. 5 ఏళ్లలోపు తోటలు 8వేల హెక్టార్లలో ఉన్నాయి. ఏటా రూ.1,500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. 30 శాతం మేరకు దిగుబడులు ఉండే కత్తెర బత్తాయి నుంచే రూ.500 కోట్ల వ్యాపారం జరగాల్సి ఉంది. అయితే ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో తోటల దగ్గర బత్తాయి టన్ను రూ.30 వేలు పలకగా నేడు టన్ను ధర రూ.15 వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఆగస్టు వరకు వర్షాలు కురవలేదు. ఇదే నెల చివరివారంలో చినుకులు పడడంతో అప్పటి వరకు వాడుబట్టి ఉన్న బత్తాయి మొక్కలకు ఇగురు వచ్చి పూత వచ్చింది. గతేడాది లాగానే ఈసారి రేటు ఉంటుందని ఆశించిన రైతుకు భంగపాటే ఎదురైంది.  
 
మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి
తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉండడం.. పంట దిగుబడి అంతటా ఒకేసారి రావడంతో ధరలో తేడా వచ్చినట్లుగా బత్తాయి వ్యాపారులు తెలుపుతు న్నారు. కానీ హైదరాబాద్‌లోని కొత్తపేట మార్కెట్‌కు  ప్రస్తు తం 30 లారీల బత్తాయిలు మాత్రమే వస్తున్నాయని, గతేడాది ఇదే సీజన్‌లో 150 –300 లారీలు వచ్చేవని వ్యాపారులు పేర్కొంటున్నారు.
 
పెద్ద నోట్ల రద్దు ప్రభావమా?
వ్యాపారులు సిండికేట్‌ కావడం వల్లే ఈవిధంగా ధర ఉంటుందని పలువురు రైతులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా తోటల దగ్గర కొనుగోలు చేసే వ్యాపారులు ముందుగా అడ్వాన్సులు ఇవ్వడం లేదంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో క్యాష్‌లెస్‌ లావాదేవీలు ఉండడంతో ప్రతిపైసా లెక్కకు వస్తుండడంతో ఆ ఎఫెక్ట్‌ కూడా ఈసారి మార్కెట్‌పై పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే సీజన్‌లో కమలాపండ్లు వస్తుండడం, మామిడి గత యేడాది కన్నా ముందస్తుగా రావడంతో బత్తాయిపై ఎఫెక్ట్‌ పడిందని  మరికొందరు వ్యాపారులు తెలుపుతున్నారు.
 
రాలుతున్న ఆశలు  
రెండేళ్లుగా ఊరించిన బత్తాయి ధర ప్రస్తుతం పంట దిగుబడుల సమయంలో దారుణంగా పడిపోవడం రైతులను కలవరపెడుతోంది. తక్కువ ధరకు కాయలను అమ్ముకోలేక, కాయలతో ఉన్న చెట్లను నీటి ఎద్దడి పరిస్థితుల్లో కాపాడులేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పక్వానికి వచ్చిన కాయలు రాలిపోతుండడం, మరోవైపు తొడిమకుళ్లు తెగులుతో కాయలు నేలపాలవుతున్నాయని పండ్ల తోటల రైతులు దిగాలు చెందుతున్నారు. 
 
ధర పెరిగేనా..? 
బత్తాయి కత్తెర పంటకు ఏప్రిల్, మే నెలల్లో ధర పెరుగుతుందనే ఆశతో రైతాంగం ఉంది. గత ఏడాది ఈ సమయంలోనే తోటల వద్ద టన్నుకు రూ.30 వేలకు మించి ధర పలకగా ఈసారి సగానికి పడిపోయింది. ఢిల్లీలో ఎండలు పెరిగే మే నాటికి బత్తాయి ధర పెరగవచ్చుననే ఆశతో రైతులు ఉన్నారు. ఇప్పటికే కోతదశలో ఉన్న బత్తాయిలు అప్పటి వరకు నిలుపుకోవడం కష్టమే. ఆలస్యంగా మే నెలలో కత్తెర దిగుబడులు కొంత వరకు మంచి ధరనే లభించే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. 
 
పొంచి ఉన్న వేసవి గండం
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు వనరులు గల ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల బత్తాయి తోటలకు వేసవి గండం పొంచి ఉంది. బత్తాయికి ధర లేకపోవడంతో కాయలు కోసే పరిస్థితి లేక  నీరందించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే బోర్లు లీజుకు తీసుకోవడం, ట్యాంకర్లతో నీరందించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. కాయలతో ఉన్న చెట్టుకు ఎక్కువగా నీరు అవసరం ఉండడం, వాటికి సరిపడా అందించలేకపోవడంతో మొక్క లు వేరుకుళ్లు తెగులు బారినపడుతున్నాయి. నీటి ఎద్దడితో ఉధృతమయ్యే వేరుకుళ్లు తెగులుతో వేసవిలో ఏటా చెట్లు చనిపోతూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మార్చి నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తోటలను ఎలా దక్కించుకోవాలని రైతులు కలవరపడుతున్నారు. యాసంగి వరి పంట ముగి యగానే బోర్లు లీజుకు దొరికే అవకాశం ఉండటంతో ముందుగానే బోర్లు లీజుకు తీసుకునేందుకు పండ్లతోటల రైతులు సిద్ధపడుతున్నారు. 
 
మద్దతు ధర ప్రకటించాలి
బత్తాయికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అత్యధిక పెట్టుబడులు పెట్టి కాయలు పండిస్తే గిట్టుబాటు ధర లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వాలు కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలి.  – కున్‌రెడ్డి నాగిరెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నల్లగొండ
 
బత్తాయి రైతులను ఆదుకోవాలి
ఈఏడాది కత్తెరలో కనీసం రెండున్నర లక్షల ఆదాయం వస్తుందని ఆశించా. ఇప్పుడేమో ధర బాగా తగ్గిపోయి లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది కత్తెర పంట టన్ను రూ.35 వేల వరకు అమ్మితే ఈసారి రూ.12 వేలు మించడం లేదు. కాయలు రాలిపోయేలా ఉన్నాయి.–  పిల్లి ప్రభాకర్, రైతు, గుర్రంపోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement