గిద్దలూరు (రాచర్ల), న్యూస్‌లైన్: ఎట్టకేలకు పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ప్రత్యేక పాలనలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులుపడ్డారు. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గాలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అనేక తీర్మానాలు చే శాయి. అయితే వాటి పరిష్కారానికి పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. ప్రజలకెన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తాము ఆ హామీలనెలా నిలబెట్టుకోవాలో అని మథనపడుతున్నారు.
అధికార వికేంద్రీకరణ జరగాలి:
సర్పంచ్‌లకు అధికారాల వికేంద్రీకరించడంలో పాలకుల నిర్లక్ష్యం, వ్యవస్థలో ఉన్న లోపాలు గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా 29 రకాల అధికారాలను పంచాయతీలకు బదలాయించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అందులో పేర్కొన్న విధంగా నేటికీ అమలవడం లేదు. గ్రామాల అభివృద్ధికి బాధ్యులుగా ఉన్న సర్పంచ్‌లకు జిల్లా ప్లానింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడంపై పలు విమర్శలున్నాయి. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యులకు గ్రామ స్థాయిలో అవగాహన లేకపోవడం వలన గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. చాలా గ్రామాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
పంచాయతీలకు అధికారాలు
బదలాయించాలి: ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు బదలాయించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీలో సర్పంచ్‌లకు స్థానం కల్పించినప్పుడే పల్లె సీమలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు. గిద్దలూరు మండలంలో 18, రాచర్లలో 14 పంచాయతీలుండగా, అందులో ఒకటి, రెండు పంచాయతీలు మినహా అన్ని పంచాయతీల్లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. గ్రామ స్థాయిలో ఇంటి పన్ను, ఇతర పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు కాకపోవడంతో మురికి కాలువలను శుభ్రం చేయడం, తాగునీటి పథకాలను నిర్వహించడం తలకు మించిన భారమవుతోంది. కొన్ని గ్రామాల్లో తప్పని సరై మౌలిక వసతుల కోసం పనులు చేసి సర్పంచ్‌లు అప్పులపాలవుతున్నారు. రెండేళ్ల సుదీర్ఘ ప్రత్యేక పాలన అనంతరం ఎట్టకేలకు సర్పంచ్‌లు కొలువు తీరారు. వారిని పలకరించగా వారి మనోగతాలిలా ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలకు అధికారాలివ్వాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామసీమల అభివృద్ధికి సహకరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీలు నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి
మధిర చంద్రశేఖరరెడ్డి, సర్పంచ్, గుడిమెట్ట
నిధులు, అధికారాలు లేక పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. నిధులన్నింటినీ నేరుగా పంచాయతీలకు అందజేయాలి. వివిధ పద్దుల కింద వచ్చే నిధులను కచ్చితంగా పంచాయతీలకు ఇవ్వాలి. అప్పుడే సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి చేయగలరు.
తగినన్ని నిధులు కేటాయించాలి
శంకర్‌నాయక్, సర్పంచ్, కే.యస్.పల్లె
ప్రభుత్వం పంచాయతీలకు తగినన్ని నిధులు కేటాయించడం లేదు. నిధులివ్వకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. వీధి లైట్లు వేయలేని దుస్థితిలో సర్పంచ్‌లున్నారు. చేతిలో చెక్‌బుక్ ఉన్నా, ట్రెజరీలో డబ్బులు లేకపోతే ఏంచేయాలి. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
తాగునీటి వసతి కల్పనకే నిధులు సరిపోవు
సూరా రామలక్ష్మమ్మ, సర్పంచ్
పంచాయతీలో తాగునీటి కల్పన భారంగా మారింది. తగ్గుతున్న భూగర్భ జలాలతో మోటార్లు మరమ్మతులకు గురికావడం, నూతన బోర్లు వేయడం కోసం నిధులు అధికంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. పంచాయతీల్లో అవసరమైన అన్ని రకాల వసతులకు సరిపడే నిధులు కేటాయించాలి.