నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతం అయింది. పది నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొని బస్టాండ్‌లను ముట్టడించాయి. నిరసన ర్యాలీలు చేపట్టాయి. బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసుల ద్వారా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో వందల సంఖ్యలో నేతలు, కార్యకరలను అరెస్ట్ చేశారు. అయినా చాలా ప్రాంతాల్లో బంద్ సాయంత్రం వరకు సంపూర్ణంగా కొనసాగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంతో పాటు జిల్లాలో వ్యాపార, ఇతర వాణిజ్య సముదాయాలు, కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన బంద్ విజయవంతం అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నేతలు కేంద్రం అనుసరిస్తున్న తీరు, చంద్రబాబునాయుడు
వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి జిల్లాలో పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్‌ల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపి హోదా నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి, సర్వేపల్లి నియోజవర్గంలో జరిగిన బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో బంద్‌లో భాగంగా కార్యకర్తలు కొందరు అర గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గూడూరు పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీ ప్రజలకు పూలు ఇచ్చిన బంద్‌కు మద్దతు పలకాని కోరారు.
40 కేసులు 777 మంది అరెస్ట్
తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్. కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేరిగ మురళీతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మొత్తం కలిపి 40 కేసులు నమోదు చేసి 777 మందిని అరెస్ట్ చేసి సొంత పూచికత్తు బెయిల్‌పై విడుదల చేశారు.
- నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ తెల్ల వారుజాము న ఆత్మకూరు బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలి పారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో నగరంలో ర్యాలీ నిర్వహించి హోదా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి. రూప్‌కుమార్‌యాదవ్‌తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.
- నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి నుంచే బంద్ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారం నగరంలోని దూరదర్శన్ కేంద్రాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- సర్వేపల్లిలో పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తీరుపై కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- కోవూరు నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరులో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు.
- కావలిలో పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. కావలి పట్టణంలో బంద్ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు.
- సూళ్లూరుపేటలో తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెలగపల్లి, ఎమ్మెల్యే సంజీవయ్య సీఎం చంద్రబాబు యూటర్న్‌తో రాష్ట్రం అధోగతి పాలవుతోందని మండిపడ్డారు.
- వెంకటగిరిలో పార్టీ సమన్వయకర్త జెడ్పీ చైర్మన్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటగిరి పార్టీ పట్టణ అధ్యక్షుడు డి.ఢిల్లీబాబు పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి బస్‌డిపో వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
- ఉదయగిరిలో పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బంద్ నిర్వహించారు. ఉదయగిరి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వరికుంటపాడులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- గూడూరులో పార్టీ సమన్వయకర్త మేరిగ మురళి నేతృత్వంలో బంద్ కొనసాగింది. పార్టీ రాష్ట్ర నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
- ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment