అనుసంధానమా? అపహరణమా? | Sakshi Guest Column On Godavari Kaveri Linkage of rivers | Sakshi
Sakshi News home page

అనుసంధానమా? అపహరణమా?

Published Fri, Aug 30 2024 3:48 AM | Last Updated on Fri, Aug 30 2024 3:48 AM

Sakshi Guest Column On Godavari Kaveri Linkage of rivers

అభిప్రాయం

 

గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఫైళ్ళు ఢిల్లీలో వేగంగా కదులుతున్నాయి. అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖా మంత్రిగా వున్న నితిన్‌ గడ్కరీ 2017లో తొలిసారిగా ఈ ప్రాజె క్టును ప్రతిపాదించారు. 2019 జనవరిలో స్వయంగా అమరావతి వచ్చి, 60 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపడు తున్నట్టు ప్రకటించారు.  
నిజంగా ఉన్నాయో లేవో స్పష్టంగా తెలియని గోదా వరి అదనపు జలాలే కావేరి అనుసంధానం ప్రాజెక్టు రూపకల్పనకు ఆధారం. ప్రతి ఏటా 1,100 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. చెన్నై సభలో నితిన్‌ గడ్కరీ ఏకంగా ఏటా 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నదని వ్యాఖ్యానించారు. 

జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90 శాతం నిధుల్ని అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే కనుక అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం ఆనందించిందేగానీ, దీని వెనుక నున్న వాటర్‌ హైజాక్‌ కుట్రను గమనించలేదు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే మాట నిజం. ఇందులో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో వుంది. 

దక్షణాదిలో ఆ ఒక్క రాష్ట్రాన్ని అయినా కాపాడుకోకుంటే ‘ఉత్తరాది హిందీ పార్టీ’ అనే నింద తప్పదు. గోదావరి నీటిని ఎరగా చూపి తమిళ నాడులోనూ కాలు మోపాలనే ఆశ బీజేపీలో చాలా కాలంగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడమే విచిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదాలు నడుస్తున్నాయి. కావేరి అనుసంధానం ఈ వివాదాల్ని పరిష్కరిస్తుందా? మరింతగా పెంచుతుందా? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. 

1980 నాటి బచావత్‌ ట్రిబ్యునల్‌ గోదావరి నదిలో 3,565 టీఎంసీల నికర జలాలున్నట్టు తేల్చింది. అప్పట్లో గోదావరి నది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సాల మీదుగా ప్రవహించేది. ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. గోదావరి నది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 1,495 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్‌ 85లో ఈ నీటిని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు 64 శాతం, తెలంగాణకు 36 శాతం చొప్పున పంపిణీ చేశారు. 

కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ. అయినప్పటికీ, బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణానది నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ వాటా ఇచ్చింది. దానికి రెండు హేతువులు చెప్పింది. మొదటిది, కృష్ణానది మీద తొలి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో ఏర్పడ్డాయి. 

రెండోది, నిర్మాణం పూర్తయి ఆయకట్టు కలిగున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపును ఇచ్చి తీరాలి. అయితే, దీనికో పరిష్కారం కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ సూచించింది. భవిష్యత్తులో గోదావరి బేసిన్‌ నుండి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్ళిస్తే, అందులో 18 శాతం మహారాష్ట్రకు, 27 శాతం కర్ణాటకకు కృష్ణా నికర జలాల నుండి ఇవ్వాలని ఓ నియమం పెట్టింది. 

పోలవరం నుండి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్ళిస్తే   అందులో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందుతాయి. మిగిలిన 45 టీఎంసీల్లో 36 శాతం అంటే 16 టీఎంసీలు తమకు వస్తాయని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్నది. పోలవరం నుండి మళ్ళించే 80 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా దక్కేది 29 టీఎంసీలే. కృష్ణా, గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నికర జలాలను జనాభా ప్రాతిపదికన కాకుండా, పరి వాహక ప్రాంతం ప్రాతిపదికన పంచాలని తెలంగాణ వాదిస్తోంది. 

గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో మూడు దశలున్నాయి. మొదటి దశలో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌ మధ్య గోదావరి–కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తారు. రెండో దశలో నాగార్జునసాగర్, సోమశిల ప్రాజెక్టుల మధ్య కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానం చేస్తారు. మూడవ దశలో సోమశిల నుండి కట్టలాయ్‌ మధ్య పెన్నా, కావేరి నదుల్ని అనుసంధానం చేస్తారు. పెన్నా– కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు 2022 కేంద్ర బడ్జెట్‌లోనే నిధుల్ని కేటాయించారు. 

ఈ నాలుగు నదుల అనుసంధానానికి ముందు, ఆ తరువాత కూడా మరో మూడు నదుల అనుసంధానాలు ఉన్నాయి. ఉత్తరాన  మహానదిని గోదావరి నదితో అనుసంధానం చేస్తారు. దక్షిణాన కావేరి నదిని తమిళనాడులోని వాగాయ్, గుండార్‌ నదులతో  అనుసంధానం చేస్తారు. కావేరి–గుండార్‌ ప్రాజెక్టును కర్ణాటక వ్యతిరేకిస్తున్నది. అయినప్పటికీ, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ఇప్ప టికే మొదలు పెట్టేసింది. 

భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కన్నా చిన్న తరహా ప్రాజెక్టులే మేలనేది ఇప్పుడు బలపడుతున్న అభిప్రాయం. నీటి పారుదల ప్రాజెక్టుల్ని సమర్థంగా నిర్వహిస్తున్న ఉదా హరణ మనకు ఒక్కటీ కనిపించదు. తుంగభద్రా డ్యామ్‌ గేటు కొట్టుకొని పోవడం దీనికి తాజా ఉదాహరణ. స్టాప్‌ లాగ్‌ గేట్లు, కౌంటర్‌ వెయిట్‌ వ్యవస్థ, ఇతర పరికరాలు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలనే ఆలోచన కూడ నీటిపారుదల శాఖ అధికారులకు రాలేదు. ఆ గేట్లకు కొన్నేళ్ళుగా కనీసం గ్రీజు కూడా పెట్టలేదట. 

నదుల అనుసంధానం వల్ల నాలుగు రకాల నష్టాలు ఉంటాయి.  మొదటిది – పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుంది. రెండోది – నదులు, నీటి వనరుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనికి పోతాయి. మూడోది – జల వనరులపై వాణిజ్య హక్కుల్ని మెగా కార్పొరేట్లకు అప్పగించడానికి దారులు తెరచుకుంటాయి. నాలుగోది – ప్రతి ఏటా నది నీళ్ళు సముద్రం లోనికి పారకపోతే సముద్రం నది వైపునకు దూసుకుని వచ్చి డెల్టా భూముల్ని చవిటి పర్రలుగా మార్చేస్తుంది.   

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. జూలై నెలలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ వర్చువల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుండి మొదలెట్టాలని కోరింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుల  కన్నా ఏపీలోని పోలవరం నుండి మొదలెడితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. నరసా రావుపేట సమీపాన బొల్లపల్లె వద్ద 300 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మిస్తే అక్కడి నుండి పెన్నా నదికి సులువుగా అనుసంధానం చేయవచ్చని సూచించింది.   

ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో కొన్ని కొత్త చిక్కులున్నాయి. ఇందులో కీలకమైనది అసలు గోదావరి నదిలో వెయ్యి టీఎంసీల అదనపు జలాలున్నాయని ఎలా, ఎక్కడ, ఎప్పుడు నిర్ధారిస్తారు? గోదావరి నది మీద చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం. అక్కడ తేల్చాలి అదనపు జలాలు ఉన్నాయో లేవో! సాధారణంగా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు ఆగస్టు నెలలో వస్తాయి. ఆగస్టు నెలలో పోలవరం నుండి కావేరి ప్రాజెక్టుకు వెయ్యి టీఎంసీల నీళ్లు విడుదల చేసేస్తే, ఆ తరువాతి నెలల్లో నదిలోనికి అనుకున్నంత నీరు రాకపోతే ఏమిటీ పరిస్థితీ? గోదావరి డెల్టా ఆయకట్టుకు 175 సంవత్సరాలుగా ఉన్న లోయర్‌ రైపేరియన్‌ హక్కులు ఏం కావాలి? అంతేకాదు; ఎగువ రాష్ట్రాల నుండి ఇంకో సమస్య కూడా వస్తుంది. గోదావరి బేసిన్‌ నుండి కృష్ణా బేసిన్‌కు వెయ్యి టీఎంసీల నీటిని మళ్ళిస్తే ఎగువ రాష్ట్రాలు అందులో వాటా కోరకుండా వుంటాయా? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని సాగునీటి సంక్షోభంలోకి నెట్టే పథకం ఇది.

డానీ 
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement