లెక్కలేని తనం!
విజయనగరం మున్సిపాలిటీ :ప్రజా ధనమంటే పంచాయతీ పాలకులకు లెక్కలేకుండా పోయింది. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తూ, వాటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంత మొత్తంలో నిధులు ఏయే అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారో...? ఎంత మొత్తంలో పక్కదారి పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. పలు పంచాయతీల్లో గ్రామ సభలో తీర్మానం చేయకుండా, ఎటువంటి వివరాలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్టు రెండేళ్లలో భారీగా నిధుల కేటాయింపు సుమారు మూడేళ్ల పాటు నిధులు లేమితో నీరసించిన పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ గ్రాంట్‌ల కింద కోట్లాది రూపాయలు మంజూరుచేశాయి.
గత ఏడాది అక్టోబర్ నెలలో 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సం ఘం, వృత్తిపన్నుల ఆదాయం, తలసరి గ్రాంట్ ల కింద రూ 16కోట్ల 95లక్షల 88వేల 118 విడుదల కాగా, తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు కింద మరో రూ13కోట్ల 6 లక్షల ఒక వేయి 700, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద జూన్ 26న మరో రూ10.10కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలోని 77 గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధు ల కింద రూ 46.20 లక్షల విడుదలయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ60 వేలు చొప్పున వీటిని కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు కేటాయింపు జరుగుతున్నా పల్లెల్లో అభివృద్ధి కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిధుల వినియోగంపై జరగని ఆన్‌లైన్
పంచాయతీలకు వివిధ గ్రాంట్‌ల కింద విడుదలవుతున్న నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి సదరు పంచాయతీ సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుంది. అయితే పంచాయతీలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో ముందుగా గ్రామ సభలు నిర్వహించి తీర్మానించాలి. అనంతరం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖర్చు వివరాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలి. తరువాత చెక్‌పై సం తకం చేసి, సదరు చెక్‌ను ట్రెజరీ ద్వారా డబ్బు రూపంలో మార్చుకోవాలి. ఏ పనికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు, వాటి వివరాలను, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చే యాలి.
అయితే జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఈ పద్ధతిని అనుకరిస్తున్నట్టు కనిపించ డం లేదు. పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శు లు కుమ్మక్కై ఇష్టానుసారం నిధులు డ్రా చేయడంతో పాటు నెలల తరబడి అందుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేయని పరిస్థితి ఉంది. దీంతో ఏ నిధులు ఎందుకు వినియోగించారో... అసలు వినియోగించారో..? లేదో ? తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, చినగుడబ, ఉద్దవోలు పం చాయతీల్లో 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, సాధారణ నిధుల కింద కేటాయించిన రూ 5.03 లక్షలు దుర్వినియోగమైయినట్లు గుర్తించి న కలెక్టర్ సంబంధిత కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా డెంకాడ మండలం మోదవలస పంచాయతీలో రూ20.47లక్షల వ్యయంతో కూడిన పనులను గ్రామ సభ తీర్మానం, ఎటువంటి ప్రతిపాదనలు లేకండా చేపట్టారన్న ఆరోపణలపై సదరు పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ఈనెల 7న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెరకముడిదాం మండ లం బుధరాయవలస సర్పంచ్ బాలి బంగారునాయుడు చెక్ పవర్ రద్దు చేశారు. ఇలా చాలా పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కానరాని ఈఓపీఆర్‌డీల పర్యవేక్షణ :
పంచాయతీలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఈఓపీఆర్‌డీలు పర్యవేక్షణ చేయాలి. ఇందుకుగానే నెలలో 23 రోజుల పాటు పర్యటించే పంచాయతీల జాబితాను ముందు నెలలోనే తయారుచేసుకోవాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితిలేదు. మండలానికి ఒకరు చొప్పున ఉండే అధికారులు కేవలం ఎంపీడీఓ కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కార్యదర్శులే అంతా తామై వ్యవహరించడంతో సర్పంచ్‌లతో చేయికలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి బి.మోహనరావు వద్ద ప్రస్తావించగా.. పంచాయతీల్లో వినియోగిస్తున్న నిధులకు సంబంధించి ఆన్‌లైన్ నమోదు జరగని మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై ఈఓపీఆర్‌డీలతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సక్రమంగా స్పందించడం లేదన్నారు. నిబంధనల మేరకు నిధులు వినియోగించని పక్షంలో వారిపై చర్యలు తప్పవని ఈ విషయంలో కార్యదర్శులే బాధ్యత వహిస్తారని వివరించారు.