పంచాయతీలపై ‘పవర్’ పిడుగు
Published Thu, Jan 16 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
సాక్షి, రాజమండ్రి :గ్రామ పంచాయతీలను కరెంటు కష్టా లు నీడలా వెంటాడుతున్నాయి. ఎన్నికల అనంతరం పంచాయతీలకు నిధులు విడుదలవడం తో తక్షణం కరెంటు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వచ్చే అరకొర నిధులతో కరెంటు బకాయిలు చెల్లిస్తే గ్రామాభివృద్ధి ఎలాగని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికలు జరగక పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో అప్పట్లో చాలా పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించలేదు. కొద్ది నెలల కిందట ఎన్నికలు జరి గాయి.
సుమారు నెల కిందట 13వ ఆర్థిక సం ఘం, ఇతర నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలని పంచాయతీరాజ్ కమిషనర్ గత నెలలో ఆదేశించారు. ఇదే తడవుగా విద్యుత్తు అధికారులు బిల్లు బకాయిలు తక్షణం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. లేకుంటే మంచినీటి పథకాలు, వీధిదీపాల కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. తాము ఉత్పత్తి సంస్థల నుం చి విద్యుత్తు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని, ఇకపై కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లిం చకపోవడంతో కొన్ని పంచాయతీల్లో బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. ఇప్పుడొచ్చే అరకొర నిధులతో బకాయిల చెల్లింపు ఎలాగని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో బకాయిల తీరిలా..
జిల్లాలో 1,011 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో గత నవంబర్ నాటికి వీధిలైట్లకు రూ.32.36 కోట్ల విద్యుత్తు బకాయిలున్నాయి. వీటిలో మైనర్ పంచాయతీల బకాయిలు రూ.12.25 కోట్లు, మేజర్ పంచాయతీల వాటా రూ.20.11 కోట్లుగా ఉంది. తాగునీటి పథకాలకు మైనర్ పంచాయతీ బకాయిలు రూ.12.15 కోట్లు, మేజర్ పంచాయతీ బకాయిలు రూ.11.14 కోట్లు ఉన్నాయి. మొత్తం నీటి పథకాలకు చెలించాల్సిన బకాయిలు రూ.23.29 కోట్లు కాగా, డిసెంబర్‌లో మరో రూ.2.5 కోట్లు అదనంగా చేరుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రతి పైసా వసూలు చేస్తాం
పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిల్లో ప్రతి పైసా వసూలు చేస్తామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్‌ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ అన్నారు. ఈమేరకు నోటీసులు ఇస్తున్నామన్నారు. గతంలో నిధుల్లేవం టూ బిల్లులు చెల్లించలేదన్నారు. ఇప్పుడు నిధులు వస్తున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చాక కూడా చెల్లించకపోతే కచ్చితంగా సరఫరా నిలిపివేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement