నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు’ తయారైంది జిల్లాలో డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) పరిస్థితి. డ్వామా వద్ద నిధులున్నా విడుదల చేయకుండా డ్రామాలు ఆడుతుండడంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. ఉపాధిహామీ పండ్ల మొక్కల పెంపకం కోసం 30 శాతం నిధులను పేద రైతులకు డ్రిప్ ఏర్పాటు కోసం అందించాల్సి ఉంది.
నిధులు విడుదల చేయకపోవడంతో పండ్ల తోటల సాగు కాగితాలకే పరిమితమైంది. డ్రిప్ ఏర్పాటు కోసం మొక్కలు నాటిన రైతులు ఉపాధిహామీ కార్యాలయాల చుట్టు తిరిగినా రైతులకు ప్రయోజనం కలగడం లేదు. రేపు మాపు అంటూ లబ్ధిదారులను అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారులు (ఏపీఓ) కార్యాలయాల చుట్టు తిప్పించుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో డ్వామా నుంచి 30 శాతం నిధులు విడుదల చేస్తున్నా ఇక్కడి అధికారులు నిధులు ఇవ్వకపోవడంతో రైతులకు డ్రిప్ ఏర్పాటు కావడం లేదు.
రూ.1.41 కోట్ల బకాయి
2007-08 నుంచి 2012-13వరకు మొత్తం 9,636 మంది రైతులకు సంబంధించిన 21వేల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేశారు. 30 శాతం నిధుల చెల్లింపు కింద ఉపాధిహామీ నుంచి ఏపీఎంఐపీ రూ.1.41కోట్లు చెల్లిం చాల్సి ఉన్నది. నేటికీ ఆ బకాయిలు చెల్లించకపోవడంతో ఉపాధిహామీ కింద డ్రిప్ ఏర్పాటుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.
3,200ఎకరాలకు దరఖాస్తు
ఈ ఏడాది 3200 ఎకరాల్లో 1,480 మంది రైతులకు డ్రిప్ ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ (డ్వామా) నుంచి ఆంధ్రప్రదేశ్ మైకో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)కు దరఖాస్తులు అందాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకుండా మళ్లీ కొత్తగా డ్రిప్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేదు.
రైతుల ఇబ్బంది ఇలా..
ఉపాధిహామీ పథకంలో పండ్ల తోటలు సాగు చేసుకునే రైతుల తరఫున 30శాతం నిధులను డ్వామా చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదల చేయకుండా ఏపీఎంఐపీ నుంచి డ్రిప్ మంజూరు కాదు. మొక్కలు నాటి ఏడాదైనా రైతులకు డ్రిప్ ఏర్పాటు కాకపోవడంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి.
డ్వామా..డ్రామా
Published Wed, Feb 26 2014 4:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement