విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి, అక్కడి నుండి శివుడి జటా జూటంలో పడి, హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నదని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా అక్కడ జరుపుతారు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమ యాన్ని ‘కుంభమేళా’ అనీ, ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అనీ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ‘మాఘీమేళా’ అనీ పిలుస్తారు. ‘కుంభము’ అంటే బాండము అనీ, ‘కలశం’ అనీ మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభ మేళా జరుగుతుంది. ‘సూర్యుడు మకర రాశిలో, బృహ స్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా’, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధ కుంభమేళా జరుగుతుంది.
కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగు తున్న సాంప్రదాయిక ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, అఖాడాలు ముందు నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా అను సరిస్తారు. అనంతరం ‘షాహిస్నాన్’ (పుణ్యస్నానాలు) ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు.
వీరంతా ‘ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలు మూలల నుండి 128 ఆరాధన మార్గాలకు చెందిన ‘సంత్ సమ్మేళనం’, 27వ తేదీన ‘యువ సంత్’ (యువ సన్యా సుల) సమ్మేళనం జరుగబోతున్నది ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్ని వేశం కుంభమేళ. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017లో అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొ న్నట్లు, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ఆధ్యా త్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తు చేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరు గుబాటు ఆందోళనలు జరగడానికి, స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి.
నానా సాహెబ్ పీష్వా, ధుంధుపంత్, బాలాసాహెబ్ పేష్వా, తాంతియా తోపే, ఝాన్సీరాణి లక్ష్మిబాయి, రంగోజి బాపు, జగదీష్పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలను కూడా భాగస్వాములు కావాలనే సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును, రొట్టెలను ప్రసా దంగా పంచి పెట్టాలని ఇక్కడే నిర్ణయించారు.
ఈ సంవత్సరం ప్రయాగరాజ్ ‘మహా కుంభమేళా’ జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగ బోతోంది. కుంభమేళా వల్ల ఉత్తరప్రదేశ్‌కు 1.2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. భక్తులకు ఏర్పాట్లు సౌకర్యాల నిమిత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రూ. 2,100 కోట్లు విడు దల చేయాలని నిర్ణయించింది. అలాగే కుంభ మేళ్లా జరిగే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా భారీగా నిధులను కేటా యించి ఈ అద్భుత యజ్ఞాన్ని నిర్వహించ తలపెట్టడం ముదావహం.
మహా కుంభమేళా జరిగే స్థలాలు
గంగానదిలో (హరిద్వార్– ఉత్తరాఖండ్)
క్షిప్రానదిలో (ఉజ్జయిని– మధ్యప్రదేశ్)
గోదావరి నదిలో (నాసిక్– మహారాష్ట్ర)
గంగా నదిలో (ప్రయాగ్‌రాజ్–ఉత్తరప్రదేశ్;
గంగా, యమునా, అంతర్వాహినిగా ప్రవహి స్తున్న సరస్వతి నది సంగమం వద్ద.)
ముఖ్యమైన రోజులు
1. పౌష్య పూర్ణిమ: జనవరి 13 సోమవారం
2. మకర సంక్రాంతి: జనవరి 14 మంగళవారం– మొదటి షాహిస్నానం.
3. మౌని అమావాస్య (సోమవతి): జనవరి 29 బుధవారం– రెండవ షాహిస్నానం.
4. వసంత పంచమి: ఫిబ్రవరి 3 సోమవారం– మూడవ షాహిస్నానం.
5. మాఘీ పూర్ణిమ: ఫిబ్రవరి 12 బుధవారం
6. మహాశివరాత్రి: ఫిబ్రవరి 26 బుధవారం
– ఆకారపు కేశవరాజు ‘ వీహెచ్‌పీ కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment