ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుమారు 7వేల మందితో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ నెల15న రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. తిరుపతి నుంచి ఒకటి, రాజమండ్రి నుంచి మరొక రైలు బయల్దేరుతుందని వివరించారు. ఒక్కొక్క రైలులో సుమారుగా 1800 మంది కార్యకర్తలు, రెండీంటిలో కలిపి మొత్తం 3600 మంది ఢిల్లీ వెళతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని విజ్ఙప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి నిమిషం వరకు పోరాడుతామని ఉమ్మారెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో మెజారిటి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పథకం ప్రకారం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజను మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 3ను సవరించాలని, రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభలో బిల్లు పెట్టడానికి సాంకేతికపరమైన అడ్డంకులున్నాయని తెలిపారు.