సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ పంచాయతీ రాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు
విజయనగరం మున్సిపాలిటీ: వచ్చే నెలతో పదవీకాలం ముగియనున్న పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఎన్నికల నిర్వహణకు సాహసించకుంటే సర్పంచ్‌లనే గ్రామ పంచాయతీలకు పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించాలని కోరారు.
పట్టణంలోని పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేయడం వెనుక పెద్ద అంతర్యమే దాగి ఉందన్నారు. రాజకీయ లబ్ధికోసం ఎన్నికలు జాప్యం చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోతాయన్నారు.
ఎన్నికల కమిషనర్ గ్రామ పంచాయతీ ఎన్నిలకు సంబంధించి రిజర్వేషన్లు, మిగిలిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినా ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ ఎన్నికల సంఘాన్ని, గ్రామీణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. 73వ రాజ్యాంగ సవరణ, 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా నడుచుకుంటుందన్నారు.
ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన విధించి గ్రామ పంచాయతీలపై పెత్తనం చెలాయించుకోవడం దారుణమైన చర్యగా వాఖ్యానించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వస్తే జవాబుదారీతనం తగ్గి అవినీతి, అక్రమాలు పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment