దేశ సమగ్రతకే ముప్పు
విభజనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తున్న తీరు దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీలకు వివరించారు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే ఈ చర్యను విపక్షాలన్నీ ఏకమై అడ్డుకోవాలని కోరారు. జగన్ శనివారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా, పార్లమెంట్ సభ్యుల ఆందోళనను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను లెక్కపెట్టకుండా రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని వారికి వివరించారు.
పూర్తి నిరంకుశత్వంతో, అడ్డగోలుగా జరుగుతున్న ఈ విభజనను అడ్డుకోవడానికి జాతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గతంలోనే పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి పార్లమెంట్‌లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. శనివారం మరోమారు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
అంతా పథకం ప్రకారమే..
జగన్ శనివారం ముందుగా బీజేపీ నేత అరుణ్ జైట్లీని కలిశారు. గురువారం లోక్‌సభలో జరిగిన ఘటనలను వివరించారు. కేంద్రం ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. ‘‘సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా కాంగ్రెస్ పథకరచన చేసి, దానిని అమలు చేసింది. బయటి రాష్ట్రాల నుంచి బలమైన ఎంపీలను వెల్‌లోకి పంపింది. సీమాంధ్ర ఎంపీలను ఇతర సభ్యులు అడ్డుకోవడమే కాకుండా చేయి చేసుకున్నారు. వెల్‌కు సంబంధించిన వీడియో చిత్రాలను చూస్తే ఎవరెవరు దాడిచేశారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని జగన్ వివరించారు. ‘‘సభ సజావుగా నడవాలన్న సాకుతో సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయించారు. వారు లేకుండానే బిల్లు తేవాలన్నది కాంగ్రెస్ కుతంత్రం. ఇది పార్లమెంటు సంప్రదాయాలను పూర్తిగా మంటకలపడమే. ఈరోజు ఓ రాష్ట్రాన్ని, రేపు మరో రాష్ట్రాన్ని విభజిస్తారు. ఇలా చేస్తూపోతే దేశ సమగ్రతకే ముప్పు రావడం ఖాయం. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ బిల్లును అడ్డుకోండి’’ అని కోరారు. దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘‘సభలో జరిగిన సంఘటన దురదృష్టకరం. బిల్లు ఆఖరు దశలో కాంగ్రెస్ ఇలాంటి పనులు చేయకూడదు. మీరు చెప్పిన అంశాలపై పార్టీలో మాట్లాడతా’’ అని చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మంతనాలు..
ఇంటికొచ్చిన గెగాంగ్ అపాంగ్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని వైఎస్ జగన్ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. శనివారం మధ్యాహ్నం జగన్ ఫోన్‌లో ఠాక్రేతో మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాన్ని వివరించారు. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటెయ్యాలని కోరారు. రాష్ట్రాల విభజనకు శివసేన మొదటి నుంచీ వ్యతిరేకమని ఠాక్రే తెలిపినట్లు మైసూరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారన్నారు. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి మిత్రుడైన అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంతి గెగాంగ్ అపాంగ్ శనివారం సాయంత్రం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ అంశంపై చర్చించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ చేస్తున్న పోరాటాన్ని అపాంగ్ ప్రశంసించినట్లు తెలిసింది.
అంతా కలసివస్తారని విశ్వసిస్తున్నాం: జగన్
శరద్‌యాదవ్‌తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు విభజనను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి వస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని శరద్‌యాదవ్‌కు విన్నవించాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించాలని రెండో మారు కోరాం. విభజన బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. 272 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే చాలు ఎవరినీ అడగకుండా గీతలు గీస్తారు. ఇప్పుడు ఏపీకి జరుగుతున్నదే భవిష్యత్‌లో తమిళనాడు, యూపీ, కర్ణాటకలకు జరగవచ్చు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి దీన్ని అడ్డుకోవాలని కోరాం. జేడీ(యూ)తో పాటు మూడో ఫ్రంట్‌లో ఉన్న 11 పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి ఫ్లోర్ మేనేజ్‌మెంట్ కార్యక్రమం చేపట్టాలని శరద్ యాదవ్‌ను కోరాం. ఆ 11 పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఈ పార్టీల్లో కమ్యూనిస్టులు, ఏఐడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు విభజనను వ్యతిరేకిస్తూ వాటి నిర్ణయాన్ని తెలిపాయి. మిగతావారంతా కలసి వస్తారనే భావిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్‌లో చేరే విషయాన్ని ప్రస్తావించగా.. రాజకీయ చర్చలేవీ జరపలేదని జగన్ తెలిపారు.
లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రవేశపెట్టడంలో సభా సంప్రదాయాలను పాటించలేదని, సభ అనుమతి తీసుకోకుండానే పది సెకన్లలోనే ప్రవేశపెట్టినట్లు చెప్పారని అన్నారు. ‘‘విభజనపై కేంద్రం పూర్తి అప్రజాస్వామికంగా ముందుకెళుతోంది. బిల్లు ప్రవేశపెట్టడానికి సభ అనుమతి కోరాలి. బిల్లుకు అనుకూలంగా ఎక్కువ మంది చేతులు పెకైత్తితే దానిని సభలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పాలి. వ్యతిరేకంగా ఎక్కువ మంది చేతులు ఎత్తితే ప్రవేశపెట్టలేదని చెప్పాలి. కానీ ఇక్కడ అలాంటి సంప్రదాయాలు ఏవీ పాటించలేదు. సభలో సభ్యుల ఆమోదం తెలుసుకోకుండా బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏ ప్రజాస్వామ్యంలోనూ ఇలా జరగదు. దీనిని వ్యతిరేకిస్తున్నా. బీజేపీ, ఎస్పీ సహా అన్ని పార్టీలూ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. శరద్‌యాదవ్, ఎస్పీ, బీజేపీ నేతలు స్పీకర్‌ను కలవగా ఆమె బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అనంతరం మమ్మల్ని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభలో లేకుండా, వారిని చర్చలో పాల్గొననివ్వకుండానే విభజన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అన్యాయం’’ అని అన్నారు.
బిల్లుపై ఏకాభిప్రాయం తెస్తా : శరద్‌యాదవ్
జగన్ శనివారం సాయంత్రం శరద్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. విభజన తీరును వివరించి, బిల్లును అడ్డుకోవాలని కోరారు. దీనిపై శరద్‌యాదవ్ స్పందిస్తూ, థర్డ్ ఫ్రంట్‌లోని 11 పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే విభజనను ఏఐడీఎంకే, ఎస్పీ, సీపీఎంలు వ్యతిరేకిస్తున్న దృష్ట్యా మిగతా పార్టీల వైఖరిని కూడా తెలుసుకుని ముందుకెళతామని హామీ ఇచ్చారు. తెలంగాణకు న్యాయం చేసే సమయంలో సీమాంధ్రకు అన్యాయం చేయకూడదని తాము గట్టిగా కోరుతున్నామని చెప్పారు. అనంతరం శరద్‌యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫ్రంట్‌లో మా ఒక్క పార్టీయే లేదు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునే విషయంలో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయాన్నే జగన్‌కి చెప్పాను’’ అని తెలిపారు. పార్లమెంటులో జరిగిన సంఘటనలను ప్రస్తావించగా.. ‘‘దేశంలో మొదటిసారి ఇలా జరిగింది. దీన్ని సహించేది లేదు. అత్యున్నత పార్లమెంటులో జరిగిన సంఘటనను ఖండించడంతోనే వదిలిపెట్టం. దాని వెంటపడతాం’’ అని చెప్పారు.