ఏకగ్రీవ నిధులేవి? | Panchayats to get special funds ahead of polls | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవ నిధులేవి?

Published Mon, Dec 30 2013 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

Panchayats to get special funds ahead of polls

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ ఏకగ్రీవాలను ప్రొత్సాహించింది. కానీ, పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై ఐదు నెలలు గడుస్తున్నా నజరానా డబ్బులు రాలేదు. దీంతో పారితోషికంతో చేపట్టాల్సిన పనులు జరగడం లేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. ఏకగ్రీవమైన పంచాయతీలను రెండు కెటగిరీలుగా చేసి ప్రభుత్వం పారితోషకం కింద నిధులు విడుదల చేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేయాల్సి ఉన్నందున అందుబాటులో బడ్జెట్ లేకనే కొంత ఆలస్యం జరుగుతుందని అధికారుల ద్వారా తెలుస్తోంది.
 
 రూ. 5 కోట్లపైనే..
 జిల్లాలోని గ్రామ పంచాయతీలకు జూలై 23,27,31 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు మొదటి వారంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో  ఏకగ్రీవం పంచాయతీలకు నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను మొదట పర్మినెంట్ పనులకు వినియోగిస్తారు. పంచాయతీ భవనం, స్థలానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిరా్మాణం, మురికివాడల్లో సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి.
 
 ఏకగ్రీవ పంచాయతీలు ఇవే..
 బజార్‌హత్నూర్ మండలంలో రెండు, జైనథ్‌లో ఏడు, తానూర్, తాంసిలలో ఐదు జీపీల చొప్పున 10, తలమడుగు, నేరడిగొండ, భైంసా, ఖానాపూర్‌లలో నాలుగు జీపీల చొప్పున 16, దండేపల్లి, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, కుంటాల, లోకేశ్వరం, మామాడలో మూడు జీపీల చొప్పున 18, బేల, బోథ్, గుడిహత్నూర్, కుభీర్, లక్సెట్టిపేట, నెన్నెల మండలాల్లో రెండు చొప్పున 10 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతోపాటు బెజ్జూర్, చెన్నూర్, దిలావర్‌పూర్, జైపూర్, కడెం, నార్నూర్, సిర్పూర్(టి), వాంకిడి గ్రామ పంచాయతీలు ఎన్నికయ్యాయి.
 
 పనులకు ఉపయోగపడుతాయి
 గ్రామాల్లో తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం పనులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మా గ్రామ పంచాయతీకి రూ.2.60 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టలేకపోతున్నాం. గ్రామ పంచాయతీ భవనం కొత్తది ఉన్నప్పటికీ ఇంకా పర్మినెంట్‌గా ఉండే పనులకు ఉపయోగపడుతాయి. ప్రభుత్వం విడుదల చేస్తే పనులు చేపట్టవచ్చు.
 - శంకర్, బేల మండలం డొప్టాల సర్పంచ్
 
 త్వరలో వచ్చే అవకాశం
 ఏకగ్రీవ పంచాయతీలకు అందజేయాల్సిన పారితోషకాల నిధులను ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఎంటైర్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఈ నిధులు వస్తాయి. గతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పారితోషకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాల్సి ఉంది. త్వరలో జీపీలకు కేటాయించే బడ్జెట్‌లో రావచ్చు.
 - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement