సాక్షి, నల్లగొండ జిల్లా నెట్‌వర్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పర్యటన రణరంగంగా మారింది. ఆసాంతం టీఆర్‌ఎస్ కార్యకర్తల అడ్డగింతలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులు.. బీజేపీ శ్రేణుల ప్రతిదాడులతో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల ఇరువర్గాలు రాస్తారోకోలకు దిగాయి. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. దాడులు, లాఠీచార్జిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పర్యటిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే సంజయ్ పర్యటనను అడ్డుకుని, నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఆయా గ్రామాల్లో భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా దీటుగా స్పందించారు. కర్రలు చేతబట్టి టీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు.
ఆర్జాలబావి వద్ద తీవ్ర ఘర్షణ
బండి సంజయ్ కాన్వాయ్ నేరుగా నల్లగొండ జిల్లా కేంద్రం శివార్లలోని ఆర్జాలబావి దగ్గరున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. అప్పటికే అక్కడ గుమిగూడిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘సంజయ్ గోబ్యాక్, బీజేపీ నాయకులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. పోలీసులు రోప్‌పార్టీ సాయంతో సంజయ్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఆయన రైతులతో మాట్లాడుతుండగా.. కొనుగోలు కేంద్రంలోకి చొచ్చుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు వెంటనే కల్పించుకుని టీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. తర్వాత బండి సంజయ్ తిరిగి వెళ్లిపోతుండగా.. కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల నుంచి దిగి కర్రలతో టీఆర్‌ఎస్ కార్యకర్తల వెంటపడ్డారు. పోలీసులు వారిని అడ్డుకుని.. సంజయ్ కాన్వాయ్‌ను పంపేశారు. అయితే బీజేపీ నాయకులు తమపై దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నాయకులు అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. టీఆర్‌ఎస్ వాళ్లే తమపై దాడిచేశారంటూ బీజేపీ నాయకులు కూడా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను పంపేశారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలతో వచ్చిన ఎమ్మెల్యే..
బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆర్జాలబావి కొనుగోలు కేంద్రానికి వచ్చారు. కానీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని భావించిన ఎస్పీ రంగనాథ్ ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు. రాళ్లదాడి జరగొచ్చని ముందే ఊహించిన పోలీసులు.. కొనుగోలు కేంద్రం, పరిసరాల్లో ఉన్న రాళ్లను ఏరి దూరంగా పడేశారు.
కుక్కడం వద్ద లాఠీచార్జి
బండి సంజయ్ మాడుగులపల్లి మండలంలోని కుక్కడం వద్ద కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లగా.. టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు. వారిని అదుపుచేస్తున్న క్రమంలో ఓ ఎస్సై కిందపడిపోవడంతో.. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాల ఆందోళనతో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
శెట్టిపాలెం వద్ద ఆగమాగం
వేములపల్లి మండలం శెట్టిపాలెం కొనుగోలు కేంద్రం వద్ద కూడా బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయన రైతులతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. టీఆర్‌ఎస్ నేతలు విసిరిన కోడిగుడ్లు బండి సంజయ్ వాహనంపై పడ్డాయి. దీనితో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడుల్లోఓ ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ మీడియా ప్రతినిధి కంటికి దెబ్బతగిలింది. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.
యాద్గార్‌పల్లి వద్ద నిరసనలు
మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి సమీపంలోని రైస్ మిల్లుల వద్దకు వెళ్లిన బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంజయ్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు.
చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద రణరంగం..
బండి సంజయ్ కాన్వాయ్ నల్లగొండ జిల్లా దాటి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తుండగా.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ రావడానికి ముందే నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని మూసీ వంతెనపై బైఠాయించారు. సంజయ్ కాన్వాయ్ అక్కడికి చేరుకోగానే.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, రాళ్లు రువ్వారు. దీంతో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి టీఆర్‌ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. బండి సంజయ్ కాన్వాయ్‌ను ముందుకు పంపారు. అయితే కొంత దూరంలో వేచి ఉన్న మరికొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ ఘర్షణలతో చిల్లేపల్లి నుంచి నేరేడుచర్ల, మిర్యాలగూడ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి జనం ఇబ్బందిపడ్డారు. ఇక నేరేడుచర్ల పట్టణంలో కూడా కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.
గడ్డిపల్లిలో రాళ్లు రువ్వి..
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బండి సంజయ్ కాన్వాయ్‌ను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుని రాళ్లు రువ్వారు. ఆందోళకారులు ముందుగానే గ్రామంలో కరెంట్ కట్ చేశారు. గ్రామంలో బీజేపీ దివంగత నేత రామినేని ప్రభాకర్‌రావు విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేస్తున్న సమయంలోనూ రాళ్లు విసిరారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు.
అనంతారంలోనూ..
సూర్యాపేట జిల్లా అనంతారంలో ఆందోళనకారులు కరెంటు కట్‌చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద భారీగా మోహరించారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను వాహనం నుంచి దిగనివ్వలేదు. ఆయన కాన్వాయ్‌ను అనాజిపురం గ్రామం మీదుగా సూర్యాపేట వైపు మళ్లించారు. ఈ విషయం తెలిసిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అనాజిపురంలో బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు.
తాళ్లఖమ్మంపహాడ్‌లో తీవ్ర ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా తాళ్లఖమ్మంపహాడ్ గ్రామంలోనూ భారీగా గుమిగూడిన టీఆర్‌ఎస్ శ్రేణులు బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వాయి. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అయితే పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదంటూ బీజేపీ కార్యకర్తలు గ్రామంలో రాస్తారోకోకు దిగి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టించారు. తర్వాత సంజయ్ కాన్వాయ్ ఇమాంపేటకు చేరుకోగా.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై ట్రాక్టర్ కేజ్ వీల్స్, కలప దుంగలు అడ్డుపెట్టి, కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. అక్కడి నుంచి బయలుదేరిన బండి సంజయ్.. రాత్రి 9.50 గంటలకు పెన్‌పహాడ్ మండలంలోని జానారెడ్డినగర్‌లో ఉన్న బీజేపీ దివంగత నేత కట్కూరి గన్నారెడ్డి నివాసానికి చేరుకుని.. బసచేశారు.
కొనుడుపై కొట్లాట..! టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర దాడులు
Published Mon, Nov 15 2021 1:59 PM | Last Updated on Tue, Nov 16 2021 9:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment