మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతకలిగిన మహాసమారోహం. గంగా నదీ తీరంలో కూడే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. మహా కుంభ మేళాకు సుమారు 40 కోట్ల్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. పురాణాల ప్రకారం, దేవతలు అసురులు అమృతాన్ని పొదేందుకు కలసి సముద్ర మథనాన్ని నిర్వహించారు. అమృతపు కుంభం (పాత్ర)నుంచి నాలుగు బిందువులు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్‌లలో పడ్డాయి. అవి పడ్డ ఈ నాలుగు ప్రదేశాలూ కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా స్థిరపడ్డాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (మునుపటి అలహాబాద్) లో జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.
కుంభమేళాలో పాల్గొనడం పాపవిమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. భారతదేశంలోని వివిధ ్రపాంతాల నుండి వచ్చిన సాధువులు, నాగసాధువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమారోహంలో పాల్గొంటారు. ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం, భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. పండితులు, ఆధ్యాత్మిక గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై ఆసక్తికరమైన చర్చలు నిర్వహిస్తారు. ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
పర్యావరణ పరిరక్షణ...
ఈసారి కుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ్రపాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నదీజలాల శుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఉత్సవంలో పాల్గొనడం అందరూ సుకృతంగా భావిస్తారు. ‘కుంభమేళా భారతదేశపు ఆధ్యాత్మికత, ఐక్యత, విశ్వభావనల ప్రతీక. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పే ఈ‘మహాకుంభమేళా’ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు పవిత్ర గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో జరగనుంది.
చరిత్ర...
మరో పారాణిక గాథ ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ‘నీవు అమృతభాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్భలపై ఉంచితే నీవు, నీ తల్లి విముక్తులు కాగలరు. అప్పుడు నేను వెంటనే ఆ అమృతాన్ని దేవలోకం తీసుకొని వెళ్తాను’ అని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే ఆ కలశం నుంచి భూలోకం లో నాలుగు నదులలో నాలుగుచోట్ల కొన్ని అమృతం చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశాలను పుణ్యస్థలాలుగా... పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ్రపారంభమైంది.
ధర్మరక్షణ కోసం...
కుంభమేళాలో సాంప్రదాయిక ఊరేగింపు జరిగేటప్పుడు నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండ గా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ,’ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’.
పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంటుంది.అలనాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్‌ను సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 లో బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు. తులసీ రామాయణాన్ని రచించిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.
వెల్లివిరిసే సమరసత...
పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్లమంది ప్రజలు కలిసి వచ్చి ్రపాంతీయ, భాషా, కుల భేదాలు మరచి తరతమ భేదాలు లేకుండా కుంభమేళా సందర్భంగా కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ ఆవాసాలు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, సాంస్కృతిక ప్రదర్శనలు
నిర్వహించారు.
పుణ్యస్నానాలు మాత్రమే కాదు..
కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునులచేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ్రపాంతంలోనే ఉండి కఠినసాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న ఎన్నో విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. పాటించవలసిన మంచిని బోధించి సమాజానికి మార్గదర్శనం చేసి చూపించే ఈ çకుంభమేళాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం అవసరం.
కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు
1. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో,
2. మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షీరాబ్ది నదిలో,
3. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో
4. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని‘కుంభమేళా’ అని. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ’మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 2025 మేళా ముఖ్యమైన తేదీలు జనవరి 13 పూర్ణిమ సందర్భంగా, మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 03 వసంత పంచమి, ఫిబ్రవరి 12మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment