Kaveri river
-
అనుసంధానమా? అపహరణమా?
గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఫైళ్ళు ఢిల్లీలో వేగంగా కదులుతున్నాయి. అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖా మంత్రిగా వున్న నితిన్ గడ్కరీ 2017లో తొలిసారిగా ఈ ప్రాజె క్టును ప్రతిపాదించారు. 2019 జనవరిలో స్వయంగా అమరావతి వచ్చి, 60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడు తున్నట్టు ప్రకటించారు. నిజంగా ఉన్నాయో లేవో స్పష్టంగా తెలియని గోదా వరి అదనపు జలాలే కావేరి అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పనకు ఆధారం. ప్రతి ఏటా 1,100 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. చెన్నై సభలో నితిన్ గడ్కరీ ఏకంగా ఏటా 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నదని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90 శాతం నిధుల్ని అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే కనుక అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం ఆనందించిందేగానీ, దీని వెనుక నున్న వాటర్ హైజాక్ కుట్రను గమనించలేదు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే మాట నిజం. ఇందులో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో వుంది. దక్షణాదిలో ఆ ఒక్క రాష్ట్రాన్ని అయినా కాపాడుకోకుంటే ‘ఉత్తరాది హిందీ పార్టీ’ అనే నింద తప్పదు. గోదావరి నీటిని ఎరగా చూపి తమిళ నాడులోనూ కాలు మోపాలనే ఆశ బీజేపీలో చాలా కాలంగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడమే విచిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదాలు నడుస్తున్నాయి. కావేరి అనుసంధానం ఈ వివాదాల్ని పరిష్కరిస్తుందా? మరింతగా పెంచుతుందా? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. 1980 నాటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరి నదిలో 3,565 టీఎంసీల నికర జలాలున్నట్టు తేల్చింది. అప్పట్లో గోదావరి నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సాల మీదుగా ప్రవహించేది. ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గోదావరి నది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 1,495 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో ఈ నీటిని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు 64 శాతం, తెలంగాణకు 36 శాతం చొప్పున పంపిణీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ. అయినప్పటికీ, బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ వాటా ఇచ్చింది. దానికి రెండు హేతువులు చెప్పింది. మొదటిది, కృష్ణానది మీద తొలి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడ్డాయి. రెండోది, నిర్మాణం పూర్తయి ఆయకట్టు కలిగున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపును ఇచ్చి తీరాలి. అయితే, దీనికో పరిష్కారం కూడా బచావత్ ట్రిబ్యునల్ సూచించింది. భవిష్యత్తులో గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్ళిస్తే, అందులో 18 శాతం మహారాష్ట్రకు, 27 శాతం కర్ణాటకకు కృష్ణా నికర జలాల నుండి ఇవ్వాలని ఓ నియమం పెట్టింది. పోలవరం నుండి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్ళిస్తే అందులో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందుతాయి. మిగిలిన 45 టీఎంసీల్లో 36 శాతం అంటే 16 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. పోలవరం నుండి మళ్ళించే 80 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా దక్కేది 29 టీఎంసీలే. కృష్ణా, గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నికర జలాలను జనాభా ప్రాతిపదికన కాకుండా, పరి వాహక ప్రాంతం ప్రాతిపదికన పంచాలని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో మూడు దశలున్నాయి. మొదటి దశలో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ మధ్య గోదావరి–కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తారు. రెండో దశలో నాగార్జునసాగర్, సోమశిల ప్రాజెక్టుల మధ్య కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తారు. మూడవ దశలో సోమశిల నుండి కట్టలాయ్ మధ్య పెన్నా, కావేరి నదుల్ని అనుసంధానం చేస్తారు. పెన్నా– కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 2022 కేంద్ర బడ్జెట్లోనే నిధుల్ని కేటాయించారు. ఈ నాలుగు నదుల అనుసంధానానికి ముందు, ఆ తరువాత కూడా మరో మూడు నదుల అనుసంధానాలు ఉన్నాయి. ఉత్తరాన మహానదిని గోదావరి నదితో అనుసంధానం చేస్తారు. దక్షిణాన కావేరి నదిని తమిళనాడులోని వాగాయ్, గుండార్ నదులతో అనుసంధానం చేస్తారు. కావేరి–గుండార్ ప్రాజెక్టును కర్ణాటక వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ఇప్ప టికే మొదలు పెట్టేసింది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కన్నా చిన్న తరహా ప్రాజెక్టులే మేలనేది ఇప్పుడు బలపడుతున్న అభిప్రాయం. నీటి పారుదల ప్రాజెక్టుల్ని సమర్థంగా నిర్వహిస్తున్న ఉదా హరణ మనకు ఒక్కటీ కనిపించదు. తుంగభద్రా డ్యామ్ గేటు కొట్టుకొని పోవడం దీనికి తాజా ఉదాహరణ. స్టాప్ లాగ్ గేట్లు, కౌంటర్ వెయిట్ వ్యవస్థ, ఇతర పరికరాలు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలనే ఆలోచన కూడ నీటిపారుదల శాఖ అధికారులకు రాలేదు. ఆ గేట్లకు కొన్నేళ్ళుగా కనీసం గ్రీజు కూడా పెట్టలేదట. నదుల అనుసంధానం వల్ల నాలుగు రకాల నష్టాలు ఉంటాయి. మొదటిది – పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుంది. రెండోది – నదులు, నీటి వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనికి పోతాయి. మూడోది – జల వనరులపై వాణిజ్య హక్కుల్ని మెగా కార్పొరేట్లకు అప్పగించడానికి దారులు తెరచుకుంటాయి. నాలుగోది – ప్రతి ఏటా నది నీళ్ళు సముద్రం లోనికి పారకపోతే సముద్రం నది వైపునకు దూసుకుని వచ్చి డెల్టా భూముల్ని చవిటి పర్రలుగా మార్చేస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. జూలై నెలలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుండి మొదలెట్టాలని కోరింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుల కన్నా ఏపీలోని పోలవరం నుండి మొదలెడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. నరసా రావుపేట సమీపాన బొల్లపల్లె వద్ద 300 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మిస్తే అక్కడి నుండి పెన్నా నదికి సులువుగా అనుసంధానం చేయవచ్చని సూచించింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో కొన్ని కొత్త చిక్కులున్నాయి. ఇందులో కీలకమైనది అసలు గోదావరి నదిలో వెయ్యి టీఎంసీల అదనపు జలాలున్నాయని ఎలా, ఎక్కడ, ఎప్పుడు నిర్ధారిస్తారు? గోదావరి నది మీద చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం. అక్కడ తేల్చాలి అదనపు జలాలు ఉన్నాయో లేవో! సాధారణంగా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు ఆగస్టు నెలలో వస్తాయి. ఆగస్టు నెలలో పోలవరం నుండి కావేరి ప్రాజెక్టుకు వెయ్యి టీఎంసీల నీళ్లు విడుదల చేసేస్తే, ఆ తరువాతి నెలల్లో నదిలోనికి అనుకున్నంత నీరు రాకపోతే ఏమిటీ పరిస్థితీ? గోదావరి డెల్టా ఆయకట్టుకు 175 సంవత్సరాలుగా ఉన్న లోయర్ రైపేరియన్ హక్కులు ఏం కావాలి? అంతేకాదు; ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది. గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్‌కు వెయ్యి టీఎంసీల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కోరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలోకి నెట్టే పథకం ఇది.డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌ను ఎన్‌డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్‌డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్‌కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
తమిళనాడుకు కావేరి నీటి విడుదల.. నేడు కర్ణాటక బంద్
శివాజీనగర: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కన్నడ ఒక్కూట అఖండ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారమే బెంగళూరు బంద్ దాదాపు జయప్రదమైంది. రాష్ట్ర బంద్ సందర్భంగా వాహన సంచారం, అంగళ్లు, హోటల్, సినిమా థియేటర్లు, మాల్స్, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నీ బంద్ అయ్యే అవకాశముంది. ఒక్కూట వాటాళ్ నాగరాజ్ మాట్లాడుతూ శాంతియుతంగా బంద్ జరుగుతుందన్నారు. బెంగళూరుతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నా, ర్యాలీలు జరుపుతామని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ శెట్టి తెలిపారు. హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల సంఘాలు సంఘీభావం తెలిపాయి. వాహనాలు ఉండకపోవడం వల్ల స్కూళ్లు కూడా మూతపడవచ్చు. ఆర్టీసీ రవాణా బస్సుల సంచారం కూడా తక్కువగా ఉండవచ్చు. రాష్ట్రమంతటా అన్ని సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అనేకమంది నటీనటులు మద్దతు తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు చేయాలని సంఘాలు నిర్ణయించాయి. బంద్ చట్టవిరుద్ధం: నగర సీపీ కర్ణాటక బంద్ నేపథ్యంలో బెంగళూరులో గట్టి పోలీస్ బందోబస్తు కల్పించినట్లు పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఎక్కడా ధర్నా, ర్యాలీ, ఊరేగింపులకు అవకాశం లేదు. గురువారం రాత్రి నుండే 144 సెక్షన్ జారీలోకి వచ్చింది. బంద్ అనేవారికి నోటీసులు ఇస్తాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం బంద్‌కు పిలుపునివ్వడం చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. బంద్ సమయంలో ప్రభుత్వ ఆస్తిపాస్తులకు నష్టం కలిగిస్తే పిలుపునిచ్చినవారే బాధ్యులవుతారన్నారు. నగరవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు. యథావిధిగా ఆర్టీసీ, సిటీ బస్సులు క్రవారం కర్ణాటక బంద్ అయినప్పటికీ కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను యథావిధిగా నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉద్యోగులు మామూలుగానే డ్యూటీలకు రావాలని ప్రకటించారు. ఎవరూ కూడా బంద్‌లో పాల్గొనరాదని, విధులకు రాకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాపులు, బీఎంటీసీ డిపోలకు పోలీస్ భద్రత కల్పిస్తారు. -
ఏకాభిప్రాయం లేకున్నా ముందుకే!
సాక్షి, అమరావతి: గోదావరి – కావేరి నదుల అను సంధానంపై వాటి పరివాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. అనుసంధానం ప్రతిపాదనపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వచ్చే నెల 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశం అజెండాలో గోదావరి – కావేరి అనుసంధానం ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ చేర్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంద్రావతి సబ్ బేసిన్లో బచావత్ ట్రిబ్యునల్ తమకు చేసిన కేటాయింపుల్లో వాడుకోని నీటిలో 141.3 టీఎంసీలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే నిలదీసింది. తమను సంప్రదించకుండా తమ కోటా నీటిపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకుంటే న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా నీటి లభ్యతను తేల్చాకే అనుసంధానాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశం అజెండాలో చేర్చడంపై నీటి పారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత తేల్చకుండానే గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది. అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2019 ఫిబ్రవరిలో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు 80 టీఎంసీల చొప్పున కేటాయించి ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను మిగిలిన నీటిని కర్ణాటకకు ఇవ్వాలని ప్రతిపాదించింది. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సూచించడంతో ఎన్‌డబ్ల్యూడీఏ 2021లో మరో ప్రతిపాదన చేసింది. కావేరికి గోదావరి జలాలను తరలించే ప్రాంతాన్ని అకినేపల్లి (వరంగల్ జిల్లా) నుంచి ఇచ్చంపల్లి (జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)కి మార్చింది. ఇచ్చంపల్లి వద్ద ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు అదనంగా 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. నాగార్జున సాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా ప్రతిపాదించింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. నికర జలాలు, వరద జలాలను ఎలా వర్గీకరిస్తారని ప్రశి్నంచాయి. తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం చెప్పడంతో ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కనీసం ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకుండానే ఛత్తీస్‌గఢ్‌కు ఇంద్రావతి బేసిన్లో కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా సోమశిల, కండలేరుకు తరలించి అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లేలా తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. ఈ క్రమంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్‌్కఫోర్స్ కమిటీ ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను సంప్రదించకుండానే బేసిన్‌లోని మిగతా రాష్ట్రాలతో మార్చి 6న హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదించకపోవడంపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఛత్తీస్‌గఢ్ సర్కారుతో ఈ అంశంపై చర్చిస్తారని టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం ఆ సమావేశంలో పేర్కొన్నారు. కానీ.. ఇప్పటివరకూ ఛత్తీస్‌గఢ్‌ను కేంద్రం సంప్రదించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా అనుసంధానంపై ఒప్పందాన్ని అజెండాగా చేర్చుతూ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం ఏర్పాటు చేసింది. -
విషాదం: నదిలో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల మృతి.. సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, చైన్నె: సేలం సమీపంలోని కావేరి నదిలోకి గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని సంగ గిరిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 10 మంది మధ్యాహ్నం కళాశాలకు డుమ్మా కొట్టి బయటకు వచ్చేశారు. వీరంతా ఎడపాడి సమీపంలోని కల్ వడంగం వద్ద కావేరి నదిలో స్నానానికి వెళ్లారు. మిత్రులందరూ ఆడుకుంటూ ఆనందంతో స్నానం చేస్తుండగా మణి కంఠన్ అనే విద్యార్థి బురద ప్రాంతంలో కూరుకు పోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించి మరో ముగ్గురు మిత్రులు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఆందోళనతో ఒడ్డుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు , గజ ఈతగాళ్లు ఆ పరిసరాలలో గాలించారు. అయితే, నలుగురు విద్యార్థులను మృతదేహాలుగా బయటకు తీశారు. మరణించిన వారిలో పిమణి కుమారుడు మణి కంఠన్(20), సెల్వం కుమారుడు ముత్తుస్వామి(20), మరో మణికంఠన్(20), పాండియరాజన్(20)గా గుర్తించారు. విద్యార్థుల మరణ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్‌కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్‌బేసిన్‌లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
గోదావరి–కావేరి అనుసంధానం డౌటే
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల దశలోనే ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో కనీసం సంప్రదింపులు జరగకుండా ఆ రాష్ట్ర కోటా 141 టీఎంసీలకు.. బచావత్ ట్రిబ్యునల్ పరిధిలోని దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా కల్పించిన మిగులు జలాల్లో 106 టీఎంసీలను జతచేసి 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి అనుసంధానంలో తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదనలు రూపొందించింది. చదవండి: రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం దీనిపై పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. ఛత్తీస్‌గఢ్ కోటాలోని 141 టీఎంసీలను అనుసంధానంలో తరలించేలా ప్రతిపాదనను మార్చింది. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన నీటిని ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గోదావరి–కావేరి అనుసంధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంప్రదింపులకు అర్థమేదీ? ♦ఇచ్చంపల్లి లేదా అకినేపల్లి (గోదావరి) నుంచి జూన్–అక్టోబర్ మధ్య 143 రోజుల్లో 247 టీఎంసీలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్టకు తరలించడం ద్వారా గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేయాలని 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమళనాడులకు 80 టీఎంసీల చొప్పున అందిస్తామని పేర్కొంది. ఇచ్చంపల్లి నుంచి తరలించే నీటిలో 141 టీంఎసీలు ఛత్తీస్‌గఢ్ కోటాలోనివి కాగా.. మిగతా 106 టీఎంసీలు మిగులు జలాలు. ♦దీనిపై 2020 జూలై 28న ఒకసారి.. డిసెంబర్ 10న మరోసారి పరీవాహక ప్రాంతాల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరిపింది. తమ కోటాలో నీటిని తరలించడానికి తాము అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్‌గఢ్ తెగేసి చెప్పగా.. తమకు హక్కుగా కల్పించిన నీటిని ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ♦సంప్రదింపుల్లో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసంధానం ప్రతిపాదనలో ఎన్‌డబ్ల్యూడీఏ అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలి. కానీ.. అందుకు విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్ కోటాలో 141 టీఎంసీలను మాత్రమే.. అదీ ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా మళ్లీ ప్రతిపాదన రూపొందించింది. దీనిపై ఈ నెల 18న రాష్ట్రాలతో మళ్లీ సంప్రదింపులు జరిపింది. తమ కోటా నీటిని వాడుకోవడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని.. మళ్లీ తమ నీటిని వాడుకునేలా ప్రతిపాదన రూపొందించడాన్ని బట్టి చూస్తే సంప్రదింపులకు అర్థమేముందని ఛత్తీస్‌గఢ్ అసహనం వ్యక్తం చేసింది. నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే.. గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించాలంటే.. తొలుత గోదావరిలో నీటి లభ్యతను తేల్చడానికి శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలుపోగా నికర జలాల్లో మిగులు ఉంటే.. వాటిని అనుసంధానంలో భాగంగా తరలించడానికి రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరపాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. అనుసంధానం ప్రతిపాదన రూపొందిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానంపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతున్నారు. అలాకాకుండా ఏకపక్షంగా ప్రతిపాదనలు రూపొందించి.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం వృథా ప్రయాసేనని స్పష్టం చేస్తున్నారు. -
మహానది టు కావేరి వయా గోదావరి!
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ద్వారా 477 టీఎంసీలను వినియోగించుకోవచ్చని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ కేంద్రానికి ప్రతిపాదించింది. మహానది నుంచి 230, గోదావరి నుంచి 247 టీఎంసీలను తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేయొచ్చంది. అనుసంధానంపై ఏకాభిప్రాయానికి ఆ నదుల పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర జల్ శక్తి శాఖ నిర్ణయించింది. మహానది – గోదావరి అనుసంధానం ఇలా.. ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలిస్తారు. గోదావరి–కావేరి అనుసంధానం ఇలా.. జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఈ 247 టీఎంసీల గోదావరి జలాలకు మహానది నుంచి గోదావరిలోకి వచ్చిన 230 టీఎంసీలను జతచేసి.. మొత్తం 477 టీఎంసీలను మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానం ద్వారా తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. -
లెక్క తేలాకే కావేరికి గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చకుండా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టడంలో అర్థం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. మొదట నీటి లభ్యతను తేల్చాలని, ఆ తర్వాతే కావేరికి గోదావరి జలాలను ఎలా తరలించాలో చర్చించాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 69వ సమావేశం బుధవారం వర్చువల్‌గా జరిగింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా కావేరికి తరలించడం ద్వారా నదులను అనుసంధానం చేయడానికి సంబంధించిన డీపీఆర్‌ను నదీ పరివాహక ప్రాంతాల్లోని 4 రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. ఆ డీపీఆర్‌లో హైడ్రాలజీ అంశంపై తమకు అభ్యంతరాలున్నాయని మురళీధర్ తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో భాగంగా వినియోగించాలని ప్రతిపాదించారని, ఇక్కడ నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు పేర్కొన్నారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్ వాటా ఉందని గుర్తు చేశారు. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని గత సమావేశంలో ఆ రాష్ట్రం తేల్చిచెప్పిందన్నారు. కాబట్టి ముందు గోదావరిలో నీటి లభ్యత తేల్చాలని కోరారు. ఏపీ అవసరాలు తీరాకే తరలింపు: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా ముందు గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని కోరింది. రాష్ట్రంలో కడుతున్న, భవిష్యత్‌లో నిర్మించనున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోకుండాడీపీఆర్ రూపొందించారని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆక్షేపించారు. గోదావరి జలాలు ఆ ప్రాజెక్టులకే సరిపోతాయని.. నీటి లభ్యత ఎక్కడుందని ప్రశ్నించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఏపీకే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే వరద జలాల్లో మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. దీనిపై సానుకూలం గా స్పందించిన పంకజ్‌కుమార్.. గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. మా రాష్ట్రంలో కరువు ప్రాంతాలెక్కువ: కర్ణాటక తమిళనాడుతో పోల్చితే కావేరి బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువని కర్ణాటక చెప్పింది. దుర్భిక్షాన్ని నివారించడానికి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీతో పోల్చితే తమ రాష్ట్రంలోనే కృష్ణా బేసిన్లో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువంది. ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు గానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కోరింది. మిగతా రాష్ట్రాలేమన్నాయంటే..? కావేరి–గోదావరి అనుసంధానంలో కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర కోరింది. గోదావరి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని, తమ నీళ్లు తామే వాడుకుంటామని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది. ఒడిశా మాత్రం అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదంది. కావేరి జలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని, తాజా అనుసంధానం నేపథ్యంలోనైనా కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. వర్చువల్‌గా కాకుండా భౌతికంగా సమావేశాలు నిర్వహిస్తేనే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి అవకాశం ఉంటుందని తమిళనాడు చెప్పింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని కోరింది. -
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్‌శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్‌కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్‌లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
సముద్ర సదస్సుకు నైన్త్ క్లాస్ యష్మి..
యష్మి తొమ్మిదో తరగతి విద్యార్థిని. ఐక్యరాజ్యసమితి ‘సముద్ర సదస్సు’ కు ఎంపికైంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే అంశంపై కావేరీ నది మీద యష్మి తీసిన చిన్న డాక్యుమెంటరీ ఆమెకు ఈ అర్హతను కల్పించింది. త్వరలోనే హవాయిలో జరిగే సముద్ర సదస్సులో ప్రపంచంలోని ఆలోచనాపరులతో కలిసి యష్మి కూర్చోబోతోంది! కరోనా కారణంగా ఒకవేళ ఆ సదస్సు ఆన్లైన్లో జరిగినా తనేమీ నిరుత్సాహపడబోనని, యువతకు తన సందేశం వెళ్లింది అంతే చాలునని యష్మి సంతోషంగా చెబుతోంది. సముద్ర సదస్సుకు కావేరీ నదిని తీసుకెళుతున్న నావిక.. యష్మి. లాక్డౌన్లో తాగడానికి నీళ్లు లేక, ఊరికి బారెడు దూరంలో ఎక్కడో కొన్ని స్వచ్ఛమైన నీటి చుక్కలున్నా బయటికి వెళ్లే దారి లేక ఇంట్లోనే బావులు తవ్వుకున్నవాళ్లున్నారు! లాక్డౌన్ పర్యవసానాల విశ్వరూపానికి ఇదొక్క ఉదాహరణ చాలు. జీవికి గొంతు తడుపుకోడానికి నీళ్లు లేకపోవడం ఏమిటి! భూగోళమేమీ ఒట్టిపోలేదే?! నదులున్నాయి, చెరువులున్నాయి, ఊటలు, నీటి కుంటలూ ఉన్నాయి. ఉన్నాయి కానీ తాగేందుకు వీల్లేనంతగా కలుషితం అవుతున్నాయి! జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో? ‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి’ అని ఐక్యరాజ్య సమితి స్కూల్ పిల్లలకు పోటీ పెట్టింది. ఆ ఊహ.. కథ చెప్పినట్లుగా ఉండాలి. ఊహ ‘వీడియో’ రూపంలో ఉండాలి. అదీ నిబంధన. 13–17 మధ్య వయసు గల పిల్లల కోసం జరిగిన ఈ పోటీలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనేది వాటిల్లో ఒకటి. నీరు పవిత్రమైనదని అర్థం. ఆ కేటగిరీలో కొడగు విద్యార్థిని యష్మి విజేతగా నిలిచింది. యష్మి మైసూరులోని ఆచార్య విద్యాకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడగులోని నెలజి ఆమె స్వగ్రామం. లాక్డౌన్లో తన ఊరు ఎలా ఉందో కళ్లారా చూసింది యష్మి. నీరు ఎంత విలువైందో కూడా అప్పుడే ఆమెకు తెలిసింది. తమ ఊరొక్కటే కాదు, రాష్ట్రంలోని అన్ని ఊళ్లూ అలానే ఉన్నాయని పత్రికల్లో చూసింది. నీటి చుక్కకు కరువేమీ లేదు. కలుషితం కాని నీరే.. ఎక్కడా లేదు! అసలే కరోనా. కలుషితమైన నీరు తాగడం వల్ల, గాలిలోని కాలుష్యాలను పీల్చడం వల్ల జబ్బున పడితే, అది కరోనా ఏమోనన్న భయం. ఈ పరిస్థితిని మార్చేందుకు తనేమీ చేయలేదు. ఏం చేయాలో కొంత చెప్పగలదు. కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. రోజులు గడిచాయి. లాక్డౌన్ ముగిసింది. యష్మి ఎనిమిది నుంచి తొమ్మిదికి వచ్చింది. ఈ సమయంలో క్లాస్ టీచర్ ఓరోజు యు.ఎన్. హెచ్2ఒ 21 వాటర్ సమ్మిట్ గురించి చెప్పారు. హెచ్2ఒ 21 సమ్మిట్ పేరుతో ఐక్యరాజ్య సమితి టీనేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో నీరు అనే టాపిక్ మీద ‘స్టోరీ టెల్లింగ్’ పోటీ పెడుతోంది. అందులో విజేతగా నిలిస్తే, ఆ తర్వాత యూఎస్‌లోని హవాయి రాష్ట్రంలో జరిగే ‘యు.ఎస్. ఓషన్ డికేడ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆహ్వానం లభిస్తుంది. అదేమీ మామూలు సంగతి కాదు. స్టోరీ టెల్లింగ్‌లో జల సంరక్షణ కోసం విజేతలు ఇచ్చిన సూచనలపై మేధావులు, ఆలోచన పరులు ఓషన్ సమ్మిట్ (సముద్ర సదస్సు)లో చర్చలు జరుపుతారు. అది చాలదా! ‘‘ఇదిగో ఈ అద్భుతమైన ఆలోచనను ఇచ్చింది ఈ అమ్మాయే’’ అని అంతా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ ఉంటే!! క్యాష్ ప్రైజ్, ప్రశంసాపత్రం ఎలాగూ ఉంటాయి. యష్మి వెంటనే ఆ పోటీలో పాల్గొంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే కేటగిరీని ఎంపిక చేసుకుంది. లాక్డౌన్లో తన అనుభవాలను పాయింట్లుగా రాసుకుంది. వాతావరణ మార్పులపై ప్రసిద్ధుల ప్రసంగాల నుంచి కొంత నోట్స్ సిద్ధం చేసుకుంది. పోటీలో పాల్గొనడానికి ముందు హెచ్2ఓ 21 నియమ నిబంధనల కోసం ఐక్యరాజ్య సమితి వరుసగా నాలుగు శని, ఆదివారాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులకు హాజరు అయింది. అక్కడే కేటగిరీల కేటాయింపు జరుగుతుంది. యష్మి ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ కేటగిరీని ఎంపిక చేసుకోడానికి తగిన కారణమే ఉంది. కొడగులోని వాళ్లంతా కావేరీ నదిని దైవంలా పూజిస్తారు. అన్లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడే వాళ్లు చెబుతున్న విషయాలను బట్టి.. తల్లి కావేరి తమను కాపాడుతున్నంతగా, కావేరిని తాము కాపాడుకోవడం లేదని ఆమె గ్రహించింది. పైగా యష్మి కావేరి నదిని పూజించే కొడవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలోని అమ్మాయి. వెంటనే ఆమె కొడగు వెళ్లిపోయి, కావేరీ నది అందాలను అనేక కోణాలలో షూట్ చేసింది. వాటిని కథానుగుణంగా ఎడిట్ చేసింది. నేపథ్య గీతంగా కొడవలకు ప్రత్యేకమైన భక్తి పాటను ఉంచింది. అంత అందమైన కావేరి నది.. కాలుష్యం కారణంగా ఎలా అంద విహీనం అయిపోతున్నదో చూపించింది. వీడియో చివర్లో ‘లెటజ్ హీల్ హర్. నాట్ ఫిక్స్ హర్’ అనే సందేశంతో.. యువతీ యువకులు కావేరి నది స్వచ్ఛత ను పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృశ్యరూపకంగా జత చేసింది. ఇంత అద్భుతం గా చేశాక యష్మి విజేత కాకుండా ఉంటుందా! అయింది. త్వరలో హవాయి వెళ్లబోతోంది. ‘‘నా చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. అమ్మ చిన్నప్పుడు కొడగు ప్రాంతం ఎంతో అందంగా ఉండేదట. ‘భారీగా వర్షాలు పడేవి. చెరువులు స్వచ్ఛంగా ఉండేవి. నేను పెరిగి పెద్దయ్యేనాటికి వాతావరణంలో కాలుష్యాలు పెరిగినా వర్షాలేమీ తగ్గలేదు కానీ, నీటి స్వచ్ఛత తగ్గింది. నువ్వు పెద్దయి, నీ తర్వాతి తరం వచ్చాక నువ్వూ.. మా చిన్నప్పుడు ఇలా ఉండేది.. అని చెప్పకూడదని నా ఆశ. అందుకు మీ తరం వారే ఏదైనా చేయాలి. ఏదైనా కాదు. రెండు చేయాలి. కాలుష్యం తగ్గించాలి. పచ్చదనం పెంచాలి’’ అని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పిన మాటలనే నేను హవాయిలో నా వీడియో ప్రెజెంటేషన్‌లో చెబుతాను’’ అంటోంది యష్మి. వీడియో తయారు చేయడానికి తన కజిన్ భువన, ఆమె తండ్రి తనకు సహాయపడ్డారట. యష్మి తల్లి నళిని, తండ్రి కుశలప్ప తమ కూతురి కి యూఎస్ వెళ్లే అవకాశం రావడంతో సంతోషం గా ఉన్నారు. కరోనా కారణంగా ఆమె వెళ్లబోయే ‘ఓషన్ డికేడ్ సమ్మిట్’ అన్లైన్లో జరిగే అవకాశాలున్నా.. ‘నా సందేశం వెళ్లింది. అంతే చాలు’ అని అంటోంది యష్మి. -
ఇచ్చంపల్లి నుంచే 'అనుసంధానం'!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఆదేశించింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేందుకు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నీటి పారుదల, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) పరిధిలోని, అనుసంధానం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా టాస్క్ ఫోర్స్ కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ 2 ప్రతిపాదనలు ఇవీ.. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట)కు మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించే 247 టీఎంసీల్లో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్ ఫోర్స్ కమిటీకి పంపింది. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం.. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తే టాస్‌్కఫోర్స్ కమిటీ పేర్కొన్న మేరకు ప్రయోజనం ఉండదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమై పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లోయర్ గోదావరి సబ్ బేసిన్(జీ–10)లో ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిరి్మంచడానికి 1975 డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 85 టీఎంసీలను మాత్రమే ఇచ్చంపల్లి నుంచి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వినియోగించుకోవాలి. ఇచ్చంపల్లిలో అంతర్భాగమైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఉమ్మడి ఏపీ 27 శాతం, మహారాష్ట్ర 35 శాతం, మధ్యప్రదేశ్ 38 శాతం చొప్పున భరించాలి. విద్యుత్‌ను ఇదే దామాషాలో పంచుకోవాలి. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసిన జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉంటుంది. అభిప్రాయాలను తీసుకోకుండానే.. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ జానంపేట నుంచి గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జానంపేట పరిసర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తరలించడానికి ప్రాజెక్టులు చేపట్టిందని, వాటి ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని జానంపేట నుంచి చేపడితే తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు ఈ అనుసంధానం పరిధిలోకి వస్తుందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచే కావేరికి గోదావరి జలాలను తరలించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ ప్రతులను ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు పంపిన టాస్‌్కఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం పనులు చేపట్టేలా డీపీఆర్ రూపొందించాలని ఆదేశించింది. బేసిన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకల అభిప్రాయాలను తీసుకోకుండానే కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నీటిపారుదలరంగ, న్యాయ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
18న గోదావరి–కావేరి అనుసంధానంపై భేటీ
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై వాటి పరీవాహక ప్రాంతాల (బేసిన్) పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్య్లూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ అధ్యక్షతన ఈనెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో మరోసారి సమావేశమై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గత నెల 24న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పింది. రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలని స్పష్టం చేసింది. 18న నిర్వహించే భేటీలోనూ అదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించాలని నిర్ణయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు ఇవీ.. ► కర్ణాటక–తమిళనాడుల మధ్య తరచుగా కావేరీ జలాల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ► గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకు గోదావరి జలాలను తరలించి వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ► గోదావరి–కావేరీ అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట) అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి (గ్రాండ్ ఆనకట్ట) జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట). ► గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ► గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,486.155 టీఎంసీలను కేటాయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మూడు ప్రత్యామ్నాయాల్లోనూ గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే తీసుకుంది. కానీ.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేవనీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. -
మా అవసరాలు తీర్చాకే మళ్లింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చిన తరువాతే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్ ఆనకట్ట) నదికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. తాము ప్రస్తావించిన అంశాలకు వివరణ ఇస్తే అధ్యయనం చేసి గోదావరి – కావేరి అనుసంధానంపై అభిప్రాయం చెబుతామని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు(అంతరాష్ట్ర నదీ జలాలు) ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 247 టీఎంసీలను మళ్లించేలా.... ► గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ఎన్‌డబ్ల్యూడీఏ మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ► నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఏపీ అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించాలని కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తాజా సమావేశంలో సలహాదారు ఎం.వెంకటేశ్వరావుప్రస్తావించారు. తెలంగాణ వాదనపై అభ్యంతరం... ► గోదావరి జిలాల్లో తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా ఉందని.. వాటిని మినహాయించుకుని మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ పేర్కొనడంపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులపై తనకు సమగ్ర అవగాహన ఉందని.. ఆ స్థాయిలో తెలంగాణకు కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు వినియోగించుకోని జలాలే గోదావరిలో మిగులు జలాలుగా ఉన్నాయని గుర్తు చేశారు. ► గోదావరికావేరీ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం కోరిన వివరణలను పంపుతామని.. ఇతర రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలను కూడా పంపుతామని.. వీటిపై అభిప్రాయం చెప్పాలని ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్ భూపాల్ సింగ్ చేసిన సూచనకు ఏపీ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు అంగీకరించారు. -
కావేరిలో మునిగి నలుగురు మృతి
సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్నాయకన్ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
కావేరీ యాజమాన్య సంస్థ ఏర్పాటు
న్యూఢిల్లీ: కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన కావేరీ నదీ జలాల విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కావేరీ నదీజలాల యాజమాన్య సంస్థ (సీఎంఏ)ను శుక్రవారం ఏర్పాటుచేసింది. ఈ సంస్థ చైర్మన్, సభ్యులను నియమించనప్పటికీ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర జలవనరుల శాఖ వెలువరించింది. సీఎంఏలో చైర్మన్, సెక్రటరీతో పాటుగా ఎనిమిది మంది సభ్యులుంటారు. ఇందులో కేంద్రం తరపున ఇద్దరు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు, భాగస్వామ్య రాష్ట్రాల నుంచి నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు. చైర్మన్‌గా జలవనరుల నిర్వహణలో అనుభవమున్న సీనియర్ ఇంజనీర్ లేదా ఈ రంగంలో అనుభవమున్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. కమిటీ కావేరీ నదీ జలాల నిల్వ, పంపకం, వివాదాల పరిష్కారం తదితర వివాదాలను సమీక్షించి ఆదేశాలిస్తుంది. కావేరీ జలాల్లో కర్ణాటక వాటాను పెంచి.. తమిళనాడు వాటాను సుప్రీంకోర్టు స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై తమిళనాడు సీఎం పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు. -
దక్షిణాది ఇరిగేషన్ మంత్రుల భేటీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల మంత్రుల సమావేశం ఈనెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘవాల్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా, నీటి లభ్యత, ముంపు తదితర అంశాలపై అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్న కేంద్రం 20న దక్షిణాది రాష్ట్రాలతో భేటీ ఏర్పాటు చేసింది. -
కావేరీ పుష్కరాలు
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి. ఎక్కడ పుట్టింది? పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని. అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు. వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది. దాంతో ఆయా ప్రదేశాలన్నీ ససస్యశ్యామలమయ్యాయి.కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు. తలకావేరి, కుషల్ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్ కావేరీనది వరప్రసాదమే. బెంగళూరు పులి టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్ గార్డెన్స్... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి. పుణ్యతీర్థాలు చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి. పుష్కర స్నాన విధి ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి. ఏమిటీ పుష్కరం? పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. పుష్కరాలలో ఆర్.వి.ట్రావెల్స్ ప్రస్థానం ముఖ్యమైన నదులు పన్నెండు. పన్నెండేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఒక్కో పుణ్యనదికి పుష్కరం రావడం, ఆ పుష్కరస్నానం ఆచరించి పునీతులవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు పుష్కరస్నానం కోసం రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి పుష్కరాలలో భక్తులు వసతి, రవాణా, భోజన సంబంధిత విషయాలలో అసౌకర్యానికి గురికావడం, ఎక్కువ మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి రావడమూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఏ విధమైన సమస్యలు లేకుండా దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా మేమున్నాం అని ముందుకొస్తూ యాత్రికులకు కావలసిన రవాణా, వసతి, భోజనం, సరైన గైడింగ్ సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఏటా వేలాదిమంది యాత్రికులను పుష్కరాలకు పంపడంలో ముందుండేది... తెలుగువారి ఆత్మీయ యాత్రా సంస్థ ‘ఆర్.వి.టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థ. ఆర్.వి. ట్రావెల్స్ కావేరి పుష్కర యాత్రలు ఈ సంవత్సరం ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ భక్తునికి ఎటువంటి అసౌకర్యం కనపడకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో సేవలందిస్తోంది. ప్రతి ఒక్కరూ వెళ్లి పుష్కరస్నానం ఆచరించే విధంగా ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కేవలం హైదరాబాద్ నుండి మైసూర్–హైదరాబాద్ వరకు రవాణా, లగ్జరీ వసతి, మూడు పూటలా భోజన సదుపాయాలతో కేవలం రూ. 4699కే అద్భుత ప్యాకేజీని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని మనవి. అంతేకాకుండా కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాలైన అటు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలకు, ఇటు కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు అన్ని కలిపి ప్రత్యేక తమిళనాడు యాత్రా ప్యాకేజీ... అలాగే ప్రత్యేక కర్ణాటక యాత్రా ప్యాకేజీని ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందుబాటులోకి తెస్తున్నారు. మహాపవిత్రమైన కావేరి పుష్కరాలకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్ ్స వారు దిగువ ఇచ్చిన ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. -
ఎవరి పాపమిది?
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరానికి దాదాపు తెలియకుండాపోయిన జల యుద్ధం సోమవారం బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిరోడ్లపై వీరంగం వేసింది. అసలు సమస్య కావేరీ నదీ జలాల వివాదంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్యులపైనా, వ్యాపార సంస్థలపైనా విచ్చలవిడిగా దాడులు జరిగాయి. హింసా కాండలో ఇద్దరు మరణించగా... తమిళ పౌరుల వాహనాలు, ఆస్తులు ధ్వంసమ య్యాయి. 100 వాహనాలు కాలి బూడిదైతే అందులోఒక ప్రైవేటు సంస్థ బస్సులే 44 ఉన్నాయి. తమిళ పౌరులని అనుమానం వస్తే చాలు... చితకబాదారు. మేమేం తక్కువ తిన్నామా అని తమిళనాట కూడా అసాంఘిక శక్తులు రెచ్చిపోయాయి. చెన్నైలో కన్నడిగుల హోటల్‌పై బాంబు దాడి, వాహనాల ధ్వంసం వంటివి చోటు చేసుకున్నాయి. పక్షం రోజులుగా ఉద్రిక్తతలు అలుముకుంటున్నా పట్టనట్టు వ్యవహ రించిన ప్రభుత్వాలు తీరిగ్గా మేల్కొని పోలీసు బలగాల్ని దించి అంతా సర్దుకుం టుందని జనానికి భరోసా ఇస్తున్నాయి. ‘మా రాష్ట్రంవారి ప్రాణాలు, ఆస్తులు కాపా డండ’ని పరస్పరం ఉత్తరాలు రాసుకుంటున్నాయి. ఐటీ దిగ్గజ నగరంగా, అందువల్ల ప్రపంచ ప్రాముఖ్య నగరంగా పేరొందిన బెంగళూరుకు ఈ గతి పట్టిస్తారని ఎవరూ అనుకుని ఉండరు. సరిగ్గా పాతికేళ్లకిందట 1991లో ఈ మాదిరే బెంగళూరులోని తమిళ నివాస ప్రాంతాల్లో దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. నగరం నెల రోజులు అట్టుడికిపోయింది. సాధారణ పౌరులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు. హింసాకాండలో 28మంది మరణించగా, వేలాదిమంది నగరం వదిలి వెళ్లిపోయారు. ఇన్నేళ్లు గడిచినా మారిందేమీ లేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తు న్నాయి. రాజధాని నగరాలైన బెంగళూరు, చెన్నైలలో అరాచక శక్తులు గుంపులుగా రోడ్ల మీదికొస్తే ప్రభుత్వాలు గుడ్లప్పగించి చూశాయి. సాధారణ సమయాల్లో ఇంటెలిజెన్స్ ఉన్నదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని డంబాలు పలికే ప్రభుత్వాలు దాదాపు తొమ్మిది గంటలపాటు ఇంత బలహీనంగా మిగిలిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో పాలకులు ఏమైనా చెప్పుకుని ఉండొచ్చుగానీ... తరచుగా తీవ్ర ఘర్షణలకు దారితీయగల వివా దాన్ని అపరిష్కృ తంగా వదిలేశారు. రెండు రాష్ట్రాల్లోనూ దాడులకు దిగినవారు రైతులు కాదు. వారి పేరు చెప్పుకుని స్వప్రయోజనాలు సాధించుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయని స్థానికులు చెబుతున్నారు. 1956నాటి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం చాలా శక్తివంతమైనది. ఆ చట్టంకింద వెలువడిన నిర్ణయాన్ని మార్చడం లేదా అమలుకు నిరాకరించడం ఎవరివల్లా కాదు. తాము అమలు చేయబోమని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మొండికేస్తే దాన్ని బర్తరఫ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుం టుంది. నదీ జలాల విడుదలను అడ్డుకుంటే అవసరమైతే సైనిక బలగాల్ని దించడా నికి కేంద్రానికి అధికారం ఉంది. అయినా అధికారంలో ఉండేవారు రాజకీయ ప్రయో జనాలను ఆశించి ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. నిర్ణయాల అమలును వాయిదావేస్తూ పోతున్నారు. తమిళనాడుకు 192 టీఎంసీ (శతకోటి ఘనపుటడుగుల) నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ 2007లో కావేరీ ట్రిబ్యునల్ తుది అవార్డు ప్రకటించినా దాని అమలుపై ఆ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఆ వివాదంలోనే సుప్రీంకోర్టు రోజుకు 15,000 క్యూసెక్కుల (1.3టీఎంసీలు) నీరు ఈనెల 15 వరకూ విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దాని అమలును ప్రారంభించాక ఉద్రిక్తతలు పెరగడాన్ని గమనించి ఆదేశాలను సవరించాల్సిందిగా కర్ణాటక అభ్యర్ధించింది. పర్యవసానంగా రోజుకు 12,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. శాంతిభద్రతల సమస్య తలెత్తినందున తీర్పు అమలును ఆపాలన్న వినతిని తోసి పుచ్చి చీవాట్లు పెట్టింది. నిజానికి పరిస్థితి ఇంత విషమించడానికి తమిళనాడు బాధ్యత కూడా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమ విజయమంటూ అధికార అన్నాడీఎంకే గొప్పలకు పోవడం కర్ణాటకలో ఉద్వేగాలను రెచ్చగొట్టింది. ఇది అసాంఘిక శక్తులకు ఊతమిచ్చింది. న్యాయవ్యవస్థ తమ అధికారాలను కబ్జా చేస్తున్నదని వాపోయే ప్రభుత్వాలు కీలకమైన సమస్యలను మాత్రం న్యాయస్థానాల నెత్తిపై వేసి తప్పుకుంటున్నాయి. బాబ్రీ వివాదంతోసహా ఎన్నో చిక్కుముళ్లు దీనికి రుజువు. అన్నిటికన్నా ముఖ్యమైన నదీ జలాల వివాదాలను న్యాయస్థానాలకు వదలడం పాలకుల లౌక్యానికి నిద ర్శనం. అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు అన్ని పార్టీలనూ, ప్రజా సంఘాలనూ విశ్వా సంలోకి తీసుకుని చర్చించడం, పొరుగు రాష్ట్రాలతో మాట్లాడటం వంటివి చేస్తే వేరుగా ఉంటుంది. ప్రజలను ఒప్పించడం సులభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవ చూపించనప్పుడు కేంద్రమైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇదంతా ఎంతో ప్రయాసతో, సమస్యలతో కూడుకున్నది గనుక ఎవరికి వారు తప్పిం చుకుంటున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించడం, వీలైనంతకాలం సమస్యను సాగ దీయడమే పరిష్కారమని భావిస్తున్నారు. అందువల్లే బెంగళూరు, చెన్నై నగరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకపక్క పర్యావరణ మార్పుల పర్య వసానంగా వర్షపాతం తగ్గుతోంది. దీనికి మానవ తప్పిదాలు తోడవుతున్నాయి. పట్టణీకరణతో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. మాఫియాలు ఇసుకను విచ్చలవిడిగా తోడేస్తున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్టు ఉంటున్నాయి. ఫలితంగా గోతులు ఏర్పడి నీటి ప్రవాహం సక్రమంగా ఉండటం లేదు. జనాభా పెరిగి, అవసరాలు విస్తరించి, అధిక ఆహారోత్పత్తి తప్పకపోవడంవల్ల ప్రతిచోటా ఆయకట్టు పెంచుకోవలసి వస్తున్నది. దాంతో పాటే సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంపొందించే విధానాలను ప్రోత్సహించే దిశగా తగినంత దృష్టి పెట్టడంలేదు. వీటన్నిటి ఫలితమే జలవివాదాలు. నీరు నిప్పుగా మారడం, క్యూసెక్కులు కాటే యడం ఒక్క కావేరీ ప్రాంతానికే పరిమితం కాదు. దేశంలో ఇలాంటి జల వివాదాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు సమస్య నుంచి పరారవడంకాక, దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం అవసరం. -
కావేరీ నది నుంచి నీళ్లు ఇవ్వలేం..
న్యూఢిల్లీ: కావేరి నది నుంచి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టుకు కర్ణాటక సర్కారు సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కావేరిలో 8 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయని, తమిళనాడుకు 50 టీఎంసీల నీళ్లు ఇవ్వలేమని చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బతుకు, బతికించు’ నియమాన్ని రెండు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సహృద్భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డు నిర్ణయం ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కావేరి పరవళ్లు..
సాక్షి, చెన్నై : నైరుతి రుతు పవనాల ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడం రాష్ట్రం వైపుగా కావేరి నది పరవళ్లు తొక్కుతున్నది. నీటి రాక క్రమంగా పెరుగుతుండడంతో మెట్టూరు జలాశయం నిండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇక, హొగ్నెకల్ వద్ద కావేరి ఉధృతిని తిలకించేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కొన్నేళ్లుగా నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముఖం చాటేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ పవనాల ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురిసిన పక్షంలో కావేరి నది పరవళ్లు తొక్కి, మెట్టురు డ్యాంకు నీటిని చేరుస్తుంది. గత ఏడాది కర్ణాటకలో వర్షాలు అంతంత మాత్రమే కావడంతో మెట్టురులోకి నీళ్లూ అంత మాత్రంగానే వచ్చి చేరాయి. ఈశాన్య రుతు పవనాల రాష్ట్రంలో ప్రభావం చూపించడంతో గట్టెక్కారు. అయితే, ఈ ఏడాది రాష్ట్రం మీద మరో మారు నైరుతి కన్నేసింది. దీంతో కర్ణాటకలో వర్షాలు కరిస్తే మెట్టూరు డ్యాంకు నీళ్లు వస్తాయన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, అక్కడ ఆలస్యంగా వర్షాలు పలకరించడంతో ప్రస్తుతం కావేరిలోకి నీటి రాక క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకలోని కృష్ణరాజ సాగర్, కపిని జలాశయాల్లోకి నీటి రాక పెరిగి ఉండడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజులుగా కావేరి నదిలోకి నీళ్లు కర్ణాటక వైపు నుంచి తరలివస్తున్నాయి. వందల్లో వస్తున్న గణపుటడుగుల నీటి శాతం, ప్రస్తుతం వేలల్లోకి చేరింది. ఆదివారానికి పదిహేను వేల వరకు గణపుటడుగుల నీళ్లు ప్రవహిస్తుండటంతో కావేరి పరవళ్ల ఉధృతి పెరిగింది. కావేరి తీర వాసులు నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు నదీ తీరంలోకి పరుగులు తీస్తున్నారు. కావేరి పరవళ్లు: గత ఐదారు రోజులుగా కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలతో, కర్ణాటకలోని జలాశయాల ఉబరి నీటి విడుదలతో మెట్టూరు డ్యాంలోకి నీటి రాక పెరిగింది. భారత నయాగారాగా పేరుగడించిన హొగ్నెకల్ వద్ద నీటి ఉధృతి మరింత పెరగడంతో అక్కడ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో వేలాది మంది హొగ్నెకల్‌కు తరలి వచ్చిన కావేరి పరవళ్లను తిలకించారు. అక్కడ చేపల వంటకాల రుచి చూసి ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, హొగ్నెకల్‌లో నీటి ఉధృతి పెరగడంతో బుట్ట పడవలను నిషేధించారు. దీంతో బుట్ట పడవల్లో కావేరిలో చక్కర్లు కొట్ట లేక పోయామన్న నిరాశ పర్యాటకులకు తప్పలేదు. నీటి ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. హొగ్నెకల్ పరిసరాలతో పాటు కావేరి తీర వాసుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో 42 అడుగుల మేరకు నీటిని కల్గి ఉన్న మెట్టూరు జలాశయం ప్రస్తుతం యాభై అడుగుల చేరువలో ఉండడంతో డెల్టా అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కర్ణాటకలో వర్షాలు మరింతగా తాండవం చేసిన పక్షంలో అక్కడి జలాశయాలు నిండి కావేరిలోకి నీళ్లు మరింతగా పరవళ్లు తొక్కాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలోనూ అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కావేరి తీరంలో మరింత జోరు వాన పడే అవకాశం ఉందన్న సమాచారంతో మెట్టూరు డ్యాం నిండే విధంగా కర్ణాటక వైపు నుంచి నీళ్లు రావాలన్న ఎదురు చూపులు పెరిగాయి. -
బంద్ సక్సెస్
కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘం పిలుపుమేరకు శనివారం నాటి బంద్ విజయవంతమైంది. 90 శాతానికి పైగా అంగళ్లమూతతో దాదాపు సంపూర్ణమైంది. రైల్‌రోకో, రాస్తారోకోలకు పాల్పడిన వేలాదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడుకు చెందాల్సిన కావేరీ వాటా జలాలను ఎగవేసేందుకు మేఘదాతు అనే ప్రాంతంలో కొత్తగా రెండు ఆనకట్టల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ ఆనకట్టల నిర్మాణమే జరిగితే తమిళనాడు రైతులు 48 టీఎంసీల నీటిని కోల్పోనున్నారు. డెల్టా వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. సుప్రీంకోర్టు సైతం వాటా జలాలు ఇచ్చి తీరాల్సిందేనని తీర్పు చెప్పినా తమిళనాడును దొంగదెబ్బతీసేందుకు ఆనకట్టల నిర్మాణం చేపట్టబోతోంది. నిర్మాణంపై స్టే విధించాలని తమిళనాడు ప్రభుత్వం రెండురోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కర్ణాటక దూకుడును అడ్డుకొనేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నాడు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 59 మంది ఈ తీర్మాన ప్రతిని ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. బంద్‌కు పిలుపు: ఇలా ఉండగా, కేంద్రంపై మరింత వత్తిడితెచ్చేలా తిరుచ్చి కేంద్రంగా నడుస్తున్న అఖిలపక్ష రైతు సంఘం నేతృత్వంలో శనివారం నిర్వహించిన బంద్ సంపూర్ణ విజయం సాధించింది. కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, తమాక, వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో ప్రధానంగా వాణిజ్య, వ్యాపార దుకాణాల మూత ద్వారా తమ నిరసన ప్రకటించాలని భావించారు. వారు ఆశించినట్లుగానే వర్తక సంఘాలు సంఘీభావం ప్రకటించగా, 95 శాతం వరకు అంగళ్లు మూతపడ్డాయి. అనేక చోట్ల ఫార్మసీ దుకాణాలను కూడా మూసివేశారు. కోయంబేడులో కాయగూరలు, పండ్లు, పూల దుకాణాలను తెరిచే ఉంచారు.చెన్నై, తిరుచ్చి, కాంచీపురం, తంజావూరు జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది. రైల్‌రోకోలు ః చెన్నై, ఎగ్మూరు, తంజావూర్లలో రైల్రోకోలను నిర్వహించారు.ఎగ్మూరు రైల్వేస్టేషన్ 7వ ఫ్లాట్‌ఫారంపై నిలిచి ఉన్న ఆనంద్‌పురి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు నిలబడి నినాదాలు చేశారు. అయితే ఈ రైలు సాయంత్రం బయలుదేరుతుందని తెలుసుకున్న ఆందోళనకారులు 6వ ఫ్లాట్‌ఫారానికి చేరుకుని మన్నార్‌కుడి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించిన 1,500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 10.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 11.20 గంటలకు స్టేషన్‌ను వీడింది. అలాగే సెంట్రల్ రైల్వేస్టేషన్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించగా అన్ని మార్గాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి ఉండడంతో వాల్టాక్స్ రోడ్డు నుంచి జొరబడ్డారు. 2వ నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న ముంబై ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకోగా 200 మందిని అరెస్ట్ చేశారు. తంజావూరులో తంజై-చెన్నై ఎక్స్ప్రెస్రైలును అడ్డుకునే ప్రయత్నం చేసిన 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాస్తారోకో తిరువత్తియూర్ హైరోడ్డులో, తండయార్‌పేట వద్ద రాస్తారోకోలకు పాల్పడిన 170 మందిని అరెస్ట్ చేశారు. తిరువారూరులో 500 మందిని, నాగపట్నంలో 50 మందిని, మదురైలో 50 మందిని రాస్తారోకో సమయంలో అరెస్ట్‌చేశారు. బంద్ కారణంగా అనేక ప్రాంతాలకు పోలీసు బందోబస్తులో బస్సులను నడిపారు. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మాత్రం బస్సులు తిరగలేదు. స్వల్పసంఖ్యలో కొన్ని బస్సులు కర్ణాటక సరిహద్దులోని హొసూరు వరకు నడిచాయి. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సులు రాలేదు. బంద్ ప్రభావంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
బంద్ సక్సెస్
తమిళనాడు ప్రయోజనాలను కాలరాస్తూ కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడాన్ని నిరసిస్తూ డెల్టా జిల్లాల్లో శనివారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. 3 జిల్లాల్లో చేపట్టిన ఆందోళనల ఫలితంగా సుమారు 1500 మంది అరెస్టయ్యారు. చైన్నై, సాక్షి ప్రతినిధి: కావేరీ నది వాటా జలాలను తమిళనాడు ప్రభుత్వం పోరాడి సాధించుకుంది. రాజకీయపరంగానే కాక, న్యాయపరంగా సుప్రీంకోర్టు ద్వారా హక్కులను పొందగలిగింది. సుప్రీంకోర్టు తీర్పు సైతం తమిళనాడుకు అనుకూలంగా మారడంతో దిక్కుతోచని కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునేలా కొత్తగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సమాయత్తం అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన పక్షంలో తమిళనాడులోని డెల్టా జిల్లాలైన తంజావూరు, నాగపట్నం, తిరువారూరు ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పవు. కావేరి నదీజలాల కిందిప్రాంతమైన తమిళనాడు అంగీకారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టడం చట్టవిరుద్ధమని సీఎం పన్నీర్ సెల్వం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కర్ణాటక దుందుడుకు వైఖరికి కేంద్రం అడ్డుకట్టవేయాలని కోరుతూ డెల్టా జిల్లాలు శనివారం బంద్ పాటించాయి. మూడు జిల్లా ల్లో దుకాణాలు మూతపడ్డాయి. వ్యవసాయ, వ్యాపార సంఘాల ప్రతినిధులు బంద్‌కు నాయకత్వం వహిస్తూ ఆందోళనకు దిగారు. తంజావూరులో ఎండీఎంకే అధినేత వైగో తన అనుచరులతో కలిసి రైల్‌రోకోకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తంజావూరు జిల్లాలో 200 చోట్ల రాస్తారోకో నిర్వహించారు. తిరువారూరులో ప్రయివేటు వైద్యులు సైతం విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. నాగై జిల్లాల్లో పెద్ద ఎత్తున వ ర్తక సంఘాలు బంద్‌లో పాల్గొనగా ప్రయివేటు వాహనాలు నిలిచిపోయాయి. మన్నార్‌కుడిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా వంద మందిని అరెస్ట్ చేశారు. మన్నార్‌కుడి నుంచి మయిలాడుదురై వైపు వెళ్లే రైలును ఆందోళనకారులు అడ్డగించారు. ఈ సంఘటనలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త పార్టీ పెట్టబోతున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ అనుచరులు సైతం బంద్‌కు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. మూడు జిల్లాల్లో డీఎంకే, ఎండీఎంకే, నామ్ తమిళర్ కట్చి తదితర పార్టీలవారు, రైతు సంఘాల నాయకులు కలిపి సుమారు 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహజంగా ఏ బంద్ అయినా మధ్యాహ్నం వేళకు ముగిసే సంప్రదాయూన్ని పారద్రోలి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించడం విశేషం. -
నేడు డెల్టా బంద్
సాక్షి, చెన్నై: కావేరి నదిలో డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ శనివారం డెల్టా బంద్‌కు అన్నదాతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. బంద్ విజయవంతం లక్ష్యంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఐదు వందల చోట్ల నిరసనలకు ఏర్పాట్లు చేశారు. పదిహేను రైల్వే స్టేషన్ల ముట్టడికి సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంకు కావేరి జలాల్ని రానివ్వకుండా చేయడం లక్ష్యంగా కర్ణాటక కుట్రలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వివాదం చేస్తూ వచ్చిన కర్ణాటక పాలకు లు తాజాగా, చుక్కు నీరు తమిళనాడులోకి రాకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. 48 టీఎంసీల సామర్థ్యంతో రెండు డ్యాంలను తమిళనాడుకు సమీపంలోని కర్ణాటక భూ భాగంలో నిర్మిం చేందుకు సన్నద్ధమయ్యూరు. ఈ డ్యాం నిర్మాణం జరిగిన పక్షంలో డెల్టా జిల్లా లు కరువుతో తల్లడిల్లాల్సిందే. ఈ పను ల్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి లేఖాస్త్రంతో సరిపెట్టింది. అయి తే అన్నదాతల్లో ఆగ్రహ జ్వాల బయలుదేరింది. కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కును పరిరక్షించుకోవడం లక్ష్యంగా పోరు బాటకు సిద్ధమైంది. నేడు బంద్: కర్ణాటక ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని, కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ శనివారం నుంచి అన్నదాతలు పోరు బాట చేపట్టనున్నారు. ఇందులోభాగంగా తొలి విడత నిరసనగా డెల్టా బంద్‌కు పిలుపు నిచ్చారు. తిరువారూర్, తంజావూరు , నాగపట్నం జిల్లాల్లో భారీ నిరసనలకు నిర్ణయించారు. ఇందుకు మద్దతు వెల్లువెత్తుతోంది. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటు చిన్నాచితకా పార్టీలు, త్వరలో పార్టీ పెట్టనున్న జికే.వాసన్ మద్దతు ప్రకటించారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు తాము సైతం అని మద్దతు ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల్లో భారీ బలగాల్ని రంగంలోకి దించారు. ఐదు వందల చోట్ల నిరసనలు: బంద్ విజయవంతం లక్ష్యంగా అన్ని పార్టీలు, సంఘాలు ఉరకలు తీస్తున్నాయి. దీంతో ఆ మూడు జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప, వాణిజ్య సమూదాయాలు, అన్ని రకాలు దుకాణాలు మూత బడనున్నాయి. అలాగే, ప్రైవేటు బస్సులు, లారీలు, ఇతర వాహన యాజమాన్యాలు సైతం బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. తమ భవిష్యత్తు లక్ష్యం గా శనివారం ఎలాంటి సేవలు ఉండబోవని, అన్ని బంద్ అని ప్రజాసంఘాలు ప్రకటించాయి. ఈ విషయంగా ఈ బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘం నాయకుడు పీఆర్ పాండి మనోజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తమ బంద్‌కు మద్దతు వెల్లువెత్తుతోందన్నారు. ఉదయం ఆరు గంట ల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ప్రాంతాలు నిర్మానుష్యం కానున్నాయని, ప్రజాపయోగ సేవలు బంద్ కాబోతున్నాయని వివరించారు. ఐదు వందల ప్రదేశాల్లో రాస్తారోకోలకు నిర్ణయించామని తెలిపారు. తంజావూరు, పాపనాశం, మైలాడుతురై,నాగపట్నం, మన్నార్‌కుడి, నీడా మంగళం తదితర పదిహేను రైల్వే స్టేషన్లను మట్టుడించనున్నామని రైళ్ల సేవల్ని అడ్డుకోనున్నామని ప్రకటించారు. తంజావూరులో జరిగే రైల్‌రోకోకు ఎండీఎంకే నేత వైగో, మైలాడుతురైలో వాణిజ్య సంఘం నేత వెల్లయ్యన్ నేతృత్వం వహించనున్నారని తెలిపారు. -
‘కావేరి’ రగడ!
* కర్ణాటకలో రెండు కొత్త డ్యాంలు * అడ్డుకట్ట కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం * అఖిలపక్షానికి కరుణ పిలుపు సాక్షి, చెన్నై: కావేరి జల వివాదం తమిళనాడు, కర్ణాటకల మధ్య మళ్లీ తాండవం చేయబోతున్నది. తమిళనాడుకు వచ్చే నీటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ర్టంలో రెండు కొత్త డ్యాంలకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తక్షణం అసెంబ్లీ సమావేశానికి, అఖిల పక్షానికి చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడుల మధ్య కొత్తేమీ కాదు. ఈ వివాదం ప్రతి ఏటా జఠిలం అవుతూనే ఉంది. ఈ వివాదం పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ సైతం తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కావేరి నదీ జలాల మీద ఆధార పడ్డ డెల్టా జిల్లా అన్నదాతలు ఆనందంలో మునిగారు. అయితే, ఆ తీర్పును ధిక్కరించే రీతిలో కర్ణాటక సర్కారు, తీర్పును అమలు చేయించలేని పరిస్థితుల్లో కేంద్ర పాలకులు ఉండడం డెల్టా అన్నదాత పాలిట శాపంగా మారింది. కావేరి నదీ జలాల్ని సక్రమంగా విడుదల చేయని కర్ణాటక సర్కారు, వర్షాల రూపంలో వచ్చే ఉబరి నీటిని సైతం అడ్డుకునేందుకు రెడీ అయింది. మరో రెండు డ్యాంలు: గతంలో ఓ మారు కర్ణాటకలో విస్తారంగానే వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణ రాజ సాగర్, కబిని డ్యాంలు నిండే స్థాయికి చేరడంతో ఆ నీళ్లు ఉబరి నీళ్లుగా తమిళనాడులోని మెట్టూరు డ్యాంకు చేరాయి. అయితే, తమిళనాడు మీద కన్నెర్ర చేసిన కర్ణాటక పాలకులు ఆ ఉబరి నీటిని అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నించారు. దీనిని అప్పటి డీఎంకే సర్కారు గట్టిగానే తిప్పి కొట్టింది. ప్రస్తుతం అదే బాటలో మళ్లీ పయనించే పనిలో కర్ణాటక సర్కారు నిమగ్నం అయింది. రెండేళ్లుగా నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు కర్ణాటకను కరుణిస్తుండడంతో, ఉబరి నీరు కావేరి నదిలో పరవళ్లు తొక్కుతూ తమిళనాడుకు వచ్చి చేరుతున్నాయి. ఆ నీరు మెట్టూరు డ్యాంకు చేరినప్పుడు మాత్రం నీటి సమస్య తీరడం, మిగిలిన సమయాల్లో జల సం కటం ఎదుర్కొనడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వర్షాకాలంలో తమిళనాడుకు ఉబరి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోవడానికి మేఘదాత్తు వద్ద రెండు డ్యాంల నిర్మాణానికి పరిశీలన పూర్తి చేసి, అందుకు తగ్గ చర్యల్లో కర్ణాటక నిమగ్నం కావడం మళ్లీ రెండు రాష్ట్రా ల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది. కర్ణాటక ఎత్తులతో షాక్: ఓ వైపు కేరళ వైఖరిపై తమిళనాడులోని దక్షిణాది జిల్లాల అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్లై పెరియార్ నీటి మట్టం పెంపు, పాంబన్ నీళ్లు అమరావతిలోకి రానివ్వకుండా చేయడం కోసం ఆ తీరంలో ఓ డ్యాం నిర్మాణానికి కేరళ చర్యలు చేపట్టడం అక్కడి అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళ బాణిలో కర్ణాటక సైతం తమిళనాడుకు నీళ్లు రాకుండా అడ్డుకునే పనిలో పడడం డెల్టా అన్నదాతల్లో ఆగ్రహ జ్వాలను రగుల్చుతోంది. చాప కింద నీరులా అన్ని చర్యల్ని చేపట్టి డ్యాం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు వేగవంతం చేయడం తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఎలాంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సేకరించక పోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది. అఖిల పక్షానికి పిలుపు : కర్ణాటక అధికారిక ప్రకటనతో రెండు రాష్ట్రాల మధ్య ఆగ్రహ జ్వాల రాజుకునే అవకాశాలు అధికం అయ్యా యి. డెల్టా అన్నదాతలు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు డ్యాంలలో 44 టీఎంసీల చొప్పున నీళ్లు నిల్వ ఉంచే విధంగా నిర్మాణాలు సాగబోతుండడంతో ఇక డెల్టా జిల్లాలు కరువు ప్రాంతాలుగా మా రడం ఖాయం అన్న ఆందోళన అన్నదాతల్లో బయలు దేరింది. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటే తక్షణం అఖిల పక్షానికి పిలుపు నివ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశ పరచి ఆ డ్యాంల నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జీకేవాసన్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక చర్యల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. సీఎం సమీక్ష: కర్ణాటక అధికారిక ప్రకటనతో అడ్డుకట్ట లక్ష్యంగా ప్రత్యామ్నాయ కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం ము నిగి ఉన్నారు. ఆగమేఘాలపై సచివాలయంలో ఆయ న అధికారులతో సమీక్షించారు. కర్ణాటక చేపట్టదలచి న నిర్మాణాలు, తద్వారా తమిళనాడుకు ఎదురయ్యే సంకట పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీశారు. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసే పనిలో పడ్డారు. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, తమకు కావేరి మీద ఉన్న హక్కుల్ని వివరి స్తూ, కావేరి పరిరక్షణ కమిటీ, కావేరి అభివృద్ధిబోర్డు ఏర్పాటు నినాదంతో, కర్ణాటక కొత్త డ్యాం ప్రయత్నాలకు అడ్డుకట్ట లక్ష్యంగా ప్రధానికి లేఖాస్త్రం సంధించే పనిలో పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకునే అవకాశాలు కన్పిస్తుండడంతో భద్రతను సరిహద్దుల్లో పెంచారు. కర్ణాటక బస్సులకు భద్రత కల్పించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.