17న ఢిల్లీలో సమైక్య ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
యూపీఏ ప్రభుత్వపు మూర్ఖపు నిర్ణయానికి నిరసన
ఢిల్లీలోని తెలుగువారినీ సమీకరించి
ఏడువేల మందితో ధర్నా చేస్తాం
సమైక్యవాదులందరం 15న రెండు రైళ్లలో బయల్దేరి వెళ్తాం: ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విభజన బిల్లు ఈ నెల 12న రాజ్యసభకు, 18న లోక్‌సభకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బిల్లు రాజ్యసభలో ముందుగా పెట్టడానికి చాలా సాంకేతిక సమస్యలున్నాయి. కనుక ముందుగా రాజ్యసభలో బిల్లు పెట్టరేమో అని భావిస్తున్నాం. బిల్లుపై లోక్‌సభలో పూర్తిగా చర్చించిన తర్వాతే రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది. కనుక వారు మూర్ఖంగా బిల్లును 18న లోక్‌సభలో పెట్టాలని భావిస్తే వారికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయడం కోసం ఈ నెల 15న ఇక్కడి నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ బయలుదేరి 17న జంతర్‌మంతర్ వద్ద బహిరంగసభ, ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. ఇక్కడి నుంచి వెళ్లే ప్రత్యేక రైలులో 24 బోగీలుంటాయి. రెండు రైళ్లలో కలిసి మొత్తం నాలుగువేల మంది దాకా వెళ్లే అవకాశముంది. అలాగే ఢిల్లీలోని తెలుగువారందరినీ సమీకరించి ఏడు వేల మందితో పెద్దఎత్తున ధర్నా చేపట్టి కేంద్రానికి కనువిప్పు కలిగిస్తాం’ అని అన్నారు.
కాంగ్రెస్ పథకానికి.. టీడీపీ వత్తాసు..
విభజన బిల్లు కేంద్ర కేబినేట్ ఆమోదం పొందినప్పటికీ, బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆమోదం పొందడానికి అనేక ఆటంకాలున్నందున, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ఆశాభావం తమలో ఉందని ఉమ్మారెడ్డి చెప్పారు. సమైక్యాన్ని కోరుకుంటూ ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రానికి పట్టడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తయారుచేసుకుంటే దానికి టీడీపీ వత్తాసు పలుకుతున్న వైనం ప్రజానీకమంతా గమనిస్తూనే ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని మొదటి నుంచి కూడా వైఎస్సార్‌సీపీ చెబుతూనే, సమైక్యంగా ఉంచడం కోసం ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపట్టిందని ఆయన వివరించారు.
ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు..
ట్రైన్ నెం.1: తిరుపతి-కడప-గుత్తి-కర్నూలు-సికింద్రాబాద్-రామగుండం-న్యూఢిల్లీ
ట్రైన్ నెం.2: రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-ఖమ్మం-ఖాజీపేట-మంచిర్యాల-న్యూఢిల్లీ
ఇక్కడి నుంచి 15న బయలుదేరే ప్రత్యేక రైళ్లు, ధర్నా ముగియగానే 17వ తేదీ రాత్రికి తిరుగు ప్రయాణమవుతాయి.
(రైళ్లు బయలుదేరే సమయాన్ని తర్వాత ప్రకటిస్తారు)