విజయనగరం మున్సిపాలిటీలో తాగునీటికి తప్పని తంటాలు
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ప్రజాకర్షక ప్రలో భాలకు తెరలేపింది. మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ప్రలోబపెట్టే చర్యలను ప్రారంభించింది. నాలుగున్నరేళ్లు మిన్నకుండి చివరి ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్టు గుర్తింపుపొందేందుకు ఆరాటపడుతోంది. వివిధ పథకాల కింద భారీగా నిధులు కేటాయింపులు చేస్తూ ప్రజలను, అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో నాలుగు మున్సి పాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ122.23 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడం, పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్నికల జిమ్ముక్కుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓటు ఎటు వేస్తామన్నది పక్కనపెడితే... కనీసం పాలన చివరిలోనైనా కాస్తా అభివృద్ధి చేస్తే చాలని ప్రజలు భావిస్తున్నారు.
రెండేళ్ల తరువాత సిప్ ప్రణాళికకసరత్తుకు మోక్షం...
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.కోట్లలో కేటాంపులు చేసిన నిధులన్నీ సిప్ (క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ స్కీం)లో అమలు చేసింది. వాస్తవానికి ఈ పథకం అమలు ప్రక్రియ రెండేళ్ల కిందటే తెరపైకి రాగా.. నిద్రమత్తు నటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేటాయింపులు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ122.24 కోట్ల నిధుల్లో విజయనగరం మున్సిపాలిటీకి రూ.64.60 కోట్లు కేటాయించగా... బొబ్బిలి మున్సిపాలిటీకి రూ17.07 కోట్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి రూ19.15 కోట్లు, సాలూరు మున్సిపాలిటీకి రూ.13.06 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ 8.36 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఐదు అంశాలపై ఖర్చు చేయాలని ఆదేశించగా.. తాగునీటి కల్పన, రోడ్లు, కాలువల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఉత్తర్వుల్లో సూచిం చింది. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన నిధులకు సంబంధించి అభివృద్ధి పనుల జాబితా ప్రతిపాదనలు ఇప్పటికే రప్పించుకున్న ప్రభుత్వం, పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
నాలుగున్నరేళ్లలో జరగనది..నాలుగు నెలల్లో సాధ్యమేనా..?
గత నాలుగున్నరేళ్ల కాలంలో మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పట్టణప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అలా కేటాయింపులు చేసిన నిధులు ఇప్పటికీ ఖర్చుకాని పరిస్థితి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక్క నగర పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస అవసరాలైన తాగు నీరు కోసం, పక్కా రోడ్లు, డ్రైన్‌లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు లేకపోలేదు. ప్రస్తుత శీతాకాలంలో విజయనగరం మున్సిపాలిటీలో నివసిస్తున్న సుమారు 4 లక్షల మంది ప్రజలు గత రెండు నెలలుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. నాలుగున్నరేళ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా నిధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఎన్నికల తాయిలం అంటూ విశ్లేషకులు భావిస్తుండగా... అధికారులు మాత్రం అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు.
ప్రాంతాల వారీగా కేటాయింపులు ఇలా...
జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.122.23 కోట్లు నిధులు మంజూరు చేయగా... అందులో అత్యధికంగా త్వరలో కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరం మున్సి పాలిటీకి రూ.64.60 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో తాగునీటి సరఫరాకు రూ.3కోట్లు, పక్కా రోడ్ల నిర్మాణానికి రూ.22కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.31 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.3.70కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.4.90 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. బొబ్బిలి మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల్లో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం రూ.3.70 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.5.67 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.1.50 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని సూచించింది. పార్వతీపురం మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల్లో వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ కోసం రూ.3.70 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.3.90 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.2.80 కోట్లు కేటాయించాలని సూచించింది. సాలూరు మున్సిపాలిటీకి కేటా యించిన నిధుల్లో రూ.3.70 కోట్లు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కోసం, కాలువల నిర్మాణానికి రూ.5.54 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.30 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.42లక్షలు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.1.10కోట్లు కేటాయిం చాలని ఆదేశించింది. నెల్లిమర్ల నగర పంచాయతీకి ఇవ్వనున్న నిధుల్లో వివిధ అభివృద్ధిపనులకు రూ.3.70కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.1.61 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.30లక్షలు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.75 లక్షలు కేటాయింపులు చేసింది. కేటాయించిన నిధులు వారీగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపించగా... డిసెంబర్ నెలలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా రూ.కోట్లలో కేటాయింపులు చేసిన నిధులన్నీ సిప్ (క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ స్కీం)లో అమలు చేసింది. వాస్తవానికి ఈ పథకం అమలు ప్రక్రియ రెండేళ్ల కిందటే చర్చకు వచ్చింది. పూర్తి కసరత్తు అనంతరం ప్రతిపాదనలు సేకరించిన ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఈ పథకంలో ఇప్పటికే వేసిన రోడ్లుపై రోడ్లు వేయడం, కాలువల పునఃనిర్మాణం చేయకూడదు. కేటాయించిన నిధులకు సంబంధించి డిసెంబర్ నెలాఖరునాటికి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది. – ఎం.ఎం.నాయుడు,కమిషనర్, సాలూరు మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment