అర్వపల్లి: అదో మారుమూల పల్లె. ఈ పల్లె మూసీనది వెంట ఉంది. కానీ ఈ పల్లెకు ఓ విచిత్ర కథ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామానికి సమస్య వచ్చి పడింది. ఈ ఆవాస గ్రామానికి రెండు గ్రామ పంచాయతీలు, రెండు మండలాలు ఉన్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. ఆ కథాకమామీషు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రామమేర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం–నాగారం రెండు మండలాల మద్య ఈ గ్రామం నలిగిపోతుంది. అదే కంచుగట్లగూడెం గ్రామం. జాజిరెడ్డిగూడెం ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, వర్ధమానుకోట రెండు గ్రామపంచాయతీలు ఉండేవి. గ్రామంలో రెండు ప్రధాన వీధులు ఉండగా ఓ వీధి జాజిరెడ్డిగూడెం, మరో వీధి వర్ధమానుకోట గ్రామపంచాయతీలలో ఉండేవి. దీంతో ఏ గ్రామపంచాయతీ సరిగా పట్టించుకోకపోవడంతో ప్రజలు సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఒకే పంచాయతీ కిందకు ఈ గ్రామాన్ని తేవాలని అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా కొత్తమండలాలు ఏర్పడ్డాక ఈ గ్రామానికి మరో సమస్య వచ్చిపడింది. ఇది వరకు ఈ గ్రామం రెండు పంచాయతీల మద్య ఉండగా ఇప్పుడు రెండు పంచాయతీలతో పాటు రెండు మండలాల పరిధిలోకి వెళ్లింది. ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, నాగారం రెండు మండలాలు అయ్యాయి.
కొన్ని ఇళ్లు ఇటు.. కొన్ని అటు
కంచుగట్లగూడెంలో 70 ఇళ్లు ఉన్నాయి. 200 జనాభా, 150 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలోని ప్రధాన వీధి వెంట ఓ వైపు ఇళ్లు నాగారం మండలం పేరబోయినగూడెం పంచాయతీ పరిధికి, మరో వైపు ఇళ్లు జాజిరెడ్డిగూడెం మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధికి వెళ్లాయి. 55 ఇళ్లు పేరబోయినగూడెం జీపీకి, 15 ఇళ్లు జాజిరెడ్డిగూడెం జీపీకి వచ్చాయి. 150 మంది ఓటర్లకు గాను 100 మంది ఓటర్లు పేరబోయినగూడెం, 50 మంది ఓటర్లు జాజిరెడ్డిగూడెం పరిధికి వచ్చారు. దీంతో ఈ ఆవాస గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు ఇద్దరు సర్పంచ్‌లకు ఓట్లు వేయాల్సి వస్తుంది. దీంతో పరిపాలన పరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యలతో ప్రజల పాట్లు
ఈ గ్రామానికి ఇంత వరకు పక్కా రోడ్డు లేదు. ఇంకా గుంతల మయమైన ఫార్మేషన్‌రోడ్డే. గ్రామంలో ఇప్పటి వరకు జానెడు సీసీరోడ్డు నిర్మించలేదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా అనేక సమస్యలు నెలకొన్నాయి. సరైన మురుగు కాల్వలు లేవు. ఇలా అనేక మౌళిక సమస్యలు గ్రామంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాన్ని ఒకే పంచాయతీ, ఒకే మండలం కిందకు చేర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు
మా గ్రామ విచిత్రమేమిటంటే రెండు పంచాయతీలు, రెండు మండలాల పరిధిలో గ్రామం ఉండటంతో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామానికి ఇంత వరకు పక్కారోడ్డు లేదు. సీసీరోడ్డు నిర్మాణం జరగలేదు. రోడ్డు సరిగా లేక ఆటోలు, బస్సులు కూడా రావడం లేదు. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. ఇప్పటికైనా ఒకే పంచాయతి, ఒకే మండలం కిందకు చేర్చాలి.
-కంచుగట్ల లింగయ్య, వార్డు సభ్యుడు, కంచుగట్లగూడెం
70 ఏళ్ల నుంచి గ్రామం పరిస్థితి ఇలాగే
70 ఏళ్ల నుంచి చూస్తున్నా మా గ్రామ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంత వరకు డాంబర్ రోడ్డు లేదు. ఇప్పుడున్న మట్టిరోడ్డుపై గుంతలు పడి నడిచిపోవాలంటే కూడా సాధ్యం కావడం లేదు. మా ఊరు సగం పేరబోయినగూడెం, ఇంకో సగం జాజిరెడ్డిగూడెం కిందికి పోయాయి. దీంతో మా ఊరును ఎవరూ పట్టించుకోవడం లేదు. నా చిన్నప్పటి నుంచి డాంబర్‌రోడ్డు కావాలని కొట్లాడుతున్నాం.
-కోడి రాజమ్మ, వృద్దురాలు, కంచుగట్లగూడెం
Comments
Please login to add a commentAdd a comment