రికార్డుల నిర్వహణపై కోల్డ్‌వార్
తామే రికార్డులు రాస్తామంటున్న పంచాయతీ కార్యదర్శులు
వేరే వ్యక్తితో రికార్డుల రాయియిస్తున్న సర్పంచ్‌లు
పంచాయతీ అభివృద్ధిలో సర్పంచులు.. కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకం. చిన్నచిన్న లోపాలున్నా.. వారు ఐక్యంగా ఉంటేనే పాలన కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇందులో నిధుల వ్యయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ బాధ్యత కార్యదర్శులదే కాగా.. ఆ పనేదో మేమే చేయించుకుంటామంటూ సర్పంచులు భీష్మిస్తున్నారు. దీనివెనుక మతలబేమిటో మీరే ఆలోచించండి!!
సంతకవిటి : మండలంలోని పలు పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సర్పంచ్‌లకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మండలంలో 34 పంచాయతీలుండగా 14 మంది కార్యదర్శులే ఉన్నారు. గతంలో అయితే మొత్తం 34 పంచాయతీలకూ కేవలం ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉండేవారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులును వేరే వ్యక్తులు ద్వారా పంచాయతీ సర్పంచ్‌లు రాయించేవారు. తీర్మానాలు చేసేటప్పుడు, నిధులు వినియోగించే సమయంలో కార్యదర్శులకు రికార్డుల వ్యవహారం తెలిసేదికాదు. సర్పంచ్‌లు వారికి నచ్చిన రీతిలో తీర్మానాల రికార్డులు, నిధుల వినియోగం రికార్డులు నిర్వహించేవారు. దీంతో కార్యదర్శులు నామమత్రంగానే ఉండేవారు.
తెర పైకి సమచార హక్కు చట్టం
గతేడాది నుంచి మండలంలో పంచాయతీ కార్యదర్శుల సంఖ్య పెరిగింది. కొత్తగా రిక్రూట్ మెంట్‌ద్వారా వచ్చిన వారు యువకులు కావడంతో పాటు రికార్డులు రాసేందుకు ఆసక్తి ఉన్నవారు కావడంతో పంచాయతీల తీర్మానాలు రికార్డులు తామే రాస్తామని పట్టుబడుతున్నారు. పైగా ఇది వారి బాధ్యత కూడా. మరోవైపు నిధులు వినియోగానికి సంబంధించిన రికార్డుల వివరాలను ప్రజలు సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతున్నారు. ఈ వివరాలిచ్చే సమయంలో రికార్డుల్లోని అవకతవకలకు కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ భయంతోనే కార్యదర్శులు రికార్డులను తామే రాసుకుంటామని, ప్రైవేటు వ్యక్తులతో రాయించవద్దని పట్టుబడుతున్నారు. అయితే కార్యదర్శులే రికార్డులు రాస్తే తమ ఆటలు సాగవని పలు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ రికార్డులును వారికి అప్పగించేందుకు ససేమిరా అంటున్నారు. ఐతే తమచేతికి రికార్డులు రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కార్యదర్శులు చెబుతున్నారు.
సర్పంచ్‌లు + కార్యదర్శులు
Published Wed, Jul 8 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement