కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘం పిలుపుమేరకు శనివారం నాటి బంద్ విజయవంతమైంది. 90 శాతానికి పైగా అంగళ్లమూతతో దాదాపు సంపూర్ణమైంది. రైల్‌రోకో, రాస్తారోకోలకు పాల్పడిన వేలాదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడుకు చెందాల్సిన కావేరీ వాటా జలాలను ఎగవేసేందుకు మేఘదాతు అనే ప్రాంతంలో కొత్తగా రెండు ఆనకట్టల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ ఆనకట్టల నిర్మాణమే జరిగితే తమిళనాడు రైతులు 48 టీఎంసీల నీటిని కోల్పోనున్నారు. డెల్టా వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. సుప్రీంకోర్టు సైతం వాటా జలాలు ఇచ్చి తీరాల్సిందేనని తీర్పు చెప్పినా తమిళనాడును దొంగదెబ్బతీసేందుకు ఆనకట్టల నిర్మాణం చేపట్టబోతోంది. నిర్మాణంపై స్టే విధించాలని తమిళనాడు ప్రభుత్వం రెండురోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కర్ణాటక దూకుడును అడ్డుకొనేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నాడు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 59 మంది ఈ తీర్మాన ప్రతిని ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు.
బంద్‌కు పిలుపు: ఇలా ఉండగా, కేంద్రంపై మరింత వత్తిడితెచ్చేలా తిరుచ్చి కేంద్రంగా నడుస్తున్న అఖిలపక్ష రైతు సంఘం నేతృత్వంలో శనివారం నిర్వహించిన బంద్ సంపూర్ణ విజయం సాధించింది. కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, తమాక, వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో ప్రధానంగా వాణిజ్య, వ్యాపార దుకాణాల మూత ద్వారా తమ నిరసన ప్రకటించాలని భావించారు. వారు ఆశించినట్లుగానే వర్తక సంఘాలు సంఘీభావం ప్రకటించగా, 95 శాతం వరకు అంగళ్లు మూతపడ్డాయి. అనేక చోట్ల ఫార్మసీ దుకాణాలను కూడా మూసివేశారు. కోయంబేడులో కాయగూరలు, పండ్లు, పూల దుకాణాలను తెరిచే ఉంచారు.చెన్నై, తిరుచ్చి, కాంచీపురం, తంజావూరు జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది.
రైల్‌రోకోలు ః
చెన్నై, ఎగ్మూరు, తంజావూర్లలో రైల్‌రోకోలను నిర్వహించారు.ఎగ్మూరు రైల్వేస్టేషన్ 7వ ఫ్లాట్‌ఫారంపై నిలిచి ఉన్న ఆనంద్‌పురి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు నిలబడి నినాదాలు చేశారు. అయితే ఈ రైలు సాయంత్రం బయలుదేరుతుందని తెలుసుకున్న ఆందోళనకారులు 6వ ఫ్లాట్‌ఫారానికి చేరుకుని మన్నార్‌కుడి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించిన 1,500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 10.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 11.20 గంటలకు స్టేషన్‌ను వీడింది. అలాగే సెంట్రల్ రైల్వేస్టేషన్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించగా అన్ని మార్గాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి ఉండడంతో వాల్‌టాక్స్ రోడ్డు నుంచి జొరబడ్డారు. 2వ నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న ముంబై ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకోగా 200 మందిని అరెస్ట్ చేశారు. తంజావూరులో తంజై-చెన్నై ఎక్స్‌ప్రెస్‌రైలును అడ్డుకునే ప్రయత్నం చేసిన 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాస్తారోకో
తిరువత్తియూర్ హైరోడ్డులో, తండయార్‌పేట వద్ద రాస్తారోకోలకు పాల్పడిన 170 మందిని అరెస్ట్ చేశారు. తిరువారూరులో 500 మందిని, నాగపట్నంలో 50 మందిని, మదురైలో 50 మందిని రాస్తారోకో సమయంలో అరెస్ట్‌చేశారు. బంద్ కారణంగా అనేక ప్రాంతాలకు పోలీసు బందోబస్తులో బస్సులను నడిపారు. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మాత్రం బస్సులు తిరగలేదు. స్వల్పసంఖ్యలో కొన్ని బస్సులు కర్ణాటక సరిహద్దులోని హొసూరు వరకు నడిచాయి. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సులు రాలేదు. బంద్ ప్రభావంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
బంద్ సక్సెస్
Published Sun, Mar 29 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM
Advertisement